కేసీఆర్ కనబడేది 2025లోనేనా ?
x

కేసీఆర్ కనబడేది 2025లోనేనా ?

2023లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్(KCR Farm House) ఫాంహౌసుకు మాత్రమే పరిమితమయ్యారు.


ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఫాంహౌస్ దాటి బయటకు వచ్చేదెప్పుడు ? ఈ ప్రశ్న పార్టీ నేతలు, క్యాడర్ కే కాదు మామూలు జనాలకు కూడా అర్ధంకావటంలేదు. ఎందుకంటే 2023లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్(KCR Farm House) ఫాంహౌసుకు మాత్రమే పరిమితమయ్యారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కనిపించిన కేసీఆర్ తర్వాత ఒకసారి మీడియా సమావేశంలోను ఆ తర్వాత అసెంబ్లీ(T Assembly)లో, అసెంబ్లీ మీడియా పాయింట్ లోను కనిపించారంతే. మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చీరేస్తామని, నిద్రపోనివ్వమని ఏదేదో మాట్లాడారు. అదంతా నిజమే అనుకున్నారు అందరు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ జనాల్లోకి రాలేదు.

ఇపుడిదంతా ఎందుకంటే ‘ఆస్క్ కేటీఆర్’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విట్టర్(Twitter) వేదికగా తన అభిమానులతో మాట్లాడారు. వాళ్ళడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగానే ఒక అభిమాని ప్రశ్నవేశాడు. అదేమిటంటే ‘జనాల్లోకి కేసీఆర్ ఎందుకు రావటంలేదు ? సమస్యలపై ఎందుకు తన గళం వినిపించటంలేదు ? ఆయన ఆరోగ్యం సరిగా లేదా’ అని. అభిమాని వేసిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ‘సమస్యలపై తమకు ప్రతిరోజు మార్గదర్శనం చేస్తున్న’ట్లు చెప్పారు. ‘బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చార’ని చెప్పారు. ‘ఎన్నికలపుడు చేసిన 420 హామీల అమలుకు ప్రభుత్వానికి కేసీఆర్ కొంత సమయం ఇచ్చార’ట. 2025 తర్వాత కేసీఆర్ ను జనాల్లో చూడచ్చు అని కేటీఆర్ చెప్పారు.

పై సమాధానాలు విన్న తర్వాత ఈ ఏడాదిలోపు కేసీఆర్ జనాల్లోకి రారన్న విషయం స్పష్టమైపోయింది. బాధ్యతగల ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ హామీల అమలుకు కేసీఆర్ కొంత సమయం ఇచ్చారని కేటీఆర్ చెప్పటమే పెద్ద జోక్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని, భూటకమని, జనాలను కాంగ్రెస్ మోసంచేసి గెలిచిందని కేటీఆర్, హరీష్ ఎంతగా గోలచేస్తున్నారో అందరు చూస్తున్నదే. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్(BRS) నేతలు తప్పుపడుతు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇచ్చిన హామీల అమలుకు ఇక ప్రభుత్వానికి సమయం ఇచ్చిందెక్కడ ? ప్రతిరోజు ఏదో రూపంలో కేటీఆర్, హరీష్(HarishRao) తదితరులు ప్రభుత్వంపైన ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతు బురదచల్లుతునే ఉన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే సెక్రటేరియట్(Secretariat) కు వచ్చింది లేదు అలాంటిది ఓడిపోయిన తర్వాత జనాల్లోకి వస్తారని సదరు అభిమాని ఎలాగ అనుకున్నాడో. ముఖ్యమంత్రిగా పదేళ్ళ కాలంలో పట్టుమని పదిరోజులు కూడా వరుసగా కేసీఆర్ సచివాలయంకు వచ్చింది అనుమానమే. మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలన్నా కేసీఆర్ అవకాశం ఇచ్చింది లేదు. తాను ఎవరిని కలవాలని కేసీఆర్ అనుకున్నారో వారిని మాత్రమే ఫాంహౌసుకు పిలిపించుకునే వారంతే. మిగిలిన వాళ్ళంతా కేటీఆర్ ను కలిసి అదే మహాభాగ్యమని అనుకునేవాళ్ళు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా లీడర్లు ఎవరైనా కలవాలంటే అవకాశం ఉండటంలేదని పార్టీలో ఇంటర్నల్ టాక్ వినబడుతునే ఉంది. ఏదేమైనా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేసీఆర్ జనాల్లోకి రావాలంటే 2025 రావాల్సిందే. చూద్దాం ఎంతలోకి వస్తుంది 2025.

Read More
Next Story