
జీబీఎస్ వ్యాధి సోకితే చేతులు పట్టుతప్పుతాయట..
ఏపీని హడలెత్తిస్తున్న జీబీ సిండ్రోమ్ వ్యాధి, అసలేమిటిదీ?
జీబీఎస్ రోగులకు ఇచ్చే ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఒక్కొక్కటి రూ.20,000. ఈ వ్యాధి సోకిన వారికి ఒక్కొక్కరికి 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారీ-సిండ్రోమ్(జీబీఎస్) వ్యాధితో ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గుంటూరు జీజీహెచ్‌లో మరణించడతో రాష్ట్రంలో కలకలం బయల్దేరింది. దీంతో రాష్ట్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించినా రాష్ట్ర ప్రజలు మాత్రం హడలి పోతున్నారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. ఈ ఒక్కో ఇంజెక్షన్లు దాదాపు 20,000 రూపాయలు. ఈ వ్యాధి సోకిన వారికి ఒక్కొక్కరికి 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కేసుల్లో ఈ ఇంజక్షన్లతో పని లేకుండా నయం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ‘‘రాష్ట్రంలో 43 జీబీఎస్ కేసులున్నాయి. ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి సోకినా 85 శాతం చికిత్స అవసరం లేకుండా తగ్గిపోతుంది. 15 శాతం మాత్రం ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖ జీజీహెచ్‌లలో 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా మరో 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 425 ఇంజెక్షన్లను లభ్యత లేని ఇతర జీజీహెచ్‌లకు తరలిస్తున్నాం. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.20వేలు చొప్పున ఉంటుంది. అలాంటివి రోజుకు ఐదు ఇంజెక్షన్లు ఇవ్వాలి. మొత్తంగా ఐదు రోజుల పాటు అందించాల్సి ఉంటుంది’’ అని మంత్రి సత్యకుమార్ వివరించారు.
అసలింతకీ ఈ జీబీఎస్ వ్యాధి ఏమిటీ?
దీని పూర్తి పేరు గిల్లెన్-బారే (gee-YAH-buh-RAY- Guillain-Barre syndrome) సిండ్రోమ్. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. నరాలపై దాడి చేస్తుంది. దీంతో బలహీనత, నిస్సారత లేదా ఫాలిజీ (పక్షవాతం) రావచ్చు.
వ్యాధి లక్షణాలు..
సాధారణంగా, చేతులు, కాళ్లలో బలహీనత ఏర్పడుతుంది. మొద్దుబారతాయి. ఇవి తొలి లక్షణాలు. ఇవి వేగంగా శరీరమంతటా వ్యాపిస్తాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి దారితీయవచ్చు. వ్యాధి బాగా ముదిరితే అత్యవసరంగా వైద్యం అందించాల్సి ఉంటుంది. గిల్లెన్-బారే సిండ్రోమ్ సోకినట్టు నిర్ధారణ అయితే చికిత్స అవసరం.
-వేళ్లలో, మడమల్లో, చేతికీళ్లల్లో, మణికట్టులో సూదులేసి గుచ్చినట్టు అనిపిస్తుంది.
-కాళ్లలో బలహీనత మొదలై పైభాగానికి వ్యాపించడం.
-నడవడానికి ఇబ్బంది పడడం లేదా మెట్లు ఎక్కలేకపోవడం.
-ముఖ కదలికలలో ఇబ్బంది (మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం).
- డబుల్ విజన్ అంటే ఏదైనా వస్తువు కొన్ని క్షణాల పాటు రెండుగా కనిపించడం, ఒక్కోసారి కళ్లను అసలు కదిలించలేకపోవడం.
-తీవ్రమైన నరాల నొప్పులు, ఇది సాధారణంగా రాత్రివేళ ఎక్కువగా ఉంటుంది.
-మూత్రాశయం లేదా పెద్దప్రేగు నియంత్రణ సమస్యలు.
-గుండె వేగంగా కొట్టుకోవడం.
-రక్తపోటు (BP)స్థిరంగా లేకపోవడం, తక్కువ లేదా ఎక్కువ కావడం.
-శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
గిల్లెన్-బారే సిండ్రోమ్ మొదలైన రెండువారాల్లోనే తీవ్రంగా మారే అవకాశం ఎక్కువ.
జీబీఎస్ లో రకాలు...
ఈ వ్యాధిలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవేమంటే..
అక్యూట్ ఇన్‌ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పొలిరాడికులోన్యూరోపతి (AIDP):
ఇది ఉత్తర అమెరికా, యూరప్‌లో సాధారణంగా కనిపించే రకం. శరీరంలో కింది నుంచి పైదాకా బలహీనత
మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ (MFS):
ఈ రకంలో మొదట కళ్ల చుట్టూ నల్లగా చారల్లా ఏర్పడి ఫేసియల్ పెరాలసిస్ కి దారి తీస్తుంది. నడక నిలకడగా ఉండదు. (అన్‌స్టెడి వాక్). ఇది ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
అక్యూట్ మోటార్ అక్సోనల్ న్యూరోపతి (AMAN), అక్యూట్ మోటార్-సెన్సరీ అక్సోనల్ న్యూరోపతి (AMSAN):
అమెరికాలో అరుదుగా కనిపించే రకాలు. కానీ చైనా, జపాన్, మెక్సికోలో ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
కాళ్ల వేళ్లల్లో చిన్నగా మొదలయ్యే నొప్పి ఆ తర్వాత మొద్దుబారే దాకా వస్తుంది. అందువల్ల ఆ నొప్పి లేదా వాపు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించవచ్చు. కానీ, క్రింది లక్షణాలు ఉంటే మాత్రం తక్షణమే డాక్టర్లు కలిసి వైద్య సహాయం తీసుకోవాలి:
-వేళ్లలో ప్రారంభమైన మొద్దుబారిన తనం శరీరంలో పైభాగానికి వ్యాపించడం.
-త్వరితగతిన వ్యాపిస్తున్న బలహీనత లేదా మొద్దుబారడం.
-శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మంచంపై పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.
-నోట్లో లాలాజలం మింగలేకపోవడం
-ఒక దశ దాటిన తర్వాత- గిల్లెన్-బారే సిండ్రోమ్- చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడమే మేలు. చికిత్స త్వరగా ప్రారంభమైతే పూర్తిగా కోలుకునే అవకాశం ఎక్కువ.
ఎందుకు వస్తుంది...
ఇదో అరుదైన వ్యాధి. ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. ఇప్పుడు కనుగొన్న ఆధారాల ప్రకారం ఈ వ్యాధి సోకడానికి ఐదారు వారాల ముందు నుంచే శ్వాసకోశ లేదా జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. దీనికి COVID-19 సహా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు, జికా వైరస్ కూడా కారణమవుతాయి.
చికిత్స ఏమిటంటే...
గిల్లెన్-బారే సిండ్రోమ్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదు. కొన్ని చికిత్సా విధానాలు లక్షణాలను తగ్గించేందుకు, కోలుకోవడానికి సహాయపడతాయి. చాలా మంది పూర్తిగా కోలుకుంటారు, కానీ కొన్ని తీవ్రమైన కేసులు ప్రాణాపాయంగా మారవచ్చు. కోలుకోవడానికి ఏళ్లు పట్టిన సందర్భాలూ లేకపోలేదు. రోగులలో అధిక శాతం తొలిసారి లక్షణాలు కనిపించిన ఆరు నెలల తర్వాత తిరిగి నడవగలుగుతారు. అయితే, కొందరిలో శాశ్వతంగా బలహీనత, నిస్సారం, నిస్సత్తువ లేదా అలసట ఉండే అవకాశం ఉంటుంది.
ఏపీలో వచ్చిందో ఏ రకం వ్యాధో తెలియలేదు. చికిత్స మాత్రం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకే ఈ తరహా రోగుల్ని తరలిస్తున్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేస్తున్నారు.
Next Story