
చిరంజీవిని ఎద్దేవా చేసిన బాలయ్యపై పవన్ రియాక్షన్ ఏమిటీ?
జనసేనను టార్గెట్ చేసిన టీడీపీ..నిన్న బోండా ఉమా, ఈవేళ బాలయ్య..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవికి జరిగిన అవమానంపై రాష్ట్రంలో సుడులు తిప్పుతోంది. చిరంజీవి అభిమానులు బాలయ్యపై కస్సుబుస్సు మంటుండగా చేతిలో చెయ్యేసి తిరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏమి చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి అంత సీన్ లేదంటూ మాట్లాడిన హిందూపూర్ శాసనసభ్యుడు, సినీనటుడు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిదితో పాటు వియ్యంకుడు కూడా. ఇక అటు చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి అన్న. రాజకీయ తొలిగురువు.
ఈ జగత్తులో తనకు అన్నను మించింది లేదని పదేపదే చెప్పే పవన్ కల్యాణ్ గతంలో తన సోదరుడు చిరంజీవితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నమస్కారం పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా తన రాజకీయ భాగస్వామి చంద్రబాబు బావమరిది, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు పిల్లనిచ్చిన మేనమామ బాలకృష్ణ చేతిలో ఘోర అవమానానికి గురయ్యారు.
అసలింతకీ ఏమి జరిగిందంటే..
జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే.. చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలను బాలయ్య ఖండించారు.
జగన్ ని 'సైకో' అన్న బాలయ్య...
ఆ 'సైకో'ని (YS Jagan) కలిసేందుకు వెళ్లిన చిరంజీవికి అవమానం జరిగిందన్న మాట నిజమే అయినా ఆయన (చిరంజీవి) గట్టిగా నిలదీసిన తర్వాతే జగన్ దిగివచ్చి కలిశారన్నది అబద్ధమన్నారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలోనే బాలయ్య మాటలకు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న చిరంజీవి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
'సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ నా పేరు ప్రస్తావన తీసుకువచ్చారు. బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశానంటూ' మొదలైన ప్రకటన సుదీర్ఘంగా సాగింది.
చిరంజీవి ఏమన్నారంటే...
'రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడాను.
టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నినాని నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ ని వెళ్లి బాలకృష్ణ ని కలవమని చెప్పాను.
ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తితో సహా మరి కొంతమందిమి వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను' అని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పుడేం చేస్తారు?
'మా అన్నతో నమస్కారం పెట్టించారు' అంటూ బాధపడిన పవన్ కల్యాణ్ కి ఇప్పుడు బాలయ్య ఇచ్చిన షాక్ గట్టిదనే చెప్పాలి. చిరంజీవిని చాలా హేళనగా, ఎకసెకంగా మాట్లాడిన బాలయ్య వ్యాఖ్యలపై చిరు అభిమానులు కస్సుబుస్సుమంటున్నారు. ఇన్ని రోజులు రాజకీయాలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ ఏమి చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్‌పై పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా అనేక విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవి పరువు తీసిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
బాలకృష్ణ–చిరంజీవి వివాదం రాజకీయంగా అటు చంద్రబాబు, పవన్ కి పెద్దనష్టమే జరిగేటట్టుంది. ఇకపై పవన్ కల్యాణ్ “మా అన్నను అవమానించారు, మా అన్న ఎంతో గొప్పోడు, జగన్ అవమానించాడు” అనే పరిస్థితి లేదు కనుక బాలకృష్ణతో రాజీ చేసుకుంటారా లేక చంద్రబాబును రంగంలోకి దించి క్షమాపణ చెప్పిస్తారో చూడాలి.
పైగా జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh)పైనా బాలకృష్ణ ఫైర్ అయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని టీడీపీ సభ్యులు జనసేనను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. మొన్న ఇదే అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నేరుగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తే ఇవాళ చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య చిరంజీవిని, జనసేన మంత్రిని టార్గెట్ చేసి జనసేన అధినేత పవన్ ను ఇరుకునపెట్టేశారు. ఈ పరిణామం ఏవైపుకు దారితీస్తుందో ఆసక్తికరంగా మారింది.
Next Story