డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అంటే ఏమిటి ? కవిత ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు ?
x

డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అంటే ఏమిటి ? కవిత ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు ?

కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిఫాల్డ్ బెయిల్ పిటీషన్ ముడిపడేటప్పటికి చాలామందిలో డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అంటే ఏమిటనే ఆసక్తి పెరిగిపోయింది.


ఈరోజు ఢిల్లీ వార్తల్లో ‘డిఫాల్ట్ బెయిల్ పిటీషన్’ అనే పదం బాగా ప్రముఖంగా వినిపించింది. అందులోను కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిఫాల్డ్ బెయిల్ పిటీషన్ ముడిపడేటప్పటికి చాలామందిలో డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అంటే ఏమిటనే ఆసక్తి పెరిగిపోయింది. చాలామందికి తెలిసింది బెయిల్ పిటీషన్ మాత్రమే. అలాంటిది డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అనేటప్పటికి ఆసక్తి పెరిగింది. ఇంతకీ డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అంటే ఏమిటంటే దర్యాప్తును సాగదీస్తు తనకు బెయిల్ రాకుండా దర్యాప్తుసంస్ధలు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నాయని నిందితుడు అనుమానించినపుడు డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అనే సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

లిక్కర్ స్కామ్ లో మార్చి 15వ తేదీన అరెస్టయిన కవిత తీహార్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ కావాలని కవిత ఇప్పటికే సుమారు 10 సార్లు పిటీషన్లు వేశారు. అయితే ప్రతి పిటీషన్ను రౌస్ అవెన్యు కోర్టు, సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం కొట్టేశాయి. అనారోగ్యమని, కొడుకు పరీక్షలని, ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాలో బీఆర్ఎస్ కు ప్రచారం చేయాలని ఇలా రకరకాల కారణాలతో కవిత వేసిన ఏ బెయిల్ పిటీషన్ను కూడా కోర్టులు అంగీకరించలేదు. దాంతో గడచిన నాలుగున్నర నెలలుగా కవిత తీహార్ జైల్లోను గడుపుతున్నారు. ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా కనబడటంలేదు.

దీనికి కారణం ఏమిటంటే కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసులో సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ వాదిస్తున్నాయి. సాక్ష్యులను ప్రభావితం చేయగలదు అనేందుకు కవిత బ్యాక్ గ్రౌండ్ ను కూడా దర్యాప్తు సంస్ధలు కోర్టులకు చూపించాయి. దర్యాప్తు సంస్ధల వాదనలను అంగీకరించిన కోర్టులు కవితకు బెయిల్ నిరాకరిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సడెన్ గా కవిత సోమవారం డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు అనేటప్పటికి చాలామందికి ఆశ్చర్యమేసింది. ముందే చెప్పుకున్నట్లు చాలామంది బెయిల్ పిటీషన్ గురించి వినుంటారు కాని డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ గురించి వినుండరు. దీనిగురించి ‘తెలంగాణా ఫెడరల్’ తో తిరుపతిలో లాయర్ తోట రమేష్ తో మాట్లాడుతు ‘డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అనే సౌకర్యం ఉంద’ని చెప్పారు. ‘డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ అనే సౌకర్యాన్ని ఉపయోగంచుకోవాల్సిన అవసరం చాలావరకు రాద’న్నారు. ‘ఏ కేసులో తీసుకున్నా నాలుగు లేదా ఐదు విచారణల తర్వాత నిందితుడు బెయిల్ పిటీషన్ అప్లై చేసుకుంటే జడ్జీలు బెయిల్ మంజూరు చేస్తార’ని చెప్పారు.

ఇపుడు కవిత ‘లిక్కర్ స్కామ్ దేశంలోనే సంచలనమైంది కాబట్టి, పైగా సాక్ష్యులను ప్రభావితం చేసే విషయంలో దర్యాప్తు సంస్ధలు కవిత బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించటంతో ఆమెకు బెయిల్ ఇవ్వటానికి జడ్జీలు కూడా వెనకాడుతున్న’ట్లు అభిప్రాయపడ్డారు. ‘దర్యాప్తు సంస్ధలు తనకు బెయిల్ రానీయకుండా దర్యాప్తును కావాలనే జాప్యం చేస్తున్నట్లు అనుమానించిన కవిత డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ను దాఖలు చేసుకున్న’ట్లు రమేష్ అభిప్రాయపడ్డారు. బెయిల్ పిటీషన్లు ఫెయిలయ్యాయి కాబట్టి చివరి అస్త్రంగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ను దాఖలు చేసినట్లు అనుమానించారు. ఈ విషయం ఇలాగుంటే డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ను దాఖలుచేసిన కవిత లాయర్లు మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకున్నారనేది అర్ధం కావటంలేదు.

డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ దాఖలుచేసిన కవిత తరపున లాయర్ విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో కేసును విచారిస్తున్న జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తంచేశారు. డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ దాఖలుచేసిన లాయర్ విచారణకు హాజరుకాకపోతే ఎలాగంటు మండిపడ్డారు. అందుకనే కేసును మంగళవారానికి వాయిదా వేసినట్లు సోమవారం జడ్జి చెప్పారు. మంగళవారం కూడా విచారణకు రాకపోతే డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ను డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు. దాంతో ఏమైందో ఏమో విచారణ మొదలుకాకముందే మంగళవారం డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ను కవిత విత్ డ్రా చేసుకున్నారు. మంగళవారం కూడా తమ లాయర్ విచారణకు హాజరుకాకపోతే పిటీషన్ను డిస్మిస్ చేసేస్తే అప్పుడు మరికొంతకాలం వరకు డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ కూడా మళ్ళీ దాఖలు చేసేందుకు లేదు. బహుశా బెయిల్ తెచ్చుకునేందుకు ఉన్న చివరి దారి కూడా మూసుకుపోతుందేమో అన్న అనుమానంతోనే కవిత తనంతట తానుగానే డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ ఉపసంహరించుకున్నట్లున్నారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో మూడు రకాల బెయిల్ సౌకర్యాలున్నాయి. సెక్షన్ 438 ప్రకారం ముందస్తు బెయిల్, సెక్షన్ 439 ప్రకారం రెగ్యులర్ బెయిల్. సెక్షన్ 167(2) ప్రకారం డిఫాల్ట్/స్టాట్యుటరీ బెయిల్. దర్యాప్తుసంస్ధలు లేదా పోలీసులు నిర్ణీత గడువులోగా ఛార్జిషీటు దాఖలు చేయకపోయినా, దర్యాప్తును పూర్తిచేయలేకపోయినా నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయటానికి అవకాశముంది. పై రెండు కారణాలతోనే కవిత ఇపుడు డిపాల్ట్ బెయిల్ పిటీషన్ను దాఖలు చేసుకున్నారు. దాఖలు చేసుకోవటం వరకు ఓకేనే మరుసటి రోజే దాన్ని విత్ డ్రా చేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story