
నక్సలిజం వద్దని చెబితే..నాపై క్లైమోర్ మైన్లు పెట్టారు
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
నక్సలిజం వద్దని చెప్పినందుకు తనపై క్లైమోర్‌మైన్లు పెట్టి అంతమొందించేందుకు కుట్రలు పన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పరిశ్రమను స్థాపించాలంటే నీటి సౌకర్యం కావాలని కియా వాళ్లు అడిగారని.. పెనుగొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయరును 8 నెలల్లో పూర్తి చేసి.. కియా పరిశ్రమ వచ్చేలా చేసినట్లు చెప్పారు. 6 లక్షలకు ఎకరాలకు పైగా సాగు నీరు.. 33 లక్షల మందికి తాగు నీరు ఇస్తున్నామన్నారు.
2019లో ఓ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఒక్క ఛాన్స్ అన్నారు.. ప్రజలూ ఏమారారు.. చంద్రబాబు బాగానే చేస్తున్నారు.. కానీ ఓసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే.. ఐదేళ్ల పాటు.. బాదుడే బాదుడు.. నరుకుడే నరుకుడు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాయలసీమ అంటూ సెంటిమెంట్ వైసీపీ రెచ్చగొడుతుంది.. కులాల మధ్య చిచ్చు పెడుతుంది. మాటలు చెప్పడం ఈజీ.. కానీ పని చేయడం చాలా కష్టం అని చంద్రబాబు పేర్కొన్నారు.
హంద్రీ–నీవాపై వైసీపీ ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టిందా..? కుప్పంలో పెద్ద డ్రామా వేశారు. కాల్వల్లో నీళ్లు లేవు.. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చారు.. డమ్మి గేట్లు పెట్టి.. నీళ్లిచ్చామన్నారు. అలాంటి డ్రామాలు ప్రజలకు అవసరమా..? అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసింది టీడీపీ.. ప్రాజెక్టులను చెడగొట్టింది వైసీపీ అని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు.. తిరుమల వెంకన్న వరకు తీసుకెళ్లవచ్చు. దేవుళ్లను కూడా అనుసంధానం చేసి.. జలహరతి ఇద్దామని సీఎం అన్నారు. ఈ రకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలిగితే.. రైతుల కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. ఢిల్లీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చ జరిగింది. ఇబ్బందులు ఉంటాయి.. రాజకీయాలు ఉంటాయి.. కానీ వీటిని అధిగమించి సమస్యను పరిష్కరిస్తాం. నన్ను తిట్లు తిట్టినా.. శాపనార్దాలు పెట్టినా.. నేను మనస్సుకు తీసుకోను.. వెనకడుగు వేయనంటూ వెల్లడించారు. క్లైమోర్ మైన్లే నన్నేమీ చేయలేకపోయాయి.. ఈ విమర్శలు నన్నేం చేయగలవు అంటూ వైసీపీ మీద, జగన్ మీద సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క సారి అధికారమిస్తే.. ఐదేళ్లపాటు రోడ్లన్నీ గుంతలు కొట్టారు. వాళ్లు చేసిన గుంతలను పూడుస్తున్నాం.. రోడ్లు వేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు.
పెన్షన్ పెంచడానికి వైసీపీకి మనస్సు రాలేదు.. ఐదేళ్లు సమయం తీసుకున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉంటున్నా.. పెన్షన్లను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచామన్నారు. దివ్యాంగులకు ఆరు రెట్ల మేర పెన్షన్ పెంచామని, రూ. 33 వేల కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం చెప్పినట్టు అందరికీ ఇస్తున్నామని ఇదీ తమ విశ్వసనీయతని పేర్కొన్నారు. పేదలకు తిండి పెట్టడం నేరమా..? గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసిందని మండిపడ్డారు. పేదలకు సంక్షేమం అందించడాన్ని ఓ బాధ్యతగా తీసుకున్నామన్నారు.
చిత్తూరులో మామిడి ధరలు పడిపోయాయి.. కిలోకు రూ.4 అందించి ఆ రైతులను ఆదుకున్నామన్నారు. పొగాకు ధర పడిపోతే.. ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. కోకో ధర పడిపోయింది వారినీ ఆదుకున్నామన్నారు. కేంద్రం రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వేయగానే.. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. యువతను కుటుంబాలకు భారం కానివ్వమన్నారు. తోక జాడిస్తే.. కత్తిరిస్తా అని వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. వైసీపీకి పార్టీకి రాయలసీమ అంటే రాజకీయమని కానీ తనకు రాయలసీమ అంటే నీళ్లు, అభివృద్ధి అని వెల్లడించారు.
లోకేష్ పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ను అమలు చేస్తాం. సీమలో గతంలో ఎన్నడూ ఇవ్వనంత ఘన విజయాలను.. మెజార్టీలను ఇచ్చారు.. నేను మరిచిపోను. అంటూ సీఎం మాట్లాడారు. ప్రముఖ పరిశ్రమలను రాయలసీమ జిల్లాల్లో ప్రారంభిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ప్రారంభించబోతున్నాం. దేశానికి అవసరమైన డ్రోన్లను ఇక్కడే తయారు చేసే సామర్ధ్యం కలిగి ఉన్న కంపెనీలను డ్రోన్ సిటీకి రప్పిస్తున్నట్లు చెప్పారు. సర్వమంగళపాడు లిఫ్ట్ కావాలని స్థానిక ఎమ్మెల్యే అడిగారు.. దీని కోసం రూ. 60 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.. కానీ గతంలో ఉన్న భూతం మళ్లీ వస్తే మా పరిస్థితేంటీ అని అడుగుతున్నారని,
ఆ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామన్నారు. కులం తిండి పెడుతుందా అని ఆలోచించాలన్నారు. మతం అనేది ఓ విశ్వాసమని, ప్రజల జీవితాలను మార్చేది రాజకీయాలే అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఢిల్లీలో నీటి వివాదాలపై చర్చలు జరిగాయి. తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దాం. తెలంగాణ.. ఏపీ రెండూ రాష్ట్రాలూ బాగుండాలన్నారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు మనమే డబ్బులిచ్చి పనులు చేస్తామన్నారు. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పాను.. నదుల అనుసంధానానికి సహకరించమని కోరాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. వేదావతిని పూర్తి చేసి ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. పనులు పూర్తి చేస్తామన్నారు. ఘోరకల్లు మరమ్మతులు కూడా 96 కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. అలగనూరు బండ్ 2021 దిగిపోతే వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు...రూ.36 కోట్లు మంజూరు చేసి పూర్తి చేస్తామన్నారు.
Next Story