‘వాటీజ్ దిస్ ఫైవ్ పర్సెంట్’... దిసీజ్ రెడిక్యులస్...
x
P Vishnukumar Raju

‘వాటీజ్ దిస్ ఫైవ్ పర్సెంట్’... దిసీజ్ రెడిక్యులస్...

ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వాటా పెరగాల్సిందే


కూటమి (NDA) ప్రభుత్వం లో ఒకపార్టీతో మరో పార్టీ సయోధ్యగా లేవని, వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారని బీజేపీ(BJP) స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ (TDP) తమను చిన్న చూపు చూస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నాయకుడు (BJP Floor Leader) పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెగేసి చెప్పారు. ఆయన 2025 జూలై 1న జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 5శాతం సీట్లు కేటాయిస్తే సరిపోతుందని టీడీపీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు న్యాయం చేయాలి, కూటమిలో బీజేపీకి తగిన వాటా రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాక, కూటమి రాజకీయాల్లో బీజేపీ ఆశలు, అసంతృప్తులను బహిర్గతం చేశాయి.

విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వెనుక రాజకీయం
విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కేవలం సీట్ల కేటాయింపుకు సంబంధించినవి కాదు. అవి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ స్థానం. కూటమి లోపల దాని ప్రాముఖ్యతను బలోపేతం చేయాలనే ఆకాంక్షను సూచిస్తాయి. 2024 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లలో 8 సీట్లు గెలుచుకోవడం ద్వారా భారీ విజయాన్ని సాధించింది. అయితే కూటమి భాగస్వామి అయిన టీడీపీ 144 సీట్లలో 135 సీట్లు గెలిచింది. ఈ విజయం బీజేపీకి రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ, సీట్ల కేటాయింపులో టీడీపీ ఆధిపత్యం బీజేపీ నాయకులలో అసంతృప్తిని రేకెత్తించింది. బిజెపి ప్రాబల్యం విస్తరించకుండా ఉన్నచోటే కుదించుకుని ఉండేలా చేసే విధంగా టిడిపి ధోరణి ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.
లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఆశలు
లోకల్ బాడీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనవి. ఎందుకంటే అవి గ్రామీణ, పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తాయి. పార్టీకి క్యాడర్ ను అందించేది గ్రామాలే. ఇలాంటపుడు పార్టీ ఉనికి పెరిగేందుకు బిజెపి చర్యలు తీసుకుంటుంది. కానీ టిడిపి చర్య దీనికి అనుకూలంగా లేదు. బీజేపీ రాష్ట్రంలో తన స్వతంత్ర ఉనికిని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యాన్ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు సూచిస్తాయి. ఆయన మాటల్లో "దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేయాలి" అనే వాదన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ను స్పష్టం చేస్తుంది.
మాధవ్ నియామకం, బీజేపీ కొత్త దిశ
పీవీఎన్ మాధవ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఈ వ్యాఖ్యలకు కీలకమైన నేపథ్యం. మాధవ్ బీజేపీ యువజన విభాగం (BJYM) నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, RSSతో దగ్గరి సంబంధాలు పెంచుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం రాష్ట్రంలో బీజేపీ తన సంస్థాగత బలాన్ని పెంచడానికి, ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక చర్యగా భావించబడుతోంది. విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, మాధవ్ నాయకత్వంలో బీజేపీ, టీడీపీతో సీట్ల పంపకంలో గట్టిగా బేరం ఆడాలనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇది సాధ్యమా? మాధవ్ అలా పట్టుపట్టే స్థితిలోఉన్నారు. ఒక విధంగా పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టగానే మాధవ్ కు ఎదురవుతున్న పెద్ద పరీక్ష ఇది.
పురందేశ్వరి నాయకత్వంలో నిశ్శబ్దం ఎందుకు?
దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు విష్ణుకుమార్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. పురందేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె. చంద్రబాబు నాయుడు వదిన కావడం వల్ల టీడీపీ-బీజేపీ కూటమిలో సమన్వయం సాఫీగా సాగింది.ఆమె ను ప్రశ్నించే సాహసం కాని, ఆమెను ఇరుకున పెట్టే ప్రకటనలు గానీ ఎవ్వరూ చేయలేదు. ఆమె నాయకత్వంలో బీజేపీ, టీడీపీతో సీట్ల పంపకంలో ఎక్కువగా పట్టుబట్టడం కంటే, చక్కగా రాజీపడినట్లు కనిపిస్తుంది. అయితే మాధవ్ నియామకం తర్వాత రాష్ట్రంలో బీజేపీ తన స్వతంత్ర ఉనికిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విష్ణుకుమార్ రాజు వంటి నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు-పురందేశ్వరి బంధుత్వం, రాజకీయ కోణం
పురందేశ్వరి చంద్రబాబు నాయుడు వదిన కావడం, బీజేపీ-టీడీపీ మధ్య సీట్ల పంపకంలో ఒక సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడింది. అయితే ఈ బంధుత్వం కొన్ని సందర్భాల్లో బీజేపీ లోపల అసంతృప్తిని కలిగించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నాయకులు టీడీపీ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు, "కూటమిలో బీజేపీ లేకపోతే చంద్రబాబు సీఎం కాలేరు" అని సూచించడం, బీజేపీ రాజకీయ ప్రాముఖ్యతను గుర్తు చేసే ప్రయత్నంగా చూడవచ్చు.
బీసీ ఓటు బ్యాంకు లక్ష్యంగా...
మాధవ్ నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో తన సంస్థాగత బలాన్ని, ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని తన ప్రభావాన్ని పెంచాలని చూస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు ఈ వ్యూహంలో కీలకమైనవి. ఎందుకంటే అవి గ్రామీణ స్థాయిలో బీజేపీ బలాన్ని నిరూపించే అవకాశాన్ని ఇస్తాయి.
విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు టీడీపీతో సీట్ల పంపకంలో గట్టిగా బేరం ఆడాలనే బీజేపీ ఉద్దేశాన్ని సూచిస్తాయి. "అవసరమైతే తెగదెంపులు" అనే సూచన, కూటమి లోపల బీజేపీ తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒత్తిడి వ్యూహాన్ని అవలంబిస్తుందని సంకేతం ఇస్తుంది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ద్వారా, బీజేపీ తన రాజకీయ సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు చేరవేయడంలో విజయం సాధించింది. ఇది బీజేపీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాక, టీడీపీ నాయకత్వంపై ఒత్తిడిని పెంచింది.
Read More
Next Story