KCR appointment| ఏది జరిగినా రేవంత్ కే అడ్వాంటేజా ?
తెలంగాణాతల్లి విగ్రహం ఆవిష్కరణ, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గట్టిగా ఫిక్స్ చేసేశారు.
తెలంగాణాతల్లి విగ్రహం ఆవిష్కరణ, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గట్టిగా ఫిక్స్ చేసేశారు. కేసీఆర్ ఏమి నిర్ణయం తీసుకున్నా అడ్వాంటేజ్ మాత్రం ఫుల్లుగా రేవంత్(Revanth) కే దక్కుతుందనటంలో సందేహంలేదు. కేసీఆర్(KCR) విషయంలో రేవంత్ రెండు రకాలుగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొదటిది, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల(Assembly Session)కు రావాలని, తెలంగాణా అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలని, సభలో ప్రధానప్రతిపక్షం సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదికాదని, సమావేశాలకు వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని కేసీఆర్ కు రేవంత్ పదేపదే విజ్ఞప్తిచేశారు. ఇక రెండోది ఏమిటంటే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణాతల్లి(Telangana Talli Statue) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ను రేవంత్ చాలాసార్లు రిక్వెస్టు చేశారు. ప్రభుత్వం తరపున ఆహ్వానం అందించేందుకు ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ను పంపుతున్నట్లు చెప్పారు.
కేసీఆర్ ను కలవటానికి మంత్రి ఆఫీసు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్(Erravelli Farm House) నుండి ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇదేసమయంలో కేసీఆర్ అపాయిట్మెంట్ కోరుతు ప్రభుత్వం నుండి ఎలాంటి రిక్వెస్టు అందలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అపాయిట్మెంట్ కావాలని కేసీఆర్ ను కోరటం అంటే నేరుగా బీఆర్ఎస్ చీఫ్ పీఎస్ లేదా పీఏ అదీకాకపోతే సెక్యూరిటి ఆఫీసర్ ను మంత్రి పొన్నం ఆఫీసు కాంటాక్టు చేయాల్సిందే. రేపు ఏదైనా తేడా వస్తే సమర్ధించుకోవటానికి ముందుగా మొబైల్ ద్వారా మెసేజ్ ఇచ్చి తర్వాత ఫోన్ కాంటాక్టు చేస్తారనటంలో సందేహంలేదు. పై రెండు పద్దతుల్లో ఏది అనుసరించినా కేసీఆర్ ను కాంటాక్టు చేయటానికి ప్రయత్నించామని రికార్డెడుగా చెప్పుకోవటానికి పొన్నం దగ్గర ఆధారాలుంటాయి. అప్పుడు ప్రభుత్వం తరపున కేసీఆర్ అపాయిట్మెంట్ కావాలని ఎవరూ కోరలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్పేందుకు లేదు.
శనివారం మధ్యాహ్నం ఎర్రవల్లికి మంత్రి పొన్నం వెళ్ళి కేసీఆర్ ను కలవబోతున్నారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విగ్రహావిష్కరణకు కేసీఆర్ వెళ్ళితే ఒక సమస్య వెళ్ళకపోతే మరో సమస్య. వెళితే ఎదురయ్యే సమస్య ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త తెలంగాణాతల్లి విగ్రహం నమూనాను కేసీఆర్ అంగీకరించినట్లవుతుంది. ఒకవైపు తాము అధికారంలోకి రాగానే రేవంత్ ఏర్పాటుచేస్తున్న తెలంగాణాతల్లి విగ్రహాన్ని మార్చేస్తామని కేటీఆర్(KTR) పదేపదే చెబుతుంటే, కేసీఆర్ విగ్రహావిష్కరణకు హాజరవ్వటం వర్కింగ్ ప్రెసిడెంటుకు ఇబ్బందికరమే. తండ్రి విగ్రహావిష్కరణకు హాజరైతే కొడుకు విగ్రహాన్ని మార్చేస్తామని అంటాడా అని కాంగ్రెస్ వైపునుండి ఎత్తిపొడుపులు మొదలవుతాయి. అలాగే పార్టీ చీఫ్ కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదని రేవంత్ అండ్ కో వేదికలమీద వాయించేస్తారు. అప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా అయోమయంలో పడిపోతారు.
అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే రేవంత్ ను కేసీఆర్ వేదికమీద ఫేస్ చేయాల్సుంటుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ను కేసీఆర్ చూడలేకపోతున్నారు కాబట్టే అసెంబ్లీకి కూడా రావటంలేదని ఇప్పటికే మంత్రులు చాలాసార్లు ఆరోపణలు చేసున్నారు. పోనీ విగ్రాహావిష్కరణకు గైర్హాజరవుదామా అంటే అదొక సమస్య. ఎలాగంటే, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంత మర్యాద, గౌరవం ఇస్తున్నా కేసీఆర్ నిలుకోవటంలేదని రేవంత్ అండ్ కో దాడులు మొదలుపెడతుంది. తెలంగాణాతల్లి విగ్రాహావిష్కరణ గైర్హాజరునే ఉదాహరణగా చూపిస్తారు. దీన్ని సమర్ధించుకోవటానికి బీఆర్ఎస్ కీలక నేతలు నానా అవస్తలు పడాల్సిందే. అందుకనే పొన్నంను కలవటానికి కేసీఆర్ అపాయిట్మెంట్ ఇచ్చినా సమస్యే, ఇవ్వకపోయినా కూడా సమస్యే. అపాయిట్మెంట్ ఇస్తే ఆహ్వానం పంపినా కార్యక్రమానికి రాలేదంటారు. అపాయిట్మెంటే ఇవ్వకపోతే ఆహ్వానం అందించేందుకు మంత్రిని పంపినా కేసీఆర్ కలవటానికి ఇష్టపడలేదంటారు.
ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబందించి కూడా కేసీఆర్ విషయంలో రేవంత్ అండ్ కో ఇదే వ్యూహాన్ని అమలుచేస్తారు. అసెంబ్లీకి వచ్చి రాష్ట్రాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని కోరినా కేసీఆర్ పట్టించుకోవటంలేదని గోల మొదలుపెడతారు. అసెంబ్లీకి రాని, ప్రజా సమస్యలగురించి మాట్లాడని కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకని గోలచేసినా చేస్తారు. అధికారంలో ఉంటే మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా ? ప్రతిపక్షంలో ఉంటే రారా ? అని ఇప్పటికే రేవంత్ అడిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించండి, సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టమని తామే చెప్పినా వినిపించుకోని కేసీఆర్ అసలు ఎంఎల్ఏగా కూడా పనికిరాడని రేవంత్ అండ్ కో తేల్చేసే అవకాశాలు ఉన్నాయి. విగ్రాహావిష్కరణకు హాజరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణాతల్లి విగ్రహ నమూనాను ఆమోదించినట్లవుతుంది. అసెంబ్లీకి హాజరైతే రేవంత్ ను ఫేస్ చేయటమే కాకుండా బీఆర్ఎస్ పదేళ్ళపాలనలో తెలంగాణా ఏ విధంగా నష్టపోయిందో ఉదాహరణలతో సహా చెప్పే రేవంత్ అండ్ కో సూటిపోటి మాటలను, ఆరోపణలు, విమర్శలను భరించాల్సుంటుంది.
రేవంత్ అండ్ కో చేసే ఆరోపణలు, విమర్శలను ధీటుగా తిప్పికొట్టేంత సామర్ధ్యం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు(Harish Rao) కు ఉందనటంలో సందేహంలేదు. కాని సభలో అధికారపక్షం చేసే ఆరోపణలను ముందు కేసీఆర్ అయితే వినాల్సిందే కదా. ఆరోపణలను వినకూడదని అనుకుంటు అధికారపక్షం మాట్లాడకుండా గోలచేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. విద్యుత్ రంగంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపలపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ముందు హాజరుకావటానికే కేసీఆర్ ఇష్టపడలేదు. అలాంటిది అసెంబ్లీ సమావేశాలకు హాజరై రేవంత్ అండ్ కో చేసే ఆరోపణలు, విమర్శలను కేసీఆర్ సహించి ఓపికగా భరిస్తారా ? అందుకనే విగ్రహావిష్కరణ, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతే ఒక సమస్య, గైర్హాజరైతే మరో సమస్య. కేసీఆర్ పరిస్ధితి చివరకు ఎలాగ తయారైందంటే ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’లాగ తయారైంది. ప్చ్...ఏంచేస్తాం కాలం కలసిరానపుడు ఇలాగే అవుతుంటుందని సరిపెట్టుకోవాలంతే.