ADANI CASE| అదానీ కేసుకి జగన్ కి లింకేమిటీ? టీడీపీ హడావిడేమిటీ?
x

ADANI CASE| అదానీ కేసుకి జగన్ కి లింకేమిటీ? టీడీపీ హడావిడేమిటీ?

అదానీపై అమెరికాలో నమోదైన కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను తాకింది. వైఎస్ జగన్ సర్కారులో కొందరికి ముడుపులు ముట్టాయన్న అర్థం వచ్చేలా ఆరోపణలు వచ్చాయి


ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీపై అమెరికాలో నమోదైన కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను తాకింది. భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ (Adani group) సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై (Gautam Advani) అమెరికాలో కేసు నమోదైంది. దీనిపై ప్రస్తుతం ఖండన మండనలు వెల్లువెత్తుతున్నాయి. అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా కొందరు వాదనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌-బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేంద్రంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ ఆరోపణల్లో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తావన రావడం గమనార్హం.
అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)తో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అదానీ, ప్రధాని నరేంద్రమోదీ బంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేసింది. దీనికి బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం.. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SECI)కు 12 గిగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేందుకు భారత కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే.. రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ కంపెనీలతో SECI ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోకి వచ్చింది. అయితే, విద్యుత్‌ సరఫరా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి.. రాష్ట్రాల కంపెనీలు కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. దీంతో అదానీ గ్రూప్‌ 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు 265 మిలియన్‌ డాలర్లు ముట్టజెప్పింది. ఆ సమయంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలు కాదని, బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఆరోపణలు చేసే ముందు.. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ఈ లంచాలకు సమాధానం చెప్పాలి’’ అన్నారు బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ.
‘‘అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణల్లో వారు పేర్కొన్న సమయంలో ఒడిశాలో కాంగ్రెస్‌ మిత్రపక్షమైన బీజేడీ, ఆంధ్రప్రదేశ్‌లో YCP పాలనే ఉంది. అలాగే తమిళనాడులోనూ కాంగ్రెస్‌ మద్దతు గల డీఎంకే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. నాడు ఛత్తీస్ గఢ్ లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీకి ఈ నేరారోపణలతో సంబంధం ఎలా ఉంటుంది?’’ అని ప్రశ్నించారు.
భారత్‌లో భారీ సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్‌ అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్‌ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది. బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపించింది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. దీంతో అదానీ సహా పలువురిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
టీడీపీ హడావిడి...
అదానీకి వైసీపీకి ఉన్న సంబంధ బాంధవ్యాలపై టీడీపీ ఆరా తీస్తోంది. మరోపక్క, ఏపీసీసీ.. అదానీ గ్రూపు ఛైర్మన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఆపార్టీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత దశాబ్ద కాలంగా దేశ సంపద అంతా గుజరాత్ కు చెందిన ప్రపంచ కుబేరులు అదానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం దోచిపెడుతోందని ఆరోపించారు. పార్లమెంటు లోపల, బయట కూడా అనేక సందర్భాలలో అదానీ, వారి సంస్థలు చేస్తున్న ఇన్ సైడ్ ట్రేడింగ్ మీద స్పష్టమైన ఆధారాలు ప్రభుత్వానికి, ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు అందజేసినా పట్టించుకోలేదన్నారు. గత ఏడాది ఇచ్చిన హిడెన్ బర్గ్ నివేదికలో భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆధారాలతో ఆరోపణ చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు అమెరికా స్టాక్ ఎక్సేంజ్ లో అదానీ రూ.2110 కోట్ల లంచాల కేసు వెలుగు చూసిందని, తక్షణమే అదానీ మీద ఎఫ్ఎస్ఐఆర్ దాఖలు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెబుతున్న అవినీతి బాగోతాన్నీ, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా విద్యుత్ ఒప్పందాలు కుదిరిన ఏపీ డిస్కం అధికారుల మీద దర్యాప్తుకి ఆదేశించాలని, అందుకు బాధ్యులన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.
మరోపక్క, తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించింది. ఒక్కసారిగా ముడుపుల వ్యవహారం తెరపైకి రావడంతో హడావిడిగా వివరాలు సేకరిస్తోంది. మోదీ ప్రభుత్వంతో చంద్రబాబు ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ భావిస్తోంది.
Read More
Next Story