
కొత్త జిల్లాల్లో అడ్రస్ మార్పులకు ఏమి చేయాలి
డాక్యుమెంట్ల అప్‌డేట్‌కు ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, వోటర్ ఐడీలు, డ్రైవింగ్ లైసెన్సుల వంటి డాక్యుమెంట్లలో జిల్లా పేరు మార్పు అవసరం ఏర్పడింది. ఈ మార్పు ప్రజలకు రోజువారీ సేవలు, పెన్షన్లు, బ్యాంకింగ్, ప్రభుత్వ స్కీములు లభించడంలో అడ్డంకిగా మారకుండా చూడటానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం (రంపచోడవరం కేంద్రం) జిల్లాలు ఏర్పడ్డాయి.
రెవెన్యూ శాఖ అలర్ట్ కావాలి...
రెవెన్యూ శాఖ అధికారుల సూచనల ప్రకారం కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు జారీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఈ సర్టిఫికెట్లను ఉచితంగా అందించనున్నారు. ఇవి ఆధార్ అప్‌డేట్‌కు ప్రూఫ్‌గా ఉపయోగపడతాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు myAadhaar పోర్టల్ (https://myaadhaar.uidai.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌గా లేదా సమీప ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లలో ఆధార్ అడ్రస్ మార్పు చేయవచ్చు. ఈ ప్రక్రియకు ప్రస్తుత జిల్లా సర్టిఫికెట్ లేదా ఇతర ప్రూఫ్ (బ్యాంక్ స్టేట్‌మెంట్, యుటిలిటీ బిల్) సరిపోతాయి. ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా ఉచిత సహాయం అందించనుంది. ప్రజలు వార్డు, గ్రామ సచివాలయాలను వెంటనే సంప్రదించడం మంచిది.
ఇంకా ఎలక్షన్ కమిషన్, రోజ్‌గార్ శాఖలతో సమన్వయం చేసుకుని ఓటర్ ఐడీలు, రేషన్ కార్డుల అప్‌డేట్‌కు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. జనవరి 2026 చివరి వరకు ఈ చర్యలు పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ మార్పు కారణంగా కొంతమంది ప్రజలకు ఆధార్ అడ్రస్ సమస్యలు ఎదురవుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
కలెక్టర్ లూ చొరవ తీసుకోండి...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, కొత్త జిల్లా ప్రజలకు ఈ మార్పు ప్రయోజనాలు అందేలా చూడాలని స్థానిక కలెక్టర్లు, ఎమ్మెల్యేలు సూచించారు. ప్రధాన సూచనలు ఇలా ఉన్నాయి.
1. ఆధార్ అప్‌డేట్: సమీప మీసేవా లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి, కొత్త జిల్లా పేరుతో అడ్రస్ మార్చుకోవాలి. ఆన్‌లైన్ ప్రక్రియకు OTP ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు. దీని ద్వారా పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు వంటి సేవలు అడ్డుకోలేవు.
2. ఇతర డాక్యుమెంట్లు: రేషన్ కార్డు, ఓటర్ ఐడీకి సంబంధించిన మార్పులకు సంబంధిత శాఖల సహాయం తీసుకోవాలి. గ్రామ సచివాలయాల్లో ఉచిత సర్టిఫికెట్లు పొందండి.
3. సమయం: జనవరి మధ్య వరకు త్వరగా చర్య తీసుకోవాలి, లేకపోతే రోజువారీ సేవల్లో ఆలస్యం కలుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
4. సహాయం: హెల్ప్‌లైన్ నంబర్లు (1800-300-1947 UIDAIకి) ఉపయోగించండి. స్థానిక కలెక్టర్లు (పోలవరం: ఎ.ఎస్. దినేష్ కుమార్, మార్కాపురం: పి. రాజబాబు) కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రాజాబాబు మార్కాపురంలో సోమవారం స్థానిక సమస్యలపై గ్రీవెన్స్ కొత్త కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు.
మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రజలకు సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం పెంచేందుకు మార్కాపురం, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం, స్థానిక ప్రజల ఐడెంటిటీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపడుతోంది. డిసెంబర్ 31, 2025 నుంచి ఈ జిల్లాలు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే 26 జిల్లాలను 28కి పెంచిన ఈ మార్పు, ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతాల పరిపాలనా సమతుల్యతకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక కృషి జరగాలి: రావులపల్లి రవీంద్రనాథ్
పోలవరం ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక కృషి జరగాలి. అలాగే మార్కాపురం జిల్లాలో ట్రైబల్స్, కార్మికులు, రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ కోరారు. జిల్లా అడ్రస్ తో ఆధార్ మార్చుకునేందుకు సచివాలయాల్లో వెంటనే అడ్రస్ ఫ్రూప్ లు ప్రజలకు అందించాలని కోరారు.
ప్రభుత్వం జారీ చేసిన జిల్లా ఏర్పాటు ఆదేశాలు (జీవో ఎంఎస్ నంబర్ 517, 524, రెవెన్యూ శాఖ, డిసెంబర్ 30, 2025) ప్రకారం, పోలవరం జిల్లా హెడ్‌క్వార్టర్ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పడింది. ఈ జిల్లాలో 11 మండలాలు చేర్చబడ్డాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్‌తో సంబంధం కలిగిన గ్రామాల పునరావాసం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే మార్కాపురం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి విభజించి మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో 21 మండలాలతో ఏర్పడింది. ఈ జిల్లా హెడ్‌క్వార్టర్ మార్కాపురంలో ఉంటుంది. ఇప్పటికే కార్యాలయం ఏర్పాటైంది.

