ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు కక్ష సాధింపులో పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి కాగానే 2014 చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఏకంగా సస్పెండ్ చేసి దాదాపు ఐదేళ్ల కాలం పోస్టింగ్ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేసేలా చేశారు. ఈ వ్యవహారాలను కళ్లారా చూసిన కొందరు ఐపీఎస్‌లు అప్పట్లో సెంట్రల్ సర్వీసులకు వెళ్లగా, మరి కొందరు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు, మరి కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. మరి కొందరిని టీడీపీ ముద్ర ఉందనే కారణంతో ప్రాముఖ్యత లేని శాఖలకు నియమించగా, మరి కొందరిని పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. ఇలా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారులపై కక్ష సాధింపు కొనసాగింది. కొందరి విషయం కళ్లకు కనిపించగా మరి కొందరి విషయం కళ్లకు కనిపించకుండా సాగడం విశేషం.
డీజీ స్థాయిలో ఉన్న ఒక ఐపీఎస్ అధికారిని అందులోను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వంపై ఆయన చేసిన పోరాటం ఫలితంగా రిటైర్మెంట్ చివరి రోజు సర్వీసులోకి తీసుకోక తప్ప లేదు. ఉదయం బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు అదే రోజు సాయంత్రం పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించిన తీరు పలువురిలో విమర్శలకు దారి తీయగా.. అదే పద్ధతిని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అవుతున్నారనే విమర్శలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఐపీఎస్ అధికారులు డాక్టర్ కొల్లు రఘురామిరెడ్డి, పీ సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్, ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, కేవీవీ సత్యనారాయణలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తే వారికి అప్పాయింట్‌మెంట్ దొరక లేదు. సార్ బిజీగా ఉన్నారు.. తర్వాత కలిసేందుకు అవకాశమిస్తారని చెప్పి సెక్యురిటీ సిబ్బంది వెనక్కు పంపించారు.
చంద్రబాబు ఎన్నికల్లో గెలవగానే నిఘా విభాగం చీఫ్‌గా ఉన్న పీ సీతారామాంజనేయులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ కొల్లు రఘురామిరెడ్డి సీఎం చంద్రబాబును ఇంటి వద్ద కలవడానికి వెళ్తే అప్పాయింట్‌మెంట్ ఇవ్వ లేదు. దీంతో వీరి ఇరువురు అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లి పోయారు.
గురువారం ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబును కలిసేందుకు పీ సీతారామాంజనేయులతో పాటు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌లు ప్రయత్నించారు. అయినా వారికి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ లేదు. మిగిలిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లు శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సత్యనారాయణ పరిస్థితి కూడా అదే.
ఇది దేనికి సంకేతం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి చెప్పినట్లు పని చేయాల్సిందే. ఆ పనులు కూడా నిబంధనలకు లోబడి ఉండాలి. అలా కాకుండా నిబంధనలను అతిక్రమించి పాలకుల ఇష్టానుసారం చెప్పినవన్నీ చేశారంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. పాలకులే వారి చేత తప్పులు చేయించి తిరిగి వారిపైనే కేసులు పెట్టడం, కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వంటి సంఘటనలు ప్రస్తుత రాజకీయాల్లో పరిపాటిగా మారాయి. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్ ఉక్కు పాదం మోపినా.. ఆయన ఉవ్వెత్తున పైకి లేచారే తప్ప కింద పడి పోలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కక్ష సాధింపులు మాని.. వారి చేత సక్రమమైన మార్గాల్లో పని చేయించుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందనే అభిప్రాయం, అటు అధికార వర్గాలు, ఇటు మేధావుల్లో వ్యక్తం అవుతోంది.