వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ కథ కంచికేనా!
x

వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ కథ కంచికేనా!

రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ కేసుపై వీడని సస్పెన్స్. సీబీఐ దర్యాప్తులో మందగమనం. ఎన్నికల ముందు హడావుడి.. ఆ తర్వాత గుంభనం. రాజకీయ ఒత్తిళ్లేనని అనుమానాలు


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

సరిగ్గా అరు నెలల క్రితం విశాఖలో ఓ సంచలనం చోటు చేసుకుంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ డ్రగ్స్ కంటెయినర్ పట్టుబడింది. వంద, వెయ్యి కిలోలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల డ్రై ఈస్ట్లతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి రాకెట్ను సీబీఐ బట్టబయలు చేసింది. ఇది దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ పెను సంచలనమైంది. ఇంత పెద్ద ఎత్తున రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం, పైగా దేశాలు, సముద్రాలు దాటుకుని నౌకలో విశాఖ చేరడం అప్పట్లో దుమారం రేపింది. అయితే అది సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. వాటిని ఎవరికి వారే తమకు అనుకూల ప్రచార అస్త్రాలుగానూ మలచుకున్నాయి. ఎన్నికలయ్యాక ఆ సంగతినే మరిచిపోయాయి. ఇంతకీ ఈ డ్రగ్స్ కంటెయినర్ కేసు ఏమైంది? సీబీఐ ఏం తేల్చింది? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో సీబీఐపై ఉన్నత స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లే సీబీఐ దర్యాప్తును ముందుకు సాగనీయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగింది?

బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి 25 వేల కిలోల డ్రై ఈస్ట్, ఇతర డ్రగ్స్ ఉన్న కంటెయినర్ నౌక ఈ ఏడాది మార్చి 19న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)కు చేరుకుంది. విశాఖలోని సంధ్యా అక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ చిరునామాతో ఈ కంటెయినర్ వచ్చింది. ఎస్ఈకేయూ-4375380 నంబరు కలిగిన ఈ కంటెయినర్లో డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ రవాణా అవుతున్నట్టు ఇంటర్పోల్ ఢిల్లీలోని సీబీఐకి ఢిల్లీలోని సీబీఐకి రహస్య సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటీన రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఆ కంటెయినర్ను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. అందులో కళ్లు చెదిరే మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. మూడు రోజుల పాటు జరిపిన సుదర్జీ తనిఖీల్లో 25 వేల కిలోల బరువున్న వెయ్యి డ్రై ఈస్ట్ బ్యాగులను కనుగొన్నారు. వాటిలో డ్రెఈస్ట్లో పాటు కొకైన్, హెరాయిన్, ఓపీఎం, కొడైన్, మెథలాక్విన్ తదితర మాదక ద్రవ్యాల అవశేషాలున్నట్టు జడ్జి సమక్షంలో తేల్చారు. ఈ వెయ్యి బ్యాగుల్లో 30 శాతం ఈస్ట్, 70 శాతం బ్యాగుల్లో డ్రగ్స్ మూలాలు ఉన్నట్టుగా నిర్దారించారు. అనంతరం ఈ డ్రైఈస్ట్లో ఎంత పరిమాణంలో మాదక ద్రవ్యాలున్నాయో తేల్చేందుకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్తో పాటు మరికొన్ని లేబరేటరీలకు పంపారు. వీటిలో నిషేధిత మాదక ద్రవ్యాలు ఏ మేరకు ఉన్నాయో తేల్చేందుకు పంపించారు.

బ్రెజిలు సీబీఐ బృందం..

మరోవైపు కొద్దిరోజుల తర్వాత తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ అధికారుల బృందం ఇంటర్పోల్ సాయంతో బ్రెజిల్ వెళ్లింది. అక్కడకు వెళ్లిన సీబీఐ బృందానికి పక్కా ప్రణాళిక ప్రకారమే కంటెయినర్ విశాఖకు డ్రగ్స్ను సరఫరా చేశారన్న విషయం తెలిసొచ్చింది. శాంటోస్ పోర్టుకు డ్రై ఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గం, ఆ నౌక ఆగిన పోర్టుల్లో సీసీ ఫుటేజిలను పరిశీలించేందుకు వెళ్లిన సీబీఐ బృందానికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. శాంటోస్ పోర్టులో విశాఖకు వచ్చిన కంటెయినర్ నంబరుతో ఉన్న మరో కంటెయినర్ను కూడా గుర్తించారు. దీంతో ఒకే నంబరుతో రెండు కంటెయినర్లను తీసుకు వచ్చి తనిఖీల సమంలో ఒక దానినే చూపించి, లోడింగ్ చేసేటప్పుడు డ్రగ్స్ ఉన్న కంటెయినర్ ను నౌకలోకి ఎక్కించినట్టు అంచనాకు వచ్చారు. అయితే రెండో కంటెయినర్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకపోవడంతో వీరు ఈ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సీబీఐ బృందం బ్రెజిల్ వెళ్లడంతో త్వరలోనే ఈ డ్రగ్స్ రాకెట్ సూత్రధారులను అరెస్టు చేసి, దాని వెనక ఉన్న మూలలను బట్టబయలు చేస్తారని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అదేమీ జరగలేదు. డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారం బయట పడిన సమయంలో చూపిన హడావుడి, హంగామా ఆ తర్వాత కాలంలో కనిపించలేదు. ఈ కేసుకు సంబంధించి పురోగతీ లేదు. ఈ కేసుపై నివేదికనూ వెల్లడించలేదు.

ఈ ప్రశ్నలకు బదులేది?

- ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల్లో ఏం వచ్చింది? - డ్రై ఈస్ట్లో ఎంత శాతం డ్రగ్స్ కలిపారు?

- బ్రెజిల్ వెళ్లిన సీబీఐ బృందం ఏం తేల్చింది?

- కంటెయినర్ను వీసీటీపీఎల్లోనే ఎందుకు వదిలేశారు?

వంటి ప్రశ్నలు విశాఖ వాసులతో పాటు రాష్ట్ర ప్రజలను తొలిచేస్తున్నాయి.

ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఇంతటి భారీ డ్రగ్స్ కేసులో వ్యవహారానికి సంబంధించి సంధ్యా ఆక్వాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలుత సంధ్యా ఆక్వా సంస్థపై కేసు నమోదు చేసి ఆ సంస్థ ప్రతినిధులను సీబీఐ అధికారులు విచారించారు. వారు ఈ వ్యవహారంలో తమకేమీ సంబంధం లేదని బుకాయించడంతో విడిచి పెట్టేశారు. ఆ తర్వాత సంధ్యా ఆక్వా సంస్థ విశాఖకు చెందిన కార్యాలయంతో పాటు కాకినాడ జిల్లా మూలపేట, వజ్రకూటంలలో ఉన్న ఆ సంస్థలోనూ సోదాలు నిర్వహించారు. కాగా బ్రెజిల్ నుంచి డ్రగ్స్ను మోసుకొచ్చిన కంటెయినర్ను ఇప్పటికీ విశాఖ వీసీటీపీఎల్లోనే ఉంచారు.

అంతగా గప్చుప్..

ఈ డ్రగ్స్ కంటెయినర్ సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందే విశాఖకు చేరింది. అప్పటికి ఎన్నికల వేడి ఊపందుకుంది. డ్రగ్స్ వచ్చిన కంటెయినర్ చిరునామా ఉన్న సంధ్యా ఆక్వా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులకు చెందినదన్న వార్తలతో రాజకీయ రగడ తీవ్రతరమైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ దీనిపై ఆరోపణలు గుప్పించింది. అయితే ఆ డ్రగ్స్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని పురందేశ్వరి అప్పట్లో స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ నేతలకూ సంబంధం ఉందంటూ కూటమి నేతలు ఎదురు దాడికి దిగారు. ఇలా ఎన్నికల సమయం కావడంతో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు 'డ్రగ్స్' బురద జల్లుకున్నారు. ఎన్నికలు ముగియడం, రాష్ట్రంలో అధికారం మారడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచిత్రంగా ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల నేతలెవరూ ఈ భారీ డ్రగ్స్ కుంభకోణంపై నోరు మెదపడం లేదు. సీబీఐపైనా ఒత్తిడి తీసుకురావడం లేదు. సీబీఐపై రాజకీయ ఒత్తిళ్ల వల్లే దర్యాప్తు ముందుకు సాగడం లేదన్న ప్రచారంతో విశాఖ కంటెయినర్ డ్రగ్స్ కేసు కథ కంచికి చేరినట్టేనన్న వాదనలు మరోపక్క వినిపిస్తున్నాయి.

Read More
Next Story