అఖండ గోదావరి ప్రాజెక్టు ఏమిటి?
x
Godavari Rever

అఖండ గోదావరి ప్రాజెక్టు ఏమిటి?

అఖండ గోదావరి ప్రాజెక్టు ఏమిటి? అందులో ఏ విధమైన కార్యకలాపాలు ఉంటాయి?


అఖండ గోదావరి, ఈ ప్రాజెక్టు గోదావరి నది సహజ సౌందర్యాన్ని, చారిత్రాత్మక వంతెనలను, ఆధ్యాత్మిక కేంద్రాలను, స్థానిక సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు పరిచయం చేయడానికి ఉద్దేశించినది. ఇది ఒక సమగ్ర పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు. రాజమహేంద్రవరం, చుట్టుపక్కల నియోజకవర్గాలైన కడియం, కొవ్వూరు, నిడదవోలును పర్యాటక గమ్యస్థానాలుగా మార్చడానికి రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 37 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

వచ్చేనెల మొదటి వారంలో శంకుస్థాపనలు

ప్రాజెక్టు పనులు జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి నిర్ణయించారు. గోదావరి పుష్కరాలకు (2027లో జరగుతాయి) ముందు ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


శంకుస్థాపనలకు పవన్, పురందేశ్వరి లే ఎందుకు?

అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని ఆహ్వానించడం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం బహుముఖంగా ఉందని చెప్పొచ్చు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాగా, దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ. వీరిద్దరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఐక్యతను చెప్పి రాజకీయంగా బలమైన సందేశం ఇవ్వడం ప్రభుత్వ ఉద్దేశంగా ఉండని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రాజమహేంద్రవరం ప్రాంతంలో గోదావరి నది ఆధారిత ప్రాజెక్టులు స్థానిక రైతులకు, వ్యవసాయ రంగానికి, ఆర్థికాభివృద్ధికి కీలకం. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ అయిన పురందేశ్వరిని ఆహ్వానించడం ద్వారా స్థానిక సమస్యలపై కేంద్రం దృష్టిని ఆకర్షించి, కేంద్ర నిధులు, మద్దతు పొందే అవకాశాన్ని పెంచడం కూడా ఒక ఉద్దేశ్యం. పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజల్లో విస్తృత ఆదరణ ఉన్న నాయకుడు కావడం వల్ల, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆమోదాన్ని పొందవచ్చుననే భావనలో ప్రభుత్వం ఉంది.


కేంద్ర, రాష్ట్ర సహకారం

అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఆమోదం అవసరం. బీజేపీ నాయకురాలైన పురందేశ్వరి ద్వారా కేంద్రంతో సమన్వయం సులభం చేసి, కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని గట్టిగా కోరడం ఒక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్రంతో చర్చలు జరిపి నిధులు కేటాయింప జేయడంలో విజయం సాధించారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శంకుస్థాపన కోసం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

అఖండ గోదావరి ప్రాజెక్టు కీలక అంశాలు

హేవలాక్ వంతెన (రాజమహేంద్రవరం): చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆకర్షణీయంగా, సౌందర్యాత్మకంగా సుందరీకరణ చేస్తారు. రాత్రి వేళల్లో లైటింగ్, వాక్‌వేలు, వీక్షణ స్థలాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తారు.

పుష్కర్ ఘాట్: పుష్కర్ ఘాట్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. స్నానఘట్టాలను మెరుగుపరచడం, సౌకర్యవంతమైన సౌకర్యాలను అందించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం వంటివి చేపడతారు.

బ్రిడ్జిలంక: బ్రిడ్జిలంక ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. పర్యాటకులకు విశ్రాంతి స్థలాలు, ఫుడ్ కోర్టులు, సహజ సౌందర్యాన్ని ఆస్వాదించే సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.

కడియం నర్సరీలు: కడియం ప్రాంతంలోని పుష్ప నర్సరీలను ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేస్తారు. నర్సరీలలో గైడెడ్ టూర్స్, బొటానికల్ గార్డెన్స్, పుష్ప ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు.

కొవ్వూరు గోష్పాదక్షేత్రం: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఆలయ సముదాయాన్ని సుందరీకరించడం, పర్యాటక సౌకర్యాలను అందుబాటులో ఉంచడం చేస్తారు.

నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం: నిడదవోలులోని కోట సత్తెమ్మ ఆలయాన్ని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఆలయం చుట్టూ సౌకర్యాలను మెరుగుపరచడం, సందర్శకులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడం చేస్తారు.


డీపీఆర్ (Detailed Project Report) వివరాలు

అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం సమగ్రమైన డీపీఆర్ తయారు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ డీపీఆర్‌ను కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రెండు మూడు సార్లు సమర్పించారు. ఆయన సహకారంతో ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. డీపీఆర్‌ ప్రకారం గోదావరి నది తీరంలో వాక్‌వేలు, సీటింగ్ ఏరియాలు, లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. పర్యాటకులకు సౌకర్యవంతమైన రవాణా, హోటళ్లు, రెస్ట్ రూమ్‌ల ఏర్పాటు చేస్తారు. గోదావరి నదిపై బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, రివర్ క్రూయిజ్‌లను ప్రోత్సహిస్తారు. గోదావరి నది ఒడ్డున పచ్చదనాన్ని పెంచడం, కాలుష్య నియంత్రణ చర్యలు చేపడతారు.

గోదావరి నదిని పర్యాటక ప్రాంతంగా...

గోదావరి నది భారతదేశంలో రెండవ అతిపెద్ద నదిగా (1,465 కి.మీ. పొడవు) ఉంది. దీని సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, సాంస్కృతిక వారసత్వం పర్యాటక అభివృద్ధికి గొప్ప అవకాశాలను అందిస్తాయి. అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కొన్ని పనులకు టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలో పూర్తిస్థాయిలో టెండర్ ప్రక్రియ ముగుస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు.

గోదావరి నది ఒడ్డున స్థానిక చేతివృత్తులు, ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేసేటప్పుడు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Read More
Next Story