
పేదలకు పూర్తిగా తెరచుకోని కార్పొరేట్ స్కూళ్ల తలుపులు
విద్యాహక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ప్రయివేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం అడ్మిషన్లు అమలు కావడం లేదు.
ఏపీలో విద్యా హక్కు చట్టం అరకొరగా అమలవుతోంది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తప్పించుకునే పనిలో ఉన్నాయి. పేదలకు రిజర్వేషన్ ఇవ్వటం వరకు బాగున్నా... తమకు ఇవ్వాల్సిన ఫీజులపై సీలింగ్ పెట్టడం ఏమిటని స్కూల్స్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు పూర్తి స్థాయిలో విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని యాక్టివిస్ట్ లు కోరుతున్నారు.
పేదరికంలో ఉన్న విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రభుత్వం సక్రమంగా ఎందుకు అమలు చేయలేక పోతోంది? ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యంపై పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరపున న్యాయవాది పిటీషన్ వేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? హైకోర్టు జోక్యం చేసుకునే వరకు చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి చేతకాలేదంటే ఏమనాలి? ఈ చట్టం అమలు వల్ల పేద విద్యార్థి జీవితంలో వెలుగులు వస్తాయి. ఫీజులు చెల్లించి చదివించలేని తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక వరం.
ప్రైవేట్ విద్యా సంస్థలు ఎందుకు చట్టాన్ని అమలు చేయలేదు
విద్యాశాఖ ఎంతో పకడ్బందీగా చట్టాన్ని అమలు చేయాలని చూసినా పాలకుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. మంత్రులతో విద్యాసంస్థల యజమానులకు ఉన్న సంబంధాలు ఈ చట్టాన్ని నీరు కార్చేలా చేశాయనే విమర్శలు ఉన్నాయి. 25 శాతం పేద విద్యార్థులకు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో ఒకటవ తరగతిలో సీట్లు కేటాయించాలి. స్కూలు ఫీజులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులు ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థుల తరపున స్కూళ్లకు చెల్లించడం లేదని ప్రైవేట్ స్కూల్స్ వారు చట్టాన్ని అమలు చేయకుండా వదిలేశారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల రిజర్వేషన్‌ను అమలు చేయడానికి రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం 2009లోని సెక్షన్ 12(1)(C) కింద నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధన ప్రకారం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ ఒకటో తరగతి నుంచి ఉచిత విద్య అందించాలి.
అమలులో సవాళ్లు
2023లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 24ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2024లో కొట్టివేసింది. ఈ జీవో అమలులో సమయం, పారదర్శకత, రీయింబర్స్‌మెంట్ విధానాల విషయంలో లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు తర్వాత ప్రైవేటు సంస్థలు, విద్యాశాఖ మధ్య గందరగోళం నెలకొంది. విద్యాశాఖ అధికారులు 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే చాలా ప్రైవేటు పాఠశాలలు RTE వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయడంలో విఫలమయ్యాయని, తమ పాఠశాలలను స్థానిక మ్యాపింగ్‌లో చూపించడం లేదని విద్యార్థుల తల్లదండ్రులు ఆరోపించారు. దీని వల్ల విద్యార్థులు సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయారు.
విద్యాశాఖ వద్ద లేని గణాంకాలు
2022-23 ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 2,500 మంది విద్యార్థులు RTE కింద చేరారు. అయితే చాలా పాఠశాలలు ఈ సీట్లను పూర్తిగా కేటాయించలేదని, రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా నిరాకరించాయని ఆరోపణలు ఉన్నాయి. 2023-24వ సంవత్సరంలో చేరికల సంఖ్య కాస్త పెరిగింది. 19,000 వేల మంది విద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ వారు చెబుతున్నారు.
గత ఏడాదిలో...
2024-25 విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య కాస్త పెరిగింది. 30 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో ఆర్టీఈ చట్టం కింద చేరగలిగారు. ఏదో విధంగా పేద విద్యార్థులను స్కూళ్లకు రాకుండా చేయాలని ప్రైవేట్ స్కూల్స్ వారు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇందుకు పలువురి పోరాటాలు తోడు కావడంతో ప్రైవేట్ స్కూల్స్ వారు పేద పిల్లలకు అవకాశం కల్పించక తప్పలేదు.
ఈ ఏడాదిలో...
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్త దరఖాస్తులు ఆహ్వానించారు. విద్యాశాఖ అధికారులు చెప్పిన ప్రకారం, ప్రైవేటు పాఠశాలలకు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, అడ్మినిస్ట్రేటివ్ సమస్యలను కారణంగా చూపుతూ సీట్ల కేటాయింపులో ఆసక్తి చూపడం లేదు. కొందరు అధికారులు RTE వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, స్థానిక స్కూల్ మ్యాపింగ్‌లో లోపాలు కూడా అమలుకు అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు తమ పేర్లు రాయొద్దని, అమలు చేయాల్సిన తామే ఈ విధంగా చేశామని తమపైనే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సిఖరం నరహరి మాట్లాడుతూ ‘ప్రైవేటు పాఠశాలలు సుప్రీం కోర్టు ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. విద్యాశాఖ నిధుల వినియోగంలో స్పష్టత లేదు’ అని విమర్శించారు.
ప్రైవేటు మేనేజ్‌మెంట్‌ల వైఖరి
యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫెడరేషన్ సభ్యులు RTE అమలులో ప్రభుత్వం తగిన విధంగా స్పందించ లేదని అంటున్నారు. స్కూలు యాజమాన్యాల వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి జీవో నెం. 24ను రద్దు చేయించారు. రీయింబర్స్‌మెంట్ విధానంలో స్పష్టత లేకపోవడం, అమలు సమయంలో ఆలస్యం వంటి సమస్యలను వారు లేవనెత్తారు. కొన్ని పాఠశాలలు ఈ చట్టం కింద చేరిన విద్యార్థులను 2024 డిసెంబర్ 31 తర్వాత తొలగించే అవకాశం ఉందని హెచ్చరించాయి.
జీవో 24 జారీ చేయడానికి కారణాలు
RTE యాక్ట్ అనేది జాతీయ స్థాయిలో రూపొందించిన చట్టం. ఇది 25శాతం రిజర్వేషన్ సీట్లను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కేటాయించాలని నిర్దేశిస్తుంది. అయితే ఈ చట్టం అమలు విధానాలు, నిర్వహణ స్థానిక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. జీవో 24ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయడం ద్వారా RTE యాక్ట్‌లోని సెక్షన్ 12(1)(c)ను రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు, స్థానిక నిబంధనలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్రంలోని పాఠశాలలకు, విద్యాశాఖ అధికారులకు, తల్లిదండ్రులకు అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్దేశించింది.
అమలులో ఏకరూపత కోసం..
రాష్ట్రంలో వివిధ జిల్లాల పాఠశాలలలో RTE యాక్ట్ అమలు విధానంలో వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది. అందుకే జీవో 24 ద్వారా ప్రభుత్వం ఏకరూప విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నించింది. దీని ద్వారా ప్రవేశ ప్రక్రియ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర అంశాలు ఒకే విధమైన నియమాల కిందకు వస్తాయి. ఉదాహరణకు జీవో 24లో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ, రిజర్వేషన్ సీట్ల కేటాయింపు, ఫీజు చెల్లింపు విధానాలకు సంబంధించిన నిర్దిష్ట సూచనలు రాష్ట్ర స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.
జీవో 24 రద్దు ఎందుకు జరిగింది?
జీవో 24ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2024 అక్టోబర్‌లో రద్దు చేసింది. అమలులో లోపాలు ఉన్నాయని పేర్కొంది. మండల విద్యాశాఖ అధికారులు అనధికారంగా విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేసే అవకాశం ఈ జీవో కల్పించింది. ఇతర రాష్ట్రాల్లోని బీడీవోలు కూడా ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇది RTE యాక్ట్‌కు విరుద్ధం. ఆకారణంగా ప్రవేశాలు రద్దు చేయడం విద్యార్థుల హక్కులను ఉల్లంఘించినట్లయింది. ఈ లోపాల కారణంగా జీవో 24 చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. RTE యాక్ట్ యధావిధిగా అమలు కొనసాగుతోంది.
25 శాతం సీట్ల కోసం రిజర్వేషన్ ప్రమాణాలు
అనాథలు, హెచ్‌ఐవి బాధిత పిల్లలు, దివ్యాంగుల పిల్లలకు 5 శాతం, షెడ్యూల్డ్ కులాలు (SC) 10 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ST) 4 శాతం, బలహీన వర్గాలు (BC, మైనారిటీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓసీలకు రూ. 1,20,000లు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1,44,000లు వార్షిక ఆదాయం ఉన్న వారికి 6 శాతం రిజర్వేషన్ ఉంది. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (SCPCR) RTE కింద 25,125 మంది పిల్లలకు ఉచిత విద్య అందించనున్నట్లు నివేదించింది.
ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ లో 25 శాతం రిజర్వేషన్ ప్రకారం సుమారు 85 వేల నుంచి 90 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు తప్పకుండా ఆర్టీఈ కింద భర్తీ చేయాల్సి ఉంది. అయితే చట్టం 2010లో అమలులోకి వస్తే 2020 వరకు ఏపీలో చట్టాన్ని అమలు చేయలేదు. కొందరు సివిలియన్స్ పోరాటాల ఫలితంగా మూడు సంవత్సరాలుగా చట్టం అమలవుతోంది. అది కూడా అరకొరగానే ఉంది. పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ప్రభుత్వం కాస్త గట్టిగా వ్యవహరించాల్సి ఉంటుంది.
చట్టం అమలుకు 2017 నుంచి న్యాయవాది పోరాటం
రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని ఏపీలో పకడ్బందీగా అమలు చేయాలని, పేద విద్యార్థులకు విద్యనందించడం ద్వారా వారి కుటుంబాల్లో స్వాంతన చేకూర్చాలని కోరుతూ ఏపీ హైకోర్టు అడ్వకేట్ తాండవ యోగేష్ 2017లో కోర్టులో ఫిల్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిగాయి. విచారణ పూర్తయిన తరువాత 2022 జనవరి 3న తీర్పు వచ్చింది. తప్పనిసరిగా చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో స్కూల్స్ యాజమాన్యాలపై ప్రభుత్వం వత్తిడి పెంచింది. దీంతో చట్టాన్ని అమలు చేసే దిశగా స్కూల్స్ వారు అడుగులు వేశారు.
సిటిజన్ గా ఫైట్ చేస్తున్నా...
ఎంతో మంది పేద పిల్లలు ఈ దేశంలో చదువుకు దూరమవుతున్నారు. వీరికి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వరం లాంటిదని హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ దేశంలోని చాలా రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ అమలు చేయలేదు. మిగిలిన రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. నేను కోర్టులో ఫిల్ వేసి చట్టాన్ని అమలు చేయాల్సిందేనని కోర్టు ద్వారా ప్రభుత్వాలకు ఆదేశాలు అందేలా చేయడంలో సఫలమయ్యాను. అందుకు నాకు గర్వంగా ఉందని అన్నారు. ఏపీలో కూడా రెండేళ్లుగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు.
నా కృషి ఫలితంగా ఇప్పటి వరకు 50 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో చేరి చదువుకో గలుగుతున్నారన్నారు. ఇంతకంటే సంతోషం మరొకటి ఏముంటుందన్నారు. ఈ ఏడాది నుంచి తెలంగాణలో కూడా అడ్మిషన్ ల కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలో మొదట ఏప్రిల్ 28 నుంచి స్కూల్స్ లో అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారని, ఆ తరువాత తేదీ మార్చి మే 2 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రచారం చేయడం లేదని, దీనివల్ల పేద విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియలేదన్నారు. టీవీలు, రేడియోలు, పత్రికల్లో భారీగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్కూల్ వెబ్సైట్స్ లో దరఖాస్తలు చేసుకోవాల్సి ఉంటుందని, కిలో మీటరు లోపు ఉన్న విద్యార్థులకు మొదటి ప్రయారిటీ, 3 కిలో మీటర్ల దూరం ఉన్న వారికి రెండో ప్రయారిటీ, ఐదు కిలో మీటర్ల దూరం వారికి మూడో ప్రయారిటీ ఉంటుందన్నారు. అయితే వెబ్సైట్ లో స్కూలు వివరాలు లేకుండా చేస్తున్నారని, అందువల్ల దగ్గరలోని స్కూళ్లలో పిల్లలు చేరే అవకాశం లేకుండా పోతోందన్నారు.
చట్టంలోని రూల్ 10 ప్రకారం ఫీజులు రూ. 5వేలు, 8వేలు గా ప్రభుత్వం నిర్ణయించిందని, తక్కువ ఫీజు నిర్ణయించడం వల్ల స్కూల్స్ వారు పిల్లలను చేర్చుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను రెండు దఫాలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అవి కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో స్కూల్స్ వారు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ కారణాల వల్ల కూడా పిల్లలు స్కూల్స్ లో చేరే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు.
పబ్లిసిటీ పెరగాలి: బివిఎస్ కుమార్
రైట్ ఎడ్యుకేషన్ చట్టం సక్రమంగా అమలు జరగాలంటే ప్రచారం పెంచాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కృష్ణా జిల్లా మాజీ చైర్మన్ డాక్టర్ బీవీఎస్ కుమార్ అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’తో మాట్లాడుతూ స్కూల్స్ స్థాయిని బట్టి ఫీజులు ఉంటున్నాయని, ప్రభుత్వం ఫిక్స్ డ్ గా ఫీజులు నిర్ణయించి అంతే ఇస్తామనటం వల్ల కూడా విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ వారు చేర్చుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇచ్చే రీయింబర్స్ మెంట్ కూడా సకాలంలో ఇవ్వటం లేదన్నారు. ఒకటవ తరగతిలో ఒక్కసారి చేరితే పదో తరగతి వరకు ఆ విద్యార్థి ఎటువంటి అడ్డంకులు లేకుండా చదువుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంపై గత ప్రభుత్వానికి కూడా తాను లేఖలు రాసినట్లు చెప్పారు.
మూడేళ్లుగా రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు
ఆర్టీఈ కింద విద్యార్థులను స్కూళ్లలో చేర్చుకోవాలని ప్రభుత్వం వత్తిడి తెస్తోందని, చేర్చుకున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన రీయింబర్స్మెంట్ ఇంత వరకు ఇవ్వలేదని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆయన ‘ది ఫెడరల్ ఏపీ’ ప్రతినిధితో మాట్లాడుతూ ఇచ్చేది చాలా తక్కువ ఫీజు అని, ఆ ఫీజు కూడా సకాలంలో చెల్లించ లేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఫీజులు సరిపోవని, ఈ ఫీజును పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.