భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి ఫ్లైట్‌ అడుగిడిన వేళ..!
x
రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న ఎయిరిండియా విమానం

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి ఫ్లైట్‌ అడుగిడిన వేళ..!

త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం సేఫ్‌ంతో ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయింది.


భోగపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం ఈ విమానాశ్రయంలో మొట్టమొదటి విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ట్రయల్‌ విజయవంతమైంది. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా 3198 కమర్షియల్‌ వాలిడేషన్‌ ఫ్లైట్‌ బయలుదేరింది. 1600 కి.మీల దూరం గంటన్నరలో ప్రయాణించిన ఈ విమానం భోగాపురం ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఉదయం 11 గంటలకు ల్యాండ్‌ అయింది. ఈ విమానంలో కేంద్ర విమానయానశాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఉన్నతాధికారులు, దీని నిర్మాణాన్ని చేపట్టిన జీఎమ్మార్‌ సంస్థ ప్రతినిధులు వచ్చారు. వీరితో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఈ కొత్త ఎయిర్‌పోర్టులో సందడి సందడిగా పండగ వాతావరణం నెలకొంది.


మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

రామ్మోహన్‌నాయుడు ఏమన్నారంటే..
భోగాపురం కొత్త విమానాశ్రయంలో విమానంలో దిగిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అక్కడ ప్రజాప్రతినిధులు, మీడియానుద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఎయిరిండియా సహకారంతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్‌ కావడం మనందరికీ గర్వకారణం. అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టులో తొలి ఫ్లైట్‌ దిగడం చారిత్రాత్మకం. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు అనుమతులు తెచ్చారు. గత 18 నెలలుగా నిరంతర సమీక్షలతో ప్రాజెక్టును వేగవంతం చేశాం. డిసెంబర్‌ 2026కు లక్ష్యంగా పెట్టుకున్న పనులను ఆరు నెలల ముందుగానే పూర్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ, జీఎమ్మార్, డీజీసీఏ అధికారులు కీలకపాత్ర పోషించారు. భూములు త్యాగం చేసిన స్థానిక రైతాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి త్యాగం మరువలేనిది.

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

వరల్డ్‌ క్లాస్‌ ఏవియేషన్‌ హబ్‌గా భోగాపురం..
భోగాపురం వరల్డ్‌ క్లాస్‌ ఏవియేషన్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుపై వచ్చిన విమర్శలకు భోగాపురమే సమాధానం. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దిశ, దశ పూర్తిగా మారనున్నాయి. ఈ ఎయిర్‌పోర్టుతో టూరిజం, వాణజ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. విశాఖ రీజియన్‌ రోజురోజుకీ ఆర్థికంగా బలోపేతం అవుతుంది.

విమానం నుంచి అభివాదం చేస్తున్న రామ్మోహన్‌నాయుడు

ప్రధాని మోదీతో ప్రారంభోత్సవం..
ఈ భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ చేతులు మీదుగా నాలుగైదు నెలల్లో అధికారికంగా ప్రారంభిస్తారు. అన్ని సాంకేతిక నియంత్రణ ప్రకియలు పూర్తయ్యాయి. ఫ్లైట్‌ ల్యాండ్‌ కావడమంటే ఎయిర్‌పోర్టు పనులు దాదాపు పూర్తయినట్టే. ఒడిశా, రాయపూర్‌ ప్రాంతాల ప్రజలకు కూడా ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుంది. అన్ని ప్రాంతాలకు మెరుగైన ఎయిర్‌ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి’ అని రామ్మోహన్‌నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ ఎంపీ శ్రీభరత్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి, నెల్లిమర్ల, విజయనగరం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, అదితి గజపతిరాజు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎంఎన్‌ హరేందిరప్రసాద్, రామసుందరరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story