హంద్రీనీవా ప్రధాన కాలువలో 3250 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని చూసి తన ‘మనసు పులకరించిందని‘ ఎక్స్ ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన నేపథ్యంలో హంద్రీ – నీవా పూర్తి ఆయకట్టుకు నీరు అందించి ‘రైతుల మనసులు‘ కూడా ఆనందంతో పులకరించేలా ముఖ్యమంత్రి కార్యాచరణ చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రారంభమైన హంద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మాణం నేటికీ నత్త నడకన సాగుతోందని విచారం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం మొదలైన తర్వాత మొత్తంగా 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు నిర్వహించినా ఈ ప్రాజెక్టు పురోగతి ముందగించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆలస్యంగానైనా నేటికీ 3,250 క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువలో ప్రవహించేలా కృషి చేసిన చంద్రబాబు నాయుడుకు బొజ్జా అభినందనలు తెలియజేశారు.
ఈ ప్రాజెక్టు లక్ష్యం 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం... కానీ ఆ లక్ష్యంలో 15% ఆయకట్టుకు కూడా నీరు అందని పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి దశలో మొట్ట మొదటి పెద్ద రిజర్వాయర్ పందికోన రిజర్వాయర్ ద్వారా కరువు పీడిత పశ్చిమ కర్నూలు ప్రాంతంలో 61,400 ఎకరాలకు నీరు అందించాల్సింది. కానీ నేటికీ 10,000 ఎకరాలకు కూడా నీరు అందించలేని పరిస్థితి ఉందని తెలిపారు.
ఇదే సందర్భంలో కర్నూలు పక్షిమ ప్రాంతంలోని డోన్, పత్తికొండ నియోజకవర్గాలలోని 106 చెరువులకు హంద్రీనీవా నీటిని నింపి కోనసీమ చేస్తామని 2014 నుండి ప్రకటన చేస్తూ వచ్చిన మీ ప్రభుత్వమే దీన్ని 66 చెరువులకు కుదించింది. నేడు 66 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీటిని నింపడానికి ఏర్పాట్లు అన్నీ జరిగినా కేవలం నిర్వహణ సంబంధించిన ఏజెంట్లను ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంతం త్రాగు, సాగునీరు అందక కరువుతో అల్లాడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్ల పూర్తిస్థాయి నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీస్, పంట కాలువల నిర్వహణ, చెరువులకు నీటి పంపిణీ నిర్మాణ సంస్థ ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారించి డోన్, పత్తికొండ నియోజకవర్గాలలోని 66 చెరువులకు, పందికోన రిజర్వాయర్ ఆయకట్టుతో సహా హంద్రీ–నీవా ఆయకట్టుకు పూర్తిగా నీరు అందేలా చేయాలని చంద్రబాబునాకి బొజ్జా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దీనికి తగినట్లుగా కార్యాచరణ చేపట్టి పూర్తి చేసిన రోజే ‘రైతుల మనసు నిజంగా పులకరిస్తుంది‘ అని బొజ్జా పేర్కొన్నారు.