ఏ నెయ్యి ఏమిటో దేవుళ్లకే ఎరుక!
x

ఏ నెయ్యి ఏమిటో దేవుళ్లకే ఎరుక!

ఆవు, గేదె పాలు కలిపేస్తున్న డెయిరీలు. ఆ పాలతోనే ఆవు, గేదె నెయ్యిలుగా మార్కెట్లోకి. అందుకే తక్కువ ధరకు దేవాలయాలకు సరఫరా ? భక్తులు, ప్రజల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలు


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

దేవస్థానాలకు టెండరుదార్లు సరఫరా చేస్తున్నది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదా? పలు సంస్థలు గేదె నెయ్యినే ఆవు నెయ్యిగా చూపి సరఫరా చేస్తున్నాయా? అందుకే అతి తక్కువ ధరకే ఆవు నెయ్యిని పంపిణీ చేయగలుగుతున్నారా? తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారన్న దుమారం నేపథ్యంలో ఇప్పుడు అనేకమందిలో ఇవే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల నుంచి పాల సేకరణ ప్రక్రియను పరిశీలిస్తే ఈ సందేహాలు బలపడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ డెయిరీలు, సంస్థలు గ్రామాల్లో సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. పాలలో వెన్న శాతం, సాలిడ్స్ నాట్ ఫ్యాట్ (ఎస్ఎన్ఎఫ్)లను బట్టి కొనుగోలు ధర నిర్ణయిస్తాయి. ఈ కేంద్రాల్లో ఉండే మిల్క్ అనలైజర్ల ద్వారా వీటిని నిర్దరిస్తాయి. వెన్నశాతం గేదె పాలలో ఎక్కువగాను, ఆవు పాలలో తక్కువగాను ఉంటుంది.

అందువల్ల ఆవు పాలకంటే గేదె పాలకే ఎక్కువ ధర చెల్లిస్తాయి. గేదె పాలలో వెన్న 10.0 శాతం, ఎస్ఎన్ఎఫ్ 900 ఉంటే లీటరుకు గరిష్టంగా రూ.80 వరకు ఇస్తాయి. ఇలా వెన్న శాతం ఆధారంగా లీటరుకు రూ.40-80 వరకు చెల్లింపులు చేస్తాయి. అదే ఆవు పాలకు 4.0 వెన్న శాతానికి పైగా ఉంటే లీటరుకు రూ.33-44 వరకు ఇస్తాయి. గేదె పాలలో వెన్న శాతం 5.0కంటే తగ్గితే ఆవు పాల ధరనే నిర్ణయిస్తాయి. ఆవు పాలకంటే గేదె పాల ధర దాదాపు రెట్టింపు ఉంటోంది. ఆవు పాలలో వెన్న శాతం తక్కువగా ఉండడం వల్ల గేదె పాలకంటే నెయ్యి తక్కువగా వస్తుంది. దీంతో గేదె నెయ్యికంటే ఆవు నెయ్యి ధర అధికంగా ఉంటుంది. మార్కెట్లో స్వచ్ఛమైన గేదె నెయ్యి సగటున రూ.600 ఉంటే.. ఆవు నెయ్యి రూ. వెయ్యి పైమాటే!

బల్క్ కూలింగ్ సెంటర్లలో ఏం జరుగుతోంది?

సేకరణ కేంద్రాల్లో ఆవు, గేదె పాలను సేకరిస్తారు. వాటిలో వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ను తేల్చాక క్యాన్లలో వేరు వేరుగా వేస్తారు. వాటిని బల్క్ కూలింగ్ సెంటర్లకు పంపిస్తారు. అక్కడ వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ మేరకు రేటు నిర్ణయిస్తారు. ఆపై ఆ రెండింటిని కలిపి కూలింగ్ ట్యాంకుల్లో నిల్వ ఉంచి అనంతరం ట్యాంకర్లలో డెయిరీలకు తరలిస్తారు. డెయిరీల్లో వెన్న తీసి నెయ్యిని తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ఆవు పాల నుంచి, గేదె పాల నుంచి విడివిడిగా నెయ్యి ఎలా వస్తుందన్నదే ప్రశ్నగా ఉంది. అయితే కొన్ని డెయిరీ యాజమాన్యాలు తాము ఆవు పాలను, గేదె పాలను వేర్వేరుగా తరలిస్తామని చెబుతున్నాయి. కానీ సేకరణ కేంద్రాల నిర్వాహకులు మాత్రం అదంతా అసత్యమని కొట్టి పారేస్తున్నారు.

నెయ్యి రకాన్ని పరీక్షించని దేవస్థానాలు..

టెండరు దక్కించుకున్న డెయిరీలు/సంస్థలు దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా చేస్తుంటాయి. అయితే ఆ దేవస్థానాలు వచ్చిన నెయ్యిలో నాణ్యతను పరీక్షించడానికే లేబరేటరీలకు పంపిస్తాయి. అక్కడ ఆ నెయ్యిలో నాణ్యత లోపం లేదని నివేదిక ఇచ్చాక ఆలయాల అవసరాలకు, లడ్డూ, ఇతర ప్రసాదాల్లోనూ వినియోగిస్తారు. అంతే తప్ప తమకు సరఫరా చేసినది ఆవు నెయ్యా? గేదె నెయ్యా? అన్నది తేల్చాలని ల్యాబ్లకు పంపడం లేదని తెలుస్తోంది. దీనినే ఆసరాగా తీసుకున్న కొంతమంది టెండరుదార్లు గేదె నెయ్యినే ఆవు నెయ్యిగా సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. అందువల్లే ఆవు నెయ్యి ధరలో సగంకంటే తక్కువ రేటుకే దేవస్థానాలకు సరఫరా చేస్తున్నారన్న వాదనకు చేకూరుతోంది. టెండరు పొందిన మరికొన్ని డెయిరీలు/సంస్థలైతే తాము సరఫరా చేసే నెయ్యిలో కల్తీకి పాల్పడుతూ దేవుళ్లకు అపచారానికి ఒడిగడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేవస్థానాలకు సరఫరా చేస్తున్నది పవిత్రమైన ఆవు నెయ్యో కాదో ఆ దేవుళ్లకే ఎరుక! ఇకపై టెండరుదార్లు పంపిణీ చేసే నెయ్యి నాణ్యతనే కాదు.. ఆవు నెయ్యా? గేదె నెయ్యా? అన్నది తేల్చి చెప్పాలని లేబరేటరీలను కోరితే దీనికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.

Read More
Next Story