
ముఖ్యమంత్రి నోట మూడు రీజియన్ల మాట, అంతరార్థం ఏమిటి?
జగన్ బాటలోకి చంద్రబాబు !
జగన్ మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రీజియన్ లు అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. మరి జగన్ బాటలోకి చంద్రబాబు వచ్చారా? వైసీపీ ని పూర్తిగా దెబ్బతీయడానికి ఎత్తుకు పైఎత్తు వేశారా? లేక జగన్ ప్రతిపాదించిన మూడు ప్రాంతాల అభివృద్ధి అనేమాటని తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా?
ఇదే చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది.ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నాడు మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదాన్ని వైసీపీ అధినేత జగన్ అందుకున్నప్పుడు చంద్రబాబు తో సహా అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి తో పాటు విశాఖపట్నం, కర్నూలు కేంద్రాలుగా (రాజధానులుగా) అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ జగన్ ప్రజలలోకి వెళ్లారు. అయితే మూడు రాజధానులని ప్రకటించడం జగన్ కొంపముంచింది. అమరావతిని గాలికి వదిలేసి,ముచ్చటగా మూడు రాజధానులన్న ప్రతిపాదనను ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.ఇదేమి పిచ్చి ఆలోచన అంటూ తెలుగుదేశం ,జనసేన , బీజేపీ మిగిలిన పార్టీలు కూడా వైసీపీని,దాని అధినేత జగన్ ను ప్రజలు ముందు దోషిగా నిలబెట్టాయి.
మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ అంటూ జగన్ గానాన్ని అందుకుంటున్నారు. అప్పటి జగన్ వాదన అభాసుపాలు కాగా, ఇప్పుడు చంద్రబాబు మాటలు చెవులకు ఇంపుగా చేరుతున్నాయి. ఇద్దరు చెప్పిందీ అధికార వికేంద్రీకరణ మంత్రమే అయినా, రాజధానితో లింక్ చేయడం అప్పట్లో జగన్ కొంప ముంచింది. మూడు రీజియన్ లు అంటూ చంద్రబాబు ఇప్పుడు జగన్ పాటనే అందుకున్నా, శృతి మార్చారు. ఒకవైపు రాజధాని అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టి, మిగిలిన ప్రాంతాల సత్వర అభివృద్ధి కి ప్రణాళిక అంటూ వినసొంపుగా అదే పాట పాడినా, ఎవరూ తప్పుపట్టడానికి సాహసింసలేకపోయారు.
చంద్రబాబు చేస్తున్నదేంటి?
అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ఒక్కో జోన్‌కు సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం నియమిస్తోంది. ఇక, విశాఖపట్నం జోన్‌కు సీఈవోగా యువరాజ్ , అమరావతి జోన్‌కు సీఈవోగా మీనా.. రాయలసీమ జోన్ కు సీఈవోగా కృష్ణబాబు ను నియమించే అవకాశాలు వున్నాయి .విశాఖ పట్నం, అమరావతి, రాయలసీమ జోన్‌లు ఏర్పాటు అవుతున్నాయి .విశాఖ రీజియన్‌లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్‌లో 9 జిల్లాలు ఉంటాయి. ఇక, నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ వీటి విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
అప్పుడు జగన్ చేసినదేంటి?
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అధికార వికేంద్రీకరణ అంటూ గొప్పలు చెప్పారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులతో అభివృద్ధి అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఉన్న రాజధానిని పుట్టించు కోకుండా, మూడు రాజధానులు ముచ్చట చెప్పడం ఎవరికీ నచ్చలేదు. సరికదా విమర్శల పాలయ్యారు. ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమం , ఉత్తరాంధ్ర,రాయలసీమ నుంచి కానరాని మద్దతు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మూడు ప్రాంతాల అభివృద్ధి దేవుడెరుగు, దోపిడీ కొనసాగుతోందన్న ఆరోపణలు వైసీపీ కొంపముంచాయి. ఆ తరువాత ఎన్నికల్లో 11సీట్లకే పరిమితం అయ్యేలా చేశాయి. అమరావతి నుంచి పట్టించుకోని వైసిపికి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికీ, మా బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారని చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
గతంలోనూ అభివృద్ధి మండళ్లు
గతంలో రాజకీయ పదవులతో అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసేవారు. అయితే వాటికి పవర్స్ ఉండవు. రాజకీయ పునరావాసం కోసం ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు అలా కుండా పూర్తిగా అభివృద్ధి పనుల కోసమే జోన్లను మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న 13 జోన్ల వ్యవస్థను మార్చి, మూడు ప్రధాన జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలనే ప్రతిపాదన ఎన్నికల నుంచే చర్చలో ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మైనిఫెస్టోలో ఈ ఆలోచన ప్రస్తావించారు. ఇప్పుడు అమల్లోకి తెస్తున్నారు.
ప్రతి జోన్ కు ప్రత్యేకమైన లక్ష్యాలు
ఉత్తరాంధ్ర జోన్ లో పోర్టులు, టూరిజం, పరిశ్రమల అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. కోస్తా జోన్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి, వ్యవసాయం, IT హబ్‌లు వంటి అంశాలపై ఫోకస్ పెడతారు. రాయలసీమ జోన్ లో తయారీ రంగం ప్రాజెక్టులు , పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి జోన్‌కు స్వతంత్ర బడ్జెట్, ప్రాజెక్టులు, మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఈవోలు ప్రాజెక్టుల అమలు, మానిటరింగ్, కోఆర్డినేషన్‌కు బాధ్యతలు చేపట్టనున్నారు.
నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన మూడు జోన్లు అభివృద్ధి వికేంద్రీకరణ పై మిశ్రమ స్పందన వస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ మంచి చర్య అంటూ అందరూ స్వాగతిస్తూ నే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి యోచన ఆహ్వానించాల్సిందే కాని నిధులు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. "మూడు జోన్లుగా అభివృద్ధి కొత్త ప్రయత్నం కాదు.. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేశారు.అయితే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తే ఫలితం వుండదు.ముందు మూడు జోన్లకూ నిధులు కేటాయింపు ముఖ్యం నిధులు లేకుండా ఎలాంటి హడావుడి చేసినా ఫలితం శూన్యం " అన్నారు. "ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ అంశమూ కొలిక్కి రాలేదు.ఇలాంటి కొన్ని విషయాలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు చేస్తున్న మరో ప్రయత్నం మూడు జోన్ల ప్రకటన " అని అభిప్రాయ పడ్డారు. ముందు పెండింగ్లో వున్న నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి.రైతులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలని సూచించారు.
నిధులు లేకుండా ఎలాంటి ప్రకటనలు చేసినా ఎన్ని జోన్లు ఏర్పాటు చేసినా ఫలితం వుండదని అన్నారు. అన్నింటిలోనూ ప్రైవేటు భాగస్వామ్యం అంటూ చంద్రబాబు ముందుకెళుతున్నారని, అది సోషల్ జస్టిస్ కు శరాఘాతం గా మారుతుందని పేర్కొంటున్నారు.
నేతి బీరకాయ చందం
చంద్రబాబు ప్రభుత్వం మూడు జోన్ల ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఆ పార్టీ ఎపీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఎంపీ తులసిరెడ్డి ఈ అంశంపై ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడారు.
"నిధులు లేని రీజియన్లు నిరుపయోగం. ప్రచారానికి పనికి వస్తాయి. నేతి బీరకాయ చందం. గ్రామ సచివాలయాలు, గ్రామపంచాయతీలు ,మండల పరిషత్తులు ,జిల్లా పరిషత్తులు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ,కలెక్టర్ కార్యాలయాలు, రాష్ట్ర సచివాలయం ఉండగా ప్రాంతీయ జోన్ల అవసరం ఉండదని నా అభిప్రాయం" అని తులసిరెడ్డి చెప్పారు.అనవసరపు ఖర్చు మాత్రమే. కొందరికి రాజకీయ పునరావాసం గా జోన్ల ఏర్పాటు పనికి వస్తుందన్నారు.
ఇది రాజకీయ ఆర్భాటం.. జగన్ కు కాపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ చేస్తున్న ప్రకటనలు, ఇతర అంశాలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమేనని వైసీపీ నేతలు అంటున్నారు.రాజకీయ ఆర్భాటమని కొట్టి పారేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు ఫెడరల్ తో మాట్లాడుతూ చంద్రబాబు గత వైసీపీ విధానాలనే పేర్లు మార్చి కాపీ కొడుతున్నారన్నారు."ప్రజలను మోసం చేయడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య,హామీలను అమలు చేయలేక, మూడు జోన్లు , అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నాడు. నాడు మా అధినేత కూడా అమరావతి శాసన రాజధాని, విశాఖ వాణిజ్య రాజధాని అన్నారు.ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదీ అదే. విశాఖ లోనే సీఐఐ సదస్సు ఎందుకు పెట్టారు " అని ప్రశ్నించారు. తమ నేత హామీలకు కట్టుబడి వుంటారని, మోసపూరిత హామీలు ఇచ్చివుంటే, తమకే విజయం దక్కేదని బొట్ల రామారావు తెలిపారు.
ఇదే విషయంపై ఏపీ అలోచనా పోరులో వేదిక నాయకులు తుంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ జోన్లు ఏర్పాటు ప్రకటనతోనే ఏమి చెప్పలేమని, దాని కార్యాచరణ పూర్తిగా ప్రకటించాల్సి వుందన్నారు. ఏదైనా ఒకవైపు నిధులు కొరత అంటూ జోన్లు ఏర్పాటు చేసినా ఫలితం వుండదన్నారు.
విపక్షాలు విమర్శలు చేస్తున్నా, మొత్తం మీద జోనల్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు స్థానిక స్థాయిలో మెరుగుపడతాయని, ప్రతి ప్రాంత సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. రాజకీయ జోక్యం ఉండదు. పూర్తిగా అధికారుల స్థాయిలోనే పెట్టుబడులు, ఉపాధితో పాటు అభివృద్ధి పనులను ఈ జోనల్ వ్యవస్థ చూసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి.. సమర్థంగా అమలు చేస్తే.. అద్భుతమైన పాలనా సంస్కరణ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
ఇందులోనూ రాజకీయం జోక్యం పెరిగి జోన్లు రాజకీయ కేంద్రాలుగా మారితే మాత్రం పాత సంగతులే గుర్తుకు వస్తాయి.వైఎస్సార్ హయాం లో కూడా ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసినా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారి విఫలమయిన సంగతిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు
Next Story

