ఏపీలో ఎబిసిడిలు ఏమవుతాయో?
x

ఏపీలో ఎబిసిడిలు ఏమవుతాయో?

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన వారు, పరిపాలించే వారు ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. విద్యార్థులు మాత్రం సందిగ్ధంలో పడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్‌ విద్య కాలువపై వేసిన మొద్దులా తయారైంది. కాలువ దాటాలంటే మొద్దుపై నుంచి ఎవరైనా నడవాల్సిందే. కాలు సక్రమంగా వేస్తే పరవాలేదు. కానీ అటో ఇటో జరిగిందంటే మొద్దుపై నుంచి పడిపోవాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలులో ఉన్న ఇంగ్లీష్‌ విద్యావిధానం పరిస్థితి కూడా అలాగే ఉంది.

2014లో అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్‌ విద్యావిధానం ఎంతో అవసరమని చెప్పారు. ఆ మేరకు ఆయన కూడా ఇంగ్లీష్‌ విద్యను దశల వారీగా ప్రవేశపెడితే బాగుంటుందనే ఆలోచనతో ఒకటవ తరగతి నుంచి నాలుగో తరగతి వరకు ప్రవేశపెట్టారు. ఒక్కో ఏడాది ఒక్క తరగతిని ఇంగ్లీష్‌ మీడియంలోకి మారుస్తూ నాలుగో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చారు. ఆ తరువాత ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం జరిగాయి. వైఎస్‌ జగన్‌కు అధికారులు గతంలో తీసుకున్న నిర్ణయం మధ్యలో ఆగిపోయిన విషయాన్ని చెప్పారు. ఇంగ్లీష్‌ విద్యా విధానం ద్వారా పేదరికంలో ఉన్న వారు కూడా మంచి విద్యావంతులుగా అవడమే కాకుండా విదేశీయులతో పోటీ పడే అవకాశం ఉందని ఐఏఎస్‌లు సూచించారు. వారి మాటలను ఆలకించిన జగన్‌ ఇంగ్లీష్‌ మీడియంపై దృష్టి పెట్టారు. ఐదేళ్లలో పదో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లుగా మార్చారు.
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తూ ఇంగ్లీష్‌ మీడియం ఎత్తేస్తామని, లేదంటే తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలు ఉంటాయని, ఏ మీడియం కావాల్సిన వారు ఆ మీడియంలో చదువుకోవచ్చని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలైంది. మొదటి సెమిష్టర్‌ కూడా ముగిసింది. రెండో సెమిష్టర్‌ ప్రారంభం అవుతోంది. విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ మాత్రం ఇంగ్లీష్‌ విద్యపై పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన తండ్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అక్కడక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. ఇంగ్లీష్‌ విద్య ఆంధ్రులకు పెద్దగా అవసరం లేదని, మాతృభాషలో చదువుకున్నప్పుడు తప్పకుండా మంచి విజ్ఞనం ఉంటుందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
తల్లిదండ్రుల్లో తొలగని భయం
ఆంధ్రప్రదేలో ఇంగ్లీష్‌ విద్యా విధానం కొనసాగుతుందా? లేక తెలుగు మీడియంలో విద్యా బోధన ఉంటుందా? అనే సందిగ్ధం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది. ఎందుకంటే ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏ క్షణంలోనైనా ఇంగ్లీష్‌ విద్యను ఎత్తివేసి తెలుగు మీడియంలోనే బోధించే అవకాశం ఉంది. ఒకే సంవత్సరంలో ఆరు నెలలు ఇంగ్లీష్, ఆరు నెలలు తెలుగు చదివి, చివరకు తెలుగులో పరీక్షలు రాయాలంటే పిల్లలు ఇబ్బందులు పడతారనే ఆవేదన తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతోంది.
సీబీఎస్సీ స్కూల్స్‌ ఉంటాయా..
ప్రతి మండలానికి రెండు నుంచి మూడు సీబీఎస్‌సీ సిలబస్‌తో రన్‌ అవుతున్న స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో పదో తరగతిలో అడ్మిషన్‌ ఇచ్చేందుకు సుమారు 80వేల మంది తొమ్మిదో తరగతి విద్యార్థులతో ఆన్‌లైన్‌ పరీక్షలు రాయించారు. ఈ పరీక్షల్లో పది శాతం కూడా పాస్‌ కాలేదని సమాచారం. అయితే తమ్మిదో తరగతి చదివే వారు పదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనతో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పరీక్షలు రాయిచింది. అయితే ఎక్కువ మంది క్వాలిఫై కాలేదనే ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం సీబీఎస్సీ సిలబస్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర సిలబస్‌ కొనసాగుతుందని ప్రకటించింది. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పటి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌సీ సిలబస్‌ చదువుతున్న వారు ఒక్క సారిగా స్టేట్‌ సిలబస్‌కు మారటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ది పేరంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నరహరి శిఖరం, కార్యదర్శి జి ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా విధానాన్ని కొనసాగిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వెలుబుచ్చారు. ఏ విధమైన మార్పులు చేయాలన్నా అకడమిక్‌ ఇయర్‌లోనే చేయడం మంచిదని వారు సలహా ఇచ్చారు. యూనిర్సిటీలు, కాలేజీల్లో పేర్లు మార్చడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు చెబుతున్నారు. ఉదాహరణకు విజయవాడలోని ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీని పేరును మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చారు. ఒకే విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులకు ఒక సర్టిఫికెట్లో ఒక యూనివర్సిటీ పేరు ఉంటే చదువు పూరై్తన తరువాత తీసుకునే సర్టిఫికెట్‌పై మరో పేరు ఉండటాన్ని పరిశీలిస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది. రెండు యూనిర్సీటీలు ఎందుకు మారావని ప్రశ్నిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న వారికి మాత్రం తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఏ విధంగా తెలుస్తుందని తల్లిదండులు అంటున్నారంటే అందుకు పాలకులకులనే తప్పు పట్టాల్సి ఉంది.
ఇంతకూ తెలుగు మీడియంలో పాఠశాలలు ఉంటాయా? ఇంగ్లీష్‌ మీడియంలోనే కొనసాగుతాయా? అనే సందేహాలు తల్లిదండ్రులు, విద్యార్థులను వీడలేదు. ఇంగ్లీష్‌ విద్య కొనసాగింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Read More
Next Story