యూట్యూబర్ రేవతి అరెస్టుకు అసలు కారణం ఏమిటి ?
x

యూట్యూబర్ రేవతి అరెస్టుకు అసలు కారణం ఏమిటి ?

వీడియోలో మహబూబాబాద్ రైతుతో యాంకర్ మాట్లాడుతు రేవంత్ ను వ్యక్తిగతంగాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిల్లి జోలపాడటం అనే పద్దతిలో పదేపదే బండబూతులు తిట్టించింది


యూట్యూబర్ రేవతి అరెస్టుపై కొందరు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కీలకనేతలంతా నానా రచ్చచేస్తున్నారు. రాజకీయ పార్టీలను, మీడియాను దేనికదే విడిగా చూడలేని పరిస్ధితిలో ఇపుడు సమాజముంది. ఏ రాజకీయపార్టీకి మద్దతుగా ఏ మీడియా ఉంది ? ఏమీడియా వెనుక ఏ పార్టీ మద్దతుంది అన్నది చాలామందికి తెలిసిందే. కాబట్టి మీడియా యాజమాన్యాలు కూడా తమకు మద్దతుగా ఉన్న పార్టీల రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా వార్తలను వండి వారుస్తున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే యూట్యూబర్ రేవతి(You Tuber Revathi) అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు(KTR), కల్వకుంట్ల కవిత తదితరులు ట్విట్టర్ వేదికగా నానా గోలచేస్తున్నారు. యూట్యూబర్లు జర్నలిస్టులు కాదు. అయితే తాము కూడా జర్నలిస్టులమే అని యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు.

రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంలో జనాలకు వాక్ స్వాతంత్ర్యం లేదని, ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు తప్పటంలేదని కేటీఆర్, హరీష్, కవితలు కథలు చెబుతున్నారు. నిజానికి రేవతికి అరెస్టు కొత్తేమీకాదు. ఎందుకంటే, 2019 అంటే బీఆర్ఎస్(BRS) హయాంలోనే రేవతి మొదటసారి అరెస్టయ్యింది. 2019లో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో చాలా పెద్ద గొడవలయ్యాయి. కొందరు విద్యార్ధులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. కవిత ఓటమికి రేవతి కూడా కారణమని బీఆర్ఎస్ పెద్దలు బాగా మండిపోయారని సమాచారం. కారణం ఏమిటంటే పసుపు రైతుల సమస్యలపై రేవతి చాలా ఎపిసోడ్లు చేసి రిలీజ్ చేశారు.

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలతో ఇంటర్వ్యూలు, పసుపు రైతులతో ఇంటర్వ్యూల పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారని రేవతిపై అప్పటి ప్రభుత్వపెద్దలు మండిపోయారు. దాంతో రేవతిపై పోలీసులు అనేక కేసులు కూడా పెట్టారు. ఇందులో భాగంగానే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్టుచేశారు. ఇదంతా 2019లో జరిగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవతి యూట్యూబ్ కు ఒక ప్రముఖ పార్టీ ఫండింగ్ చేసిందని అప్పట్లో చాలా ప్రచారం జరిగింది.

ఇప్పటి విషయానికి వస్తే రేవతి ‘పల్స్ న్యూస్ బ్రేక్’ ఛానల్ కు మరో ప్రముఖ పార్టీ ఫండింగ్ చేస్తోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అదే పార్టీ రేవతి యూట్యూబ్ కు ఫండింగ్ చేస్తు రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు చేయిస్తోందనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే ఇపుడు రేవతి అరెస్టుకు కారణమైన వీడియోను ఎంతమంది చూశారో తెలీదు. ఆ వీడియోలో మహబూబాబాద్ రైతుతో యాంకర్ మాట్లాడుతు రేవంత్ ను వ్యక్తిగతంగాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిల్లి జోలపాడటం అనే పద్దతిలో పదేపదే బండబూతులు తిట్టించింది. తిరుపతి గంగమ్మజాతరలో మాత్రమే ఇలాంటి బండబూతులు వినగలం. ఒక రైతుతో సీఎంను, ప్రభుత్వాన్ని అదేపనిగా బూతులుతిట్టించటం ఎలాంటి జర్నలిజం కిందకు వస్తుందో జర్నలిస్టునని చెప్పుకుంటున్న రేవతే చెప్పాలి. రైతుతో బూతులు తిట్టించిన వీడియోను షేర్ చేస్తే కేసులు నమోదవుతాయని తెలిసిన రేవతికి ఆ వీడియోను అప్ లోడ్ చేయకూడదని తెలీదా ? వీడియోను షేర్ చేస్తే కేసులు పడతాయి కాబట్టి షేర్ చేయద్దని స్వయంగా రేవతి తన ట్విట్టర్ ఖాతాలోనే వార్నింగ్ కూడా ఇచ్చింది. అంటే రేవంత్ వ్యతిరేకులను సదరు వీడియోను బాగా షేర్ చేయమని చెప్పటమే రేవతి హిడెన్ అజెండానా ?

కేటీఆర్, హరీష్, కవిత తెలంగాణలో వాక్ స్వాతంత్ర్యంలేదా అంటు గోలచేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం అంటే ఎదుటివాడిని బూతులు తిట్టడం లేదా తిట్టించటమేనా ? రేవంత్ కు లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని చెప్పటంలేదు. అయితే, ప్రభుత్వాన్ని లేదా రేవంత్ ను విమర్శించటానికి ఒక పద్దతుంటుంది. పద్దతులు మరచిపోయి, హద్దులు దాటిపోయి నోటికొచ్చినట్లు బూతులుతిట్టటం లేదా ఎవరితోనో తిట్టించటాన్ని వాక్ స్వాతంత్ర్యం అనరు. ఆ బూతుల వీడియోను అప్ లోడ్ చేయటాన్ని ‘జర్నలిజం’ అనరు. జర్నలిజం ముసుగులో ఏమి మాట్లాడినా, రాసినా చెల్లిపోతుందని అనుకుంటే కుదరదు. రైతుతో యాంకర్ మాట్లాడుతు ముఖ్యమంత్రిని అలా తిట్టకూడదని చెప్పింది. మరి రేవంత్ ను నోటికొచ్చినట్లు తిట్టిన వీడియోను రేవతి తన యూట్యూబ్ లో ఎలా అప్ లోడ్ చేసింది ? ఎందుకు అప్ లోడ్ చేసింది ? ‘జర్నలిస్టు’ను అరెస్టుచేయటం తప్పని అంటున్న వాళ్ళంతా ఒకసారి రైతుతో యాంకర్ మాట్లాడిన వీడియోను చూస్తే సమాధానం దొరుకుతుంది.

Read More
Next Story