మూడు రాష్ట్ర ఆఫీస్ ల సీజ్ వెనుక ఏముంది?
x

మూడు రాష్ట్ర ఆఫీస్ ల సీజ్ వెనుక ఏముంది?

రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే మూడు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సీల్‌ వేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అవినీతి పెచ్చు మీరిందని, మూడు కేసుల్లో చంద్రబాబునాయుడును నిందితునిగా పేర్కొంటూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏకంగా అరెస్ట్‌ కూడా చేశారని, ఇవన్నీ ఉద్దేశ్య పూర్వకంగా చేసినవేనంటూ నూతన ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు ప్రభుత్వ కార్యాలయాలకు (హెచ్‌వోడీలు) సీల్‌ వేశారు. ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించలేదు. ఈ లోగానే పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఎవరైతే గత ప్రభుత్వానికి నమ్మిన బంట్లుగా పనిచేశారని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నదో అటువంటి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌కు పంపించారు. ఐపీఎస్‌లు డీజీపీ ఆఫీసులోనూ, ఐఏఎస్‌లు సాధారణ పరిపాలన శాఖలోనూ రిపోర్టు చేయాలని నూతన ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలన్నీ కేవలం మాటలతో సీఎస్‌ ద్వారా అమలు చేయించారు. గతంలో ఉన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి కూడా సెలవుపై వెళ్లిపోగా ఆయన స్థానంలో నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను నూతన ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే పలు శాఖల అధికారులపై సీఎస్‌ కొరఢా ఝుళిపిస్తున్నారు.

మూడు కార్యాలయాలకు సీల్‌
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ఫైబర్‌నెట్‌ కార్యాలయాన్ని నూతన అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఆఫీసులో ఉన్న కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లు, ఫైల్స్‌ ఎధావిధిగా ఉంచాలని, ఉద్యోగులు కూడా కార్యాలయంలోకి రావద్దని ఆదేశించారు. సాయుధులైన పోలీసులను కాపలా పెట్టారు. ఇప్పటికి ఫైబర్‌నెట్‌ కార్యాలయానికి సీల్‌ వేసి ఐదు రోజులైంది. ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావడం లేదు.
ఏపీ గనుల శాఖ, ఏపీ ఖనిజాభివృద్ది సంస్థల ఎండీగా ఉన్న జివి వెంకటరెడ్డిని శుక్రవారం విధుల నుంచి తప్పించారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ కార్యాలయం, పోరంకిలోని ఏపీఎండీసీ కార్యాలయాలను ప్రభుత్వం సీజ్‌ చేసింది. ఈ కార్యాలయాల్లో ఉన్న ఫైల్స్, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయుధులైన పోలీసులను కార్యాలయాలకు కాపలా పెట్టారు.
ఈ రెండు కార్యాలయాల్లో తీవ్రస్థాయిలో అవినీతి చోటు చేసుకుందని, ఇసుక, బొగ్గు, బీచ్‌ శాండ్, బెరైటీస్‌ వంటి సంపదను దోచుకున్నారని నూతన ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రధాన కారకునిగా గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యవహరించారని అనుమానిస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు ఇష్టానుసారం చేశారని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. గనుల శాఖ ఎండీగా ఉన్న యువరాజ్‌కు ఈ రెండు కార్యాలయాలకు అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గనుల శాఖపై శనివారం సాయంత్రం సుమారు రెండు గంటలపాటు యువరాజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ కొల్లు రఘురామిరెడ్డి నేతృత్వంలోని స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసుపై వేసిన సిట్‌ను నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసి వేసింది. సిట్‌ అధికారిగా ఉన్న రఘురామిరెడ్డి విజిలెన్స్‌ కమిషనర్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయనను డిజిపి కార్యాలయానికి సరెండర్‌ చేసి ఆయన పనితీరుపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
మద్యం అమ్మకాల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ బ్రేవరేజెస్‌ కంపెనీస్‌ మాజీ ఎండీ ఎం మదుసూదన్‌రెడ్డి ఇండ్లపై ఏపీ ఏసీబీ అధికారులు రెండు రోజుల క్రిత దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై వారు దాడులు చేశారు. అయితే మధుసూదన్‌రెడ్డి ఇండ్లలో వారు ఊహించినట్లుగా ఏమీ దొరకలేదని సమాచారం. అగ్నిమాపక శాఖ డిజిగా ఉన్న సునీల్‌ కుమార్‌పై కూడా విచారణ చేపట్టాలనే ఆలోచనలో నూతన ప్రభుత్వం ఉంది. సిఐడీ ఏడీజీగా ఉంటూ ఫిబ్రవరిలో అగ్నిమాపక శాఖకు బదిలీపై వచ్చారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడనే అనుమానంతో ప్రభుత్వం ఆయనపై నిఘా పెట్టింది. కార్యాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లు కదిలించవద్దని ఆదేశాలు సీఎస్‌ నుంచి జారీ అయ్యాయి. ఇలా ప్రతి కార్యాలయంలోనూ జరిగిన అవినీతిపై విచారణ జరపాలనే ఆలోచనలో నూతన ప్రభుత్వం ఉంది.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ప్రభుత్వ కార్యాలయాలకు సీల్‌ వేసి ఉద్యోగులను సైతం విధులకు రావాల్సిన అవసరం లేదని చెప్పడటం ఇదే ప్రధమం. పైగా ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించకముందే ఈ కార్యక్రమాలు జరగుతుండటంతో గత ప్రభుత్వం చేపట్టిన కక్షపూరిత వ్యవహారం ఈ ప్రభుత్వం కూడా చేపడుతోందనే అనుమానాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తూ ఆందోళన వెలుబుచ్చారు.
Read More
Next Story