వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం ఏం చెప్పారు!
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం వారిని ఏం చేయనుంది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏం చెప్పారు?
‘వాలంటీర్లకు భయం వద్దు. మా ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని కొనసాగిస్తాం. ఒక్కొక్కళ్లు రూ.50వేలు జీతం సంపాదించుకునేలా మారుస్తాం’ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు. ఒక్క వాలంటీరును కూడా విధుల నుంచి తప్పించమని, వానికి తప్పకుండా న్యాయం చేస్తామని కూడా చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే భారీ మెజార్టీతో ఏర్పడటంతో వాలంటీర్లందరూ తమకు ప్రభుత్వం ఏం చేస్తుందా అన్న ఆసక్తి, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అదే విధంగా మరోవైపు తమకు పట్టించుకోకుండా వదిలేస్తుందేమో ఈ ప్రభుత్వం అన్న భయం కూడా వారిని ఆందోళనకు, కంగారుకు గురిచేస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వాలంటీర్లు కానీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కానీ సీఎం కాదు కదా ఏ మంత్రిత్వ శాఖ కూడా స్పందించకపోవడంతో వాలంటీర్లలో ఆందోళన అధికమైపోతోంది.
దీనికి తోడుగా జూలై 1వ తేదీ నుంచి వాలంటీర్లతో అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది సహాయంలో ఇళ్లకే పింఛన్‌ను పంపిణీ చేయడంతో వాలంటీర్లలో ఆందోళన అంతకంత పెరిగింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అన్న డైలమాలో వారు పడిపోయారు. తమ పరిస్థితిపై ఎవరిని అడగాలి? ఏం చేయాలి? అన్న ప్రశ్నలతో వారు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల భవితవ్యం ఏంటి? వారిని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు కొనసాగిస్తుందా? లేకుంటే ఏదో ఒక కుంటి సాకులు చెప్పి తొలగిస్తుందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
బాబు చెప్పిందిది
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అంతా అన్యాయం అయిపోతారని కొన్ని శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం వస్తే స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలను మారుస్తాం. ఇప్పటిలా నెలకు రూ.5 వేలు రూ.8 వేలు కాకుండా ప్రతినెలా వాళ్లు రూ.30 నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తాం. వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాం. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లకు ఎటువంటి అన్యాయం జరగనివ్వం’’అని ఎన్నికల సమయంలో ఆయన చేసిన కుప్పం పర్యటనలో ఈ మేరకు హామీ ఇచ్చారు.
‘‘ఒక్క వాలంటీర్‌ను కూడా ఉద్యోగం నుంచి తొలగించం. ప్రజలకు ఇన్నాళ్లూ సేవ చేసిన వాలంటీర్లకు న్యాయం చేస్తాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయంతో వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు’’ అని హామీ ఇచ్చారు.
వాలంటీర్ల గురించి ఆలోచిస్తాం: పవన్ కల్యాణ్
తాజాగా రాష్ట్రంలో ఆగిపోయిన వాలంటీరు వ్యవస్థ, వాలంటీర్ల గురించి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో విలేజ్ వాలంటీర్లు అని ఒక ప్రైవేటు సంస్థ పెట్టారు. వారంతా పింఛన్‌ను డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. అంతవరకు మంచిదే. కానీ వారు పింఛన్ అందిస్తూ అందులో రూ.100 తీసుకునేవారు. దానికి ఏమైనా పేరు పెట్టుకోంది. అది మాత్రం తప్పు. ఎన్నికల ముందు కూడా వాలంటీర్లు లేకపోతే పింఛన్‌ను ఇంటి దగ్గరే ఇవ్వడం కుదరని పని అని చేతులెత్తేసి దాదాపు 33మంది వృద్దుల మరణాలకు కారణమైంది గత ప్రభుత్వం. ఈసారి వాలంటీర్లు లేరు.. పింఛన్ ఏమైనా ఆగిపోయింది. ఇంటికే వెళ్లింది కదా. పైగా ఒక గంట ముందే చేరింది. ఇక ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అని అంతా చర్చించుకుంటున్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తాం. ఎవరూ భయపడొద్దు’’ అని చెప్పారు.
‘మీకా హక్కు ఉంది’
‘‘మీకు పింఛన్ డబ్బులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగికి ఉంటుంది. వారు మీ దగ్గర నయాపైసా ఆశించకుండా మీకు అందాల్సిన మొత్తం పింఛన్‌ను ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు అలా తప్పు చేస్తే వారిపై ఫిర్యాదు చేసే హక్కు ప్రజలకు, లబ్దిదారులకు తప్పక ఉంటుంది. వ్యవస్థలను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే పింఛన్‌ల పంపణీ కూడా చేయించాం’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.