
అమరావతిలో పూలింగ్ కు ఇచ్చే భూముల కొనుగోలు వెనుక దాగిన సత్యాలు ఏమిటి?
రెండో విడత ల్యాండ్ పూలింగ్ భూములపై ధనవంతులు వాలారు. వారు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ఆ భూములను పూలింగ్ కు ఇస్తున్నారు. ఎందుకు?
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో, రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఒక విచిత్రమైన పోకడ కనిపిస్తోంది. ధనవంతులు, పెట్టుబడిదారులు స్థానిక రైతుల నుంచి భూములను అధిక ధరలకు కొనుగోలు చేసి, వాటిని ప్రభుత్వానికి పూలింగ్ కింద అందజేస్తున్నారు. యండ్రాయి గ్రామంలో ఎకరా రూ.1.80 కోట్లకు, సమీప గ్రామాల్లో రూ.1.60 కోట్లకు ఇటువంటి అమ్మకాలు జరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశాలు, లాభాలు, ఆరోపణలపై సమగ్ర విశ్లేషణ.
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పిఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందజేస్తారు. దీనికి బదులుగా వారికి అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు, 10 సంవత్సరాల పాటు వార్షిక భూమి అద్దె (అన్యూటీ), ఉచిత విద్య, ఆరోగ్య సేవలు వంటి సామాజిక ప్రయోజనాలు లభిస్తాయి. మొదటి విడతలో సుమారు 34,000 ఎకరాల భూమి సమీకరించబడింది. ఇందులో 86 శాతం స్వచ్ఛందంగా జరిగింది.
రెండో విడతలో కీలక ప్రాజెక్టులు
రెండో విడతలో 2025 డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, 16,666 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. మూడో విడత కూడా రానున్నట్లు మంత్రి నారాయణ సూచనలు ఇచ్చారు.
ఈ పథకంలో భూమి ఇచ్చినవారికి ఎకరాకు 1,000 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 450 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ లభిస్తాయి (పొడి భూమికి). ఈ ప్లాట్లు అసలు భూమి ఉన్న జోన్ లేదా గ్రామంలోనే కేటాయిస్తారు. ఇది అభివృద్ధి తర్వాత ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశం ఉంది.
భూములు కొంటున్న ధనవంతులు, ఏమిటి జరుగుతోంది?
రెండు, మూడో విడతల్లో ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి భూములను ముందస్తుగా కొనుగోలు చస్తున్నారు. ఉదాహరణకు యండ్రాయి వంటి గ్రామాల్లో ఎకరా రూ.1.80 కోట్ల వరకు ధరలు చెల్లిస్తున్నారు. కొనుగోలు తర్వాత వీరు ఆ భూములను పూలింగ్ కింద ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఇటువంటి ఒప్పందాలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా జరుగుతున్నాయి.
యండ్రాయి గ్రామానికి సమీపంలోని లింగాపురం గ్రామానికి చెందిన పెద్ద రైతు నంబూరి బలరామ్ 4 ఎకరాల పొలం యండ్రాయిలో కొనుగోలు చేశారు. ఆ పత్రాలను మంత్రి పి నారాయణ చేతికి అందజేశారు. ఆయన ఇటీవలే యండ్రాయిలో ఒక పేద రైతుకు చెందిన భూమి కొనుగోలు చేశారు. మొత్తం 1,879 ఎకరాల పట్టా భూములు, 46 ఎకరాల అసైన్డ్ భూములు యండ్రాయిలో పూలింగ్‌కు గురవుతాయి. రెండో విడతలో అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల నుంచి 16,666 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతులు ఎందుకు అమ్ముతున్నారు?
చాలామంది రైతులు భూమి ఇస్తే తమ జీవనోపాధి ఎలా సాగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. అందుకే ఇక్కడి భూములను అమ్మి వేరే ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పూలింగ్ ప్రక్రియలో అనిశ్చితి, ఆలస్యాలు వారిని ఈ నిర్ణయానికి నడిపిస్తున్నాయి. సత్తెనపల్లె ప్రాంతంలో ఎకరా రూ. 30 లక్షలకు వస్తోందని రైతులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో కొనుగోలు చేసి అక్కడే ఇల్లు వేసుకుని ఉంటే సరిపోతుందనే ఆలోచనకు యండ్రాయి రైతులు వచ్చారు.
ధనవంతులకు లాభాలు
ఈ కొనుగోలు వెనుక ప్రధాన ఉద్దేశం లాభాపేక్ష. పూలింగ్ ద్వారా లభించే అభివృద్ధి చేసిన ప్లాట్లు, ముఖ్యంగా కమర్షియల్ ప్లాట్లు, రాజధాని అభివృద్ధితో ధరలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్లాట్లు చదరపు గజానికి రూ.1 లక్ష ఉంటే, అభివృద్ధి తర్వాత రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అవుతాయి. ఒక ఎకరాకు లభించే 450 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్, సీడ్ యాక్సెస్ రోడ్లు వంటి కీలక ప్రాంతాల్లో ఉంటే విలువ ఊహకు అందకుండా ఉంటుంది.
స్థానికం ఆధారంగానే ప్లాట్ల కేటాయింపు
వాస్తవానికి భూమి స్థానం ఆధారంగా ప్లాట్లు కేటాయిస్తారు. నిర్దిష్ట గ్రామాలు లేదా జోన్లలో భూములు కొనుగోలు చేయడం ద్వారా, కావాల్సిన ప్రాంతాల్లో ప్లాట్లు పొందవచ్చు. ఇది ధనవంతులకు దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశం. అదనంగా అన్యూటీ చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
కుమ్మక్కు, ఇన్‌సైడర్ ట్రేడింగ్
ఈ ప్రక్రియలో కుమ్మక్కు ఆరోపణలు బలంగా ఉన్నాయి. నాయకుల అండదండలతో ధనవంతులు కమర్షియల్ ప్లాట్లను కీలక ప్రాంతాల్లో పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారుల మధ్య సంబంధాలు, కావాల్సినవారికి ప్లాట్లు కేటాయించడానికి సహాయపడుతున్నాయని చెబుతున్నారు.
2014-2015లో రాజధాని ప్రకటనకు ముందు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఉన్నాయి. టిడిపి నాయకులు, వారి సన్నిహితులు భూములు కొనుగోలు చేసి, ధరలు పెరిగిన తర్వాత లాభపడ్డారని సిఐడి నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం కూడా మూడో విడతకు ముందు ఇటువంటి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇది బ్లాక్ మనీ పెట్టుబడులకు మార్గం కావచ్చని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు ధ్రువీకరణ లేదు. కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టు ఇటువంటి కేసులను కొట్టివేసింది.
రైతులపై ప్రభావం
ఈ ప్రక్రియ రైతులకు నష్టం కలిగిస్తుందని వాదనలు ఉన్నాయి. చిన్న రైతులు భూమి అమ్మి వెళ్లిపోతున్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రెండో విడతలో రైతులు అధిక అన్యూటీ (ఎకరాకు రూ.60,000), స్పష్టమైన మౌలిక సదుపాయాలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రక్రియను ఆలస్యం చేస్తోంది.
మరో వైపు ధనవంతులు పూలింగ్‌ను నిరోధిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు పెద్ద భూస్వాములు తమ భూములను పూల్ చేయకుండా ఉంచి, అభివృద్ధి వల్ల ధరలు పెరిగినప్పుడు లాభపడాలని కోరుకుంటున్నారు. ఇది పథకానికి సవాళ్లు సృష్టిస్తోంది.
నా పొలం అమ్ముకున్నా: షేక్ షాన్ బాషా
నాకు రెండెకరాలు పొలం ఉంది. పూలింగ్ కు ముందుగానే పొలం అమ్ముకున్నా. ప్రస్తుతం ఎకరా భూమి రూ. 1, 60,000లు పలుకుతోంది. ఈ రెండెకరాలు పొలం అమ్ముకుంటే వేరే గ్రామాల్లో రెండెకరాలు పొలం రూ. 80 లక్షలకు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటా. పొలంలోనే ఇల్లు కట్టుకుంటా. నా కుమార్తె ఇంజనీరింగ్ చదువుకుంటోంది. ఆమె చదువుకు డబ్బులు కావాలి. పూలింగ్ కు ఇస్తే వారు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో తెలియదు. డెవలప్ మెంట్ ఎప్పటికి జరుగుతుందో తెలియదు. అప్పటి వరకు ఇంటి అవసరాలు, అమ్మాయి చదువుకు నానా ఇబ్బంది పడాలి. అందుకే ముందుగానే అమ్ముకున్నాను అని చెప్పారు. యండ్రాయిలో దాదాపు 500 కుటుంబాల రైతులు నాలాగే ఐదెకరాలు లోపు పొలం ఉన్న వారు. అందుకే వారంతా అమ్ముకుంటున్నారు అని చెప్పటం విశేషం.
నా పొలం పూలింగ్ కు ఇచ్చా: పిన్నమనేని భాష్కరరావు
నాకున్న ఐదెకరాలు పొలం పూలింగ్ కు ఇస్తున్నా. ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఇవ్వటం తప్పదు. అందుకే ఇస్తున్నా అని చెప్పారు.
ఎవరి ఇష్టం వారిది: నాయుడు రాంబాబు, సర్పంచ్
యండ్రాయి సర్పంచ్ నాయుడు రాంబాబు మాట్లాడుతూ ‘ఎవరి ఇష్టం వారిది. కొంత మంది నేరుగా పూలింగ్ కు ఇస్తున్నారు. కొంత మంది వేరే వారికి అమ్ముకుంటున్నారు’ అని అన్నారు. పేద వ్యవసాయ కూలీలకు పెన్షన్ లు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం రాయితీలు ఇవ్వాలి అని పేర్కొన్నారు. కూలీలు వలసలు పోకుండా ఉండాలంటే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరారు.
దీర్ఘకాలిక లాభాలకు పెట్టుబడి
అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో ధనవంతులు భూమి కొనుగోలు, దీర్ఘకాలిక లాభాల కోసం ఒక వ్యూహాత్మక పెట్టుబడి. అయితే కుమ్మక్కు, అసమానతల ఆరోపణలు ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం రైతుల హక్కులను కాపాడి, సమాన అవకాశాలు కల్పించాలి. ఇది రాజధాని అభివృద్ధికి సహాయపడుతుంది కానీ సామాజిక న్యాయాన్ని నిర్ధారించాలి. ఈ అంశంపై మరిన్ని దర్యాప్తులు అవసరం.

