జనసేన అధినేత, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అక్టోబర్ 3న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రకటించిన వారాహి డిక్లరేషన్ లో ప్రతిపాదించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. బీజేపీ అనుబంధ సంస్థలు సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ కి దగ్గరగా ఈ ప్రతిపాదన ఉంది. ఇప్పుడు వారికి మరో గొంతుక తోడైంది. ఇప్పటికే అస్సాంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన హిమాంత బిస్వా శర్మ సనాతన ధర్మ పరిరక్షణంటూ గళం విప్పారు. బీజేపీ రాష్ట్రాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్నానని ప్రకటించి దేశవ్యాప్త ప్రచారం మొదలు పెట్టారు. తాజాగా పవన్ కల్యాణ్ అదే కాషాయ వేషధారణతో సింహ గర్జన చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ, దేశమంతా అమలయ్యేలా బలమైన చట్టం తేవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి దానికి నిధులు కేంద్రాన్ని కోరుతున్నారు. దేవుడి నైవేద్యాలు, ప్రసాదాల్లో వాడే వస్తువుల స్వచ్ఛతను పరీక్షించాలన్నారు. తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ విడుదల చేశారు.
బీజేపీ తరహా మితవాద రాజకీయాలతో గానీ ఆ పార్టీకి సిద్ధాంతపునాదిగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో గానీ ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలు అర్పిస్తానన్న పవన్ కల్యాణ్ సరిగ్గా పదేళ్ల కిందట తన ఆదర్శం క్యూబన్ విప్లవకారుడు చేగువేరా అని తాను పఠించేది మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానమని ప్రకటించి గర్జించి గాండ్రించారు. మనిషిలో మార్పు సహజం. అయితే అది ఏ దిశగా ఏవైపు అన్నది ప్రధానం.
పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే ఒకప్పటి మహారాష్ట్ర టైగర్ బాల్ ఠాక్రే గుర్తుకొస్తున్నారని సామాజిక విశ్లేషకుడు వి.బాలశౌరి అన్నారు. ఆయన కూడా కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షమాల వేసి నుదుట బొట్టుపెట్టి బయటికొచ్చేవారు. హిందువులకు ఏమైనా జరిగిందో తస్మాస్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేసేవారు. తన వద్దకు వచ్చిన పంచాయితీలను పరిష్కరించేవారు. తన మాట వినకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు తన బాధ్యత లేదనే వారు. అందుకు తగ్గట్టే హిందువులు భగ్గుమనే వారు. ఆ తర్వాత బాల్ ఠాక్రే వృద్ధ సింహమైన తర్వాత వేషం మారింది. తెల్లటి దవళవస్త్రాలతో భుజం మీద కాషాయ కండువా, మెడలో రుద్రాక్ష మాలతో కన్పించేవారు. బొట్టు ఎలాగూ ఉండనే ఉంటుంది. ఆయన పార్టీ శివసేన. హిందూ మతమే ఆయుధంగా బతికి ఆ పార్టీతో బీజేపీ అనుబంధం పెరిగిన తర్వాత ఆకస్మాత్తుగా ఓ దుర్మూహుర్తాన రెండుగా చీలింది. ఇప్పుడు ఒక వర్గానికి బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, మరో వర్గానికి బాల్ ఠాక్రే శిష్యుడు ఏక్ నాథ్ శింధే నాయకత్వం వహిస్తున్నారు. బాల్ ఠాక్రే కుమారుడు ఇప్పుడు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
బీజేపీ నీడ పడితే ఏమవుతుందీ?
ఒకప్పుడు ఇందిరా గాంధీ 20 అంశాల కార్యక్రమాన్ని మెచ్చి సీపీఐ ఆ పార్టీతో జత కడితే ఆ తర్వాతి ఎన్నికల నాటికి సీపీఐ క్యాడర్ సగానికి తగ్గింది. ఇప్పుడా లోటును బీజేపీ తీర్చుతోందన్నది సీపీఐ రాష్ట్ర నాయకుడొకరు చెప్పారు. బీజేపీ నీడ పడిన ఏ పార్టీ కూడా ఆ తర్వాత కనీసం రెండు ముక్కలైనా అయింది.
తమిళనాడులో జయలలిత పార్టీ అన్నా డీఎంకే మొదలు త్రిపురలో సీపీఎం వరకు- ఏదీ మినహాయింపు కాదన్నది నిజం. ఇక, జార్ఖండ్. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఓ ప్రాంతీయ పార్టీ. శిభూ సోరెన్ నాయకుడు. ఆయన కుటుంబం ఇప్పుడు రెండుగా చీలింది. తమిళనాడులో అన్నా డీఎంకే రెండు ముక్కలైంది. ఎంతో పకడ్బందీగా ఉందనుకునే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తాకిడితో అల్లల్లాడుతున్న విషయం తెలిసిందే. త్రిపురలోనైతే ఏకంగా సీపీఎం రాష్ట్ర యూనిట్టే కనుమరుగైంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సీనియర్ నేతగా ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాల నాయకుడు గులాంనబీ అజాద్ పైన కూడా బీజేపీ ప్రభావం పడిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
2014 నుంచి బీజేపీతో సత్ సంబంధాలున్న పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడగలరు. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి సయోధ్య కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. బీజేపీకి మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్డీఏ సమావేశంలో నరేంద్ర మోదీ పక్కన చంద్రబాబుకు దక్కాల్సిన సీటు పవన్ కల్యాణ్ కి దక్కింది.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయ్యాక పవన్ కల్యాణ్ అభినవ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారిపోయారన్న టాక్ ఉంది. ఆర్ఎస్ఎస్ నేతలకు మించి పవన్ కల్యాణ్ హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలై వారాహి డిక్లరేషన్ నాటికి తారా స్థాయికి చేరింది. తన పదవి పోయినా, తన ప్రాణం పోయినా లెక్కచేయనని, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ నిజమైన హిందూగా పోరాడతానంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయింది. ఇంతకాలం హిందూఇజానికి లేని ముప్పు ఇప్పుడేమి వచ్చిందని ఒకనాటి ఆయన మిత్రపక్ష వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ చెప్పిందేమిటంటే...
భారతదేశం భిన్న జాతులు, మతాల సంగమం. స్వతంత్ర భారతదేశపు స్వభావాన్ని ఆయా ప్రజలు పాటించే మత విశ్వాసం ఆధారంగా నిర్ధారించాలన్నది 1940లలో తెరపైకి వచ్చిన వాదాలలో ఒకటి. ఆ తర్వాత అది రెండయింది. ఇస్లామిక్ రాజ్యం నినాదాన్ని ముస్లిం లీగ్ ముందుకు తీసుకువస్తే మెజారిటీ మత రాజ్యభావనను అంటే హైందవ వాద రాజ్యం- భావనలో ఆరెస్సెస్ ముందుకు తెచ్చింది.
దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చే క్రమంలో బ్రిటీష్ పాలకులు అఖండ భారత్ ను రెండుగా చీల్చారు. ముస్లిం లీగ్ ఆకాంక్ష నెరవేరింది. నాటి గాయాలు నేటికీ మానలేదు. కానీ భారతదేశాన్ని హైందవ దేశంగా మార్చాలన్న ఆరెస్సెస్ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఈ మతవాద శక్తులు తమ ప్రయత్నం ఆపలేదు. మహాత్మా గాంధీని ఓ కరుడుకట్టిన హైందవ ఉన్మాది కాల్చి చంపటం కూడా ఇందులో భాగమే.
ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయత లేదా హైందవ లేదా సనాతన ధర్మమనే భావనకు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన నిర్వచనం హిందూ రాష్ట్ర ఏర్పాటు.
"విదేశీ శక్తుల దురాక్రమణకు ముందు దాదాపు 8 వేల ఏళ్లు ఈ ప్రాంతంపై హిందువుల ఆధిపత్యం కొనసాగింది. అందువల్లనే ఈ భూమి హిందువులది. దేశం హిందూ దేశం" అని ఆరెస్సెస్ అధినేత చెబుతున్నారు. ఈ దేశాన్ని తిరిగి మెజారిటీ ప్రజల మతాధిపత్య రాజ్యంగా మార్చాలంటున్నారు. 1939లో ఎంఎస్ గోల్వాల్కర్ "మనము, మన జాతీయత నిర్వచనం" అనే పుస్తకంలో నిర్వచించారు.
పవన్ కల్యాణ్ నోటి వెంట ఆర్ఎస్ఎస్ మాటలు..
సరిగ్గా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా దాదాపు అవే మాటలు మాట్లాడారు. సనాతన ధర్మం పేరిట ఆయన- హైందవ ఉన్మాదులు చేసే ప్రేలాపనలు- చేశారు. హైందవ ధర్మానికి అన్యాయం జరిగితే ఎంత దాకానైనా తెగించి పోరాడతానన్నారు. లౌకికవాదమంటే ఏకపక్షం కాదన్నారు. హిందువులపై దాడులు జరిగితే చూస్తూ ఉరూకుంటానా అని ఊగిపోయారు. హిందూజాతిని, దేశాన్ని కీర్తించే వాళ్లే దేశభక్తులనీ, తమ లక్ష్య సాధన కోసం కార్యాచరణలోకి దిగుతాననే అర్థం వచ్చేలా మాట్లాడారు.
నెహ్రూ, గాంధీ, టాగోర్ ఏమన్నారంటే...
'డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో జవహర్లాల్ నెహ్రూ "భారతదేశం విభిన్న పొరల సమూహం. ఒక్కోపొరపై ఒక్కో ఆలోచనా స్రవంతి ఉంది. ఎన్ని పొరలున్నా ఏ ఒక్క పొరా దానికి ముందున్న పొరను తుడిచిపెట్టలేదు" అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకో అడుగుముందుకేసి "ఆర్యులు, అనార్యులు, ద్రావిడులు,చైనీయులు, సింథియన్లు,హూణులు, పఠానులు, మొఘలులు అందరూ ఈ నేలలో ఇంకిపోయి ఏకాత్మతను సంతరించుకున్నారు. ఆ ఏకాత్మతే భారతీయత” అన్నారు.
మహాత్మాగాంధీ లెక్కలో 'భారతీయత అంటే దేశంలో ఉన్న అందరినీ తనలో ఇముడ్చుకునే సమీకృత జాతీయత' దీన్నుంచి వైదొలగటమే లక్ష్యంగా ఇప్పుడు దేశంలో ఓ వర్గం మైనారిటీలపై దాడులు చేస్తోంది. సమీకృత భారతీయత అనే భావన నుంచి హిందూ రాష్ట్ర నిర్మాణం దిశగా, ఇతర మతస్తులను దూరం పెట్టేలా హిందూ మతాన్నీ, సనాతన బూచీని చూపిస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు వంతపాడడమేమిటని పలువురు నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ తీరు సరికాదని సీపీఐ నాయకుడు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ బీజేపీ ట్రాప్ లో పడ్డారా..
'పవన్ కల్యాణ్ బీజేపీ ట్రాప్ లో పడి హిందూ ధర్మం, హైందవ ధర్మం, సనాతన ధర్మమంటూ తెంపరితనానికి దిగితే మొదట నష్టపోయేది ఆయనే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ఆయన్ను బయటకు తీసుకువచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఎందుకూ కొరగాకుండా చేస్తుంది. సనాతన ధర్మమే ఆయన లక్ష్యమైతే పార్టీని వదిలేసి ఏదైనా పీఠం పెట్టుకుంటే మంచిదని' పేరు రాయడానికి ఇష్టపడని ఓ విశ్లేషకుడు అన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న సూచనలన్నీ దాదాపు అదే విధంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను బీజేపీ చీల్చి చెండాడుతోంది. తన అవసరం గడిచాక ఆపార్టీలను గడ్డిపోచల కన్నా చులకన చేస్తుందన్నది నడుస్తున్న చరిత్రగా ఆయన అభివర్ణించారు.
ఇవన్నీ ఎలా ఉన్నా ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా నడిచే ఆర్గనైజర్ పత్రిక పవన్ కల్యాణ్ స్పీచ్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పూర్తి పాఠాన్ని ప్రకటించడం గమనార్హం.