తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో గొడ్డు కొవ్వును వాడారా?.. నెయ్యిలో ఉండాల్సిన ఎస్-విలువల్లో తేడాలు ఉన్నాయా?.. గుజరాత్ లో ఎన్డీడీబీ లాబ్ ఈ విషయాన్ని నిర్దారించిందా? ఇవన్నీ భక్తుల్ని వెంటాడుతున్న ప్రశ్నలైతే నిజమే ఇవన్నీ కచ్చితంగా నిజమేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఆపార్టీ అధికార ప్రతినిధి ఆననం వెంకట రమణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఈ విషయాన్ని ఢంకా భజాయించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరపాటున విజిటబుల్ ఫాట్ అనడానికి బదులు యానిమల్ ఫాట్ అన్నారేమోనని అనుకున్న వారికి కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బహుశా ఇది మున్ముందు మరింత రాజకీయ దుమారాన్ని రేపవచ్చు. ఈ రిపోర్టుకు ప్రతిగా వైసీపీ కూడా వేరే ఏదైనా ల్యాబ్ నుంచి నివేదికలు తెప్పించి జనం పెట్టవచ్చు. ఇప్పటికే వైఎస్ జగన్ అనుంగు అనుచరుడు, విశ్వాసపాత్రుడైన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ బాబాయి, టీటీడీ మాజీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి టీటీడీ బయటపెట్టిన ల్యాబ్ రిపోర్టు నిజమైందో కాదో నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
ఆ ల్యాబ్ రిపోర్టులో ఏముందంటే...
హిందూ భక్తులకు అత్యంత ఇష్ట ప్రసాదంమైన శ్రీవారి లడ్డూలో ఎద్దు, పంది కొవ్వు, చేపనూనెలతో కల్తీ అయిన నెయ్యిని గత వాడినట్టు గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ తేల్చినట్టు టీడీపీ అధికార ప్రతినిధి బయటపెట్టారు. ఈ సందర్భంలో ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..."వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నెయ్యిని వినియోగించారు. ఇది శ్రీవారి భక్తకోటిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో సుదీర్ఘకాలంగా శ్రీవారికి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ను టీటీడీ అధికారులు పక్కన పెట్టారని ఆ సంస్థే ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన ఎస్-విలువలు లేవు. మామూలుగా చిన్న చిన్న హోటళ్లలో కూడా ఇటువంటి నెయ్యిని వాడరు" అన్నారు రమణారెడ్డి.
మా నివేదిక కచ్చితం కూడా కాకపోవచ్చు?
ఇన్ని వివరాలు చెప్పిన ఎన్డీడీబీ సంస్థ తమ నివేదిక అన్ని సందర్భాలలో కచ్చితం కాకపోవచ్చునని ఎందుకన్నది? ఇప్పుడు దీనిపై చర్చసాగుతోంది. ఎన్డీడీబీ చెప్పిన ప్రకారం... బలమైన మేపులేని ఆవుల నుంచి తీసిన పాలతో తయారయ్యే నెయ్యి నమూనాలను పరీక్షించినపుడు, ఆవులకు పెట్టే దాణాలో తేడాలు ఉన్నప్పుడు, ఆవాలు, పామాయిల్, అవిశలు వంటి వెజిటబుల్ ఆయిల్స్ తో తయారైన దాణాను తినే ఆవుల నుంచి తీసిన పాలను పరీక్షీంచినపుడు వెజిటబుల్ ఫ్యాట్స్ కనిపించవచ్చు, కృత్రిమ పద్ధతుల ద్వారా సేకరించిన పాల నుంచి తీసిన నెయ్యిలో కూడా ఈ ప్రమాణాల్లో తేడాలు రావొచ్చునని పేర్కొంది. ఇప్పుడిదే ప్రత్యర్థి పార్టీకి ఆయుధం కాబోతోంది.
ఏమిటీ ఎస్- విలువంటే...
ఆవు పాల నుంచి తీసే వెన్నలో ఉండాల్సినంతలో ప్రమాణాలు ఉన్నాయా లేదా అని నిర్దారించడం. దీన్ని ఐదారు విభాగాల్లో నిగ్గు తేలుస్తారు. ఉదాహరణకు పల్లెల్లో డెయిరీలకు పాలు పోసినప్పుడు వాటిలో వెన్న శాతాన్ని నిర్ణయించేందుకు అక్కడికక్కడే ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఓ ట్యూబులో పాలను తీసుకుని దానికి ఒక ఎసెన్స్ కలిపి అక్కడున్న యంత్రంలో పెడితే ఏయే పాలల్లో ఎంతెంత వెన్న వస్తుందో చెబుతారు. అలాగే టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యిని అనుమానం వచ్చినపుడు పెద్ద డెయిరీ సంస్థల్లోని ల్యాబ్ లకు పంపి పరీక్షిస్తారు. ఐఎస్ఓ నిర్దేశించిన ప్రకారం ప్రమాణాలు ఉన్నాయో లేదో తేల్చి విధానాన్ని నిర్దేశిత ప్రమాణాల పద్ధతి (స్టాండర్డ్ వాల్యూస్, సంక్షిప్తంగా ఎస్-వాల్యూ). గ్యాస్, లిక్విడ్ క్రొమటోగ్రఫీని ఈ పద్ధతికి వినియోగిస్తారు. ఇప్పుడు టీటీడీ తనకు వచ్చిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై అనుమానం రావడంతో గుజరాత్ లోని నేషనల్ డెయిరీ కి పంపింది. ఐదు విభాగాల్లో పరీక్షించిన తర్వాత అందులో పంది, ఎద్దు కొవ్వుతో పాటు చేప నూనెలు కలిపినట్టుగా తేలిందని, నిర్దేశిత ప్రమాణాలు అంటే ఎస్-విలువలు లేవని తెలుగుదేశం చెబుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీవారి లడ్డూల నాణ్యత తగ్గిందన్నది టీటీడీ ఆరోపణ.
శ్యామలరావు అంతగా నిఘా పెట్టారా?
టీడీపీ చెబుతున్న ప్రకారం... టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యీ, ఇతర సౌకర్యాలపై ఈవో శ్యామలరావు నెలపాటు పోటు కార్మికులు, అన్న ప్రసాదాల తయారీ విభాగం కార్మికులు, అధికారులతో తరచూ సమావేశమై సమీక్షించారు. ఏయే వస్తువులు వాడుతున్నారు? ఎంత పరిమాణంలో? ఎక్కడి నుంచీ సేకరిస్తున్నారు? వాటి నాణ్యత ఎలా వుంది? పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏమిటి? అని ఆరా తీశారు. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ఆయన దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీన్ని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్‌కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో.. తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందినీ నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
ప్రకృతి వ్యవసాయ దిగుబడులపైన్నా అనుమానాలు..
శ్రీవారి అన్న ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ దిగుబడులను వాడుతున్నామని, ఆ కారణంగా రుచిలో తేడా వచ్చింది తప్ప నాణ్యత దెబ్బతినలేదని అప్పట్లో టీటీడీ అధికారులు చెప్పిన వివరణ కూడా భక్తులకు సంతృప్తి కలిగించలేదు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రుచి, సువాసన, నాణ్యతలో తేడా లేకుండా చర్యలు తీసుకున్నాకే ప్రవేశపెట్టాలి. కానీ, ఆలోచన వచ్చిందే తడవుగా కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాల తయారీని ఎలా మారుస్తారన్న ప్రశ్నకు టీటీడీ నుంచి అప్పట్లో సమాధానం లేకపోయిందని తెలుగుదేశం ప్రశ్నించింది.
రివర్స్ టెండరింగ్ లో ‘నందినీ’కి టెండర్!
దేశంలో గుజరాత్ ఆనంద్ డెయిరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్ఠలున్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందినీ బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘ కాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యతాపరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కర్నాటక డెయిరీ నుచే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నిందినీ నెయ్యి సరఫరాను నిలిపివేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెట్టిందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ అప్పట్లో ఆరోపించారని తెలుగుదేశం గుర్తు చేసింది.
వైసీపీ ఏం చేయబోతోందంటే..
తెలుగుదేశం బయటపెట్టిన నివేదిక విశ్వసనీయతను పరీక్షించాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ పనిని టీటీడీకి ఛైర్మన్లుగా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి అప్పగించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ సున్నిత అంశంపై ఈ ఇద్దరూ తప్ప ఆ పార్టీ పెద్ద నేతలెవ్వరూ నోరు మెదపొద్దని పార్టీ అధినేత ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే హిందువుల ఓట్ల మాట ఎలా ఉన్నా ఆ వర్గాలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉండడంతో ఆచితూచి అడుగులేస్తున్నారు. తెలుగుదేశం బయటపెట్టిన నివేదికను నిగ్గు తేల్చేందుకు పార్టీ నేతలు కొందరు గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవల్మెంట్ కార్పొరేషన్ ను సంప్రదించినట్టు సమాచారం. నివేదిక పై తేదీలు లేవని, ఎవరో ఊరూపేరు లేని అనామకులు సంతకం చేసినట్టుగా ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడ్రోజుల్లో వైసీపీ కూడా ఒక నివేదికను బయటపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఈ ఆరోపణ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓ సంచలనం. మున్ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో మరెంత మంది మెడకు చుట్టుకుంటుందో చూడాలి.