అమరావతి విశ్వనగరంగా ఎప్పుడవుతుంది?
x

అమరావతి విశ్వనగరంగా ఎప్పుడవుతుంది?

ఆంధ్రప్రదేశ్ ఆశల సౌధం అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది. ఎప్పటి నుంచి దీని ఫలితాలు అందుబాటులోకి వస్తాయి?


అమరావతిని విశ్వనగరంగా (గ్లోబల్ సిటీ) తీర్చిదిద్దాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం దీర్ఘకాలిక, బహుముఖ వ్యూహంపై ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పలు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఫౌండేషన్ స్టేజ్ లోనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, ప్రైవేట్ పెట్టుబడి దారులను ఆహ్వానించడం, ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా చేయడం జరుగుతోంది. రానున్న నాలుగేళ్లలో సచివాలయం పూర్తయి, పూర్తి స్థాయిలో ఏపీ పాలకు ఇక్కడి నుంచి పాలన అందించే అవకాశం ఉంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి

అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో (రోడ్లు, డ్రైనేజీ, గ్రీన్ బిల్డింగ్స్) నిర్మించేందుకు రూ. 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన జరిగింది. ఇందులో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాసాలు, మంత్రుల గృహ సముదాయాలు ఉన్నాయి. అదనంగా రూ. 57,962 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది.

ఆర్థిక కేంద్రంగా రూపొందించడం

అమరావతిని ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హరిత శక్తి, స్వచ్ఛ పరిశ్రమల కేంద్రంగా మార్చే లక్ష్యం ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, స్టార్టప్ ఫండ్ (రూ. 2-7 లక్షల సాయం), క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రాజెక్ట్ (రూ. 25,000 ఉద్యోగాల లక్ష్యం) వంటి ప్రాజెక్టులు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ

ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా (సెల్ఫ్-ఫైనాన్స్ మోడల్) సీఆర్డీఏ నిధులు సమకూర్చుకుంటోంది. ప్రైవేటు సంస్థలను ఆకర్షిస్తోంది. ఉదాహరణకు లులు గ్రూప్ అమరావతిలో మాల్స్ నిర్మాణానికి సానుకూలంగా ఉంది.

కనెక్టివిటీ మెరుగుదల

అమరావతిని చుట్టూ ఉండే 140 మీటర్ల వెడల్పు గల అవుటర్ రింగ్ రోడ్ (రూ. 35,000 కోట్లు), అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రాజెక్టులు రవాణా కేంద్రంగా అమరాతిని మార్చనున్నాయి.

విద్య, పరిశోధన

ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్, బిట్స్ క్యాంపస్, ఎన్ఐడీ, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వంటి సంస్థలు అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాయి. ఈ సంస్థలు పరిశోధన, ఉపాధి కల్పనపై దృష్టి పెడతాయి.

కేంద్ర ప్రభుత్వ మద్దతు

కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధికి రూ. 15,000 కోట్ల రుణ సహకారం (ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు), రూ. 1,500 కోట్ల గ్రాంట్‌ను అందిస్తోంది.

ఎన్నేళ్లలో విశ్వనగరంగా ఆవిర్భవించే అవకాశం?

విశ్వనగరంగా అమరావతి ఆవిర్భవించడం దశలవారీ ప్రక్రియ. హైదరాబాద్ వంటి నగరాలు ప్రపంచ స్థాయికి చేరడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. అమరావతి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది.

తక్షణ లక్ష్యం (3-5 సంవత్సరాలు)

2028 నాటికి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రధాన భవనాల నిర్మాణం పూర్తవుతుందని అంచనా. మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ వంటివి కూడా ఈ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.

మధ్యకాల లక్ష్యం (10-15 సంవత్సరాలు)

2035-2040 నాటికి అమరావతి ఐటీ, ఏఐ, హరిత శక్తి రంగాలలో ఆర్థిక కేంద్రంగా, విద్యా సంస్థల హబ్‌గా స్థిరపడే అవకాశం ఉంది. ఈ దశలో ప్రైవేటు పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

దీర్ఘకాల లక్ష్యం (25-30 సంవత్సరాలు)

2045-2055 నాటికి అమరావతి ప్రపంచ టాప్-5 నగరాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది రాజకీయ స్థిరత్వం, నిరంతర పెట్టుబడులు, మరియు అంతర్జాతీయ గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది.

పెట్టుబడులు పెట్టే వారు ఎవరు?

కేంద్ర ప్రభుత్వం (రూ. 1,500 కోట్ల గ్రాంట్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (రూ. 15,000 కోట్ల రుణం) పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇక ప్రైవేట్ సంస్థలైన లులు గ్రూప్ ద్వారా అమరావతిలో మాల్స్ నిర్మాణం. క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ట్రాన్స్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ కోసం పెట్టుబడి పెట్ట నుంది. 25,000 ఉద్యోగాల లక్ష్యం. ఎక్స్ఎల్ఆర్ఐ, బిట్స్, ఎన్ఐడీ వంటి విద్యా సంస్థలు క్యాంపస్‌ల నిర్మాణానికి పెట్టుబడి పెట్టనున్నాయి. భూములను స్వచ్ఛందంగా అందించిన రైతులు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు.

ఇప్పటి వరకు 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయింపు రాష్ట్ర రాజదాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో పలు సంస్థలకు భూముల కేటాయింపుకు సంబందించి మంత్రుల బృందం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఏడు సంస్థలకు భూములను కేటాయించారు. న్యాయ విశ్వ విద్యాలయాలనికి 55 ఎకరాలు, క్వాంటమ్ వేలీకి 50 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖకు 0.78 ఎకరాలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్ హెడ్ ఆఫీసుకి 0.40 ఎకరాలు, ఐఆర్సిటిసి హోటల్స్ కి ఒక ఎకరం కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అదే విధంగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూకు గతంలో 15 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, అయితే వైద్య కళాశాల నిర్మాణానికి ఇప్పుడు మరో 6 ఎకరాలను కేటాయించడం జరిగిందన్నారు. గతంలో 64 సంస్థలకు భూములను కేటాయించగా, ఇప్పటి వరకూ మొత్తం 71 సంస్థలకు 1,050 ఎకరాలను కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

అమరావతిలో పలు నిర్మాణాలకు ఆమోదం

రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికై నాలుగు ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణానానికై రూ.1,732.31 కోట్ల విలువైన పనుల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. 2014-19 మద్య కాలంలో చేపట్టిన గజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్ల విలువైన టెండర్లకు, బాహ్య మౌలిక సధుపాయాల కల్పనకు రూ.194.73 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డిఏ సమావేశం లో ఆమోదం లభించింది. నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసాలకోసం తొమ్మిది టవర్ల నిర్మాణానికై రూ.506.67 కోట్ల విలువైన టెండర్లకు, మరో 12 టవర్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డీఏ సమావేశం ఆమోదం తెలిపింది.

190 MLD సామర్థ్యంగల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి, ఐదేళ్ల పాటు ఆపరేషన్, నిర్వహణకై రూ.560.57 కోట్ల విలువైన టెండర్లకు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.494.86 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డీఏ ఆమోదించింది. జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే ఇ-3, ఇ-13, ఇ-15 రోడ్ల నిర్మాణానికై అవసరమైన టెండర్లను పిలిచేందుకు కూడా మంగళవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం లభించింది. ఇ-3 సీడ్ యాక్సిస్ రోడ్డులో 1.5 కి.మీ మేర ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణానికి, 4.10 కి.మీ ఇ-13 రోడ్డును రూ.384.78 కోట్లుతో పొడిగించేందుకు, 3.98 కి.మీ ఇ-15 రోడ్డును రూ.70 కోట్లతో పొడిగించేందుకు ఆమోదం లభించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Read More
Next Story