ఏమైందీ డ్రైవర్లకి.. ఎందుకిలా ప్రమాదాలు చేస్తున్నారు?
x

ఏమైందీ డ్రైవర్లకి.. ఎందుకిలా ప్రమాదాలు చేస్తున్నారు?

అనంతపురం జిల్లా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది


మొన్న కర్నూలు వి. కావేరీ ట్రావెల్స్.. నిన్న అనంతపురం వద్ద జబ్బార్ ట్రావెల్స్.. ఇవాళ చింతలకుంట వద్ద ఆర్టీసీ బస్సు.. వరుసగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు రుజువులివి.
కర్నూలు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదాల ఘోరాలు ఇంకా కళ్ల ముందు నుంచి మరువక ముందే.. అనంతపురం జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పుట్లూరు మండలం చింతలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకువెళ్లింది. అదృష్టవశాత్తు ప్రయాణీకుల ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకపోబట్టి సరిపోయింది గాని ప్రమాదానికి గురైన సమయంలో బడి పిల్లలు సహా 50 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. పలువురు ప్రయాణీకులు గాయలతో బయటపడ్డారు.

పుట్లూరు నుంచి పాఠశాల విద్యార్థులు,ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతోంది. ఆర్టీసీ డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ తో బస్సు పుట్లూరు వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిటికీ నుంచి కిందకి దూకేశారు. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రైవర్ నిర్లక్ష్యంతో పొద్దున మరో ముప్పు..
ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సు డ్రైవర్ ఇవాళ పొద్దున మరో నిర్వాకం చేశారు. ఉదయం 9గంటలకు ధర్మవరానికి చీరలు తీసుకెళ్లడానికి బస్టాండు వద్దకు చేరుకున్న గీతా నగర్‌కు చెందిన చేనేతలు ఆదినారాయణ, అశ్వత్థనారాయణ చీరల బ్యాగులను బస్సులోకి ఎక్కిస్తుండగా డ్రైవర్‌ బస్సును కదిలించారు. దీంతో చీరలు టైరుకిందపడి నలిగి పాడైపోయాయి. మొత్తం 15 చీరలు చిరిగిపోయాయి. ఇందులో ఏడు చీరలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. కార్మికులు బస్సు డ్రైవర్‌ను నిలదీయగా నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన చేనేతలు ధర్మవరం నుంచి తిరిగి వెళుతున్న బస్సును సోమందేపల్లిలో ఆపి గొడవకు దిగారు.
Read More
Next Story