విమర్శ ఏదైనా సరే.. సోషల్‌ మీడియా కేసే
x

విమర్శ ఏదైనా సరే.. సోషల్‌ మీడియా కేసే

వైఎస్‌ఆర్‌సీపీ నోళ్లు మూయించడానికి కేసులు పెడుతున్నారా? చంద్రబాబును అరెస్టు చేసినందుకు ప్రతీకారంగా కేసులు పెడుతున్నారా?


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీని పోలీసు కేసులు వణికిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం, ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు లెక్కలు వేసి మరీ కేసులు నమోదు చేయిస్తున్నారు. ఏ జిల్లాలో ఎవరు అధికార కూటమి నాయకులను దూషించారు, అవమాన పరిచేలా మాట్లాడారు, కుటుంబాల్లో విచ్చిత్తికి కారణమయ్యారు, మానసికంగా కుటుంబ సభ్యులతో పాటు నాయకులను కూడా వేధించారనే అంశాలను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ కారణాలతో ఎవ్వరి మీద అయితే కేసులు నమోదు అవుతున్నాయో, వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదల కూడదని, ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు నిర్ణయించుకున్నారు. దీంతో పాటు రెడ్‌ బుక్‌ సృష్టి కర్త, మంత్రి నారా లోకేష్‌ తన కుటుంబాన్ని, తన పార్టీని అవమానించి, హేళనగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన ఏ విధమైన ఆలోచనలతో మాట్లాడుతున్నారో, ఆ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రత్యర్థులపై కేసులు నమోదు అవుతున్నాయి.

మరొక విశేషం ఏమిటంటే.. తనను అరెస్టు చేసిన, అందుకు కారకులైన ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కుమార్తెల మనసు నొచ్చుకునేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైన నేరంగా పవన్‌ కళ్యాణ్‌ పరిగణించారు. తన కుమార్తెలు ఆ పోస్టులు చూసి ఇంటికి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడ లేదని, అలాంటి పోస్టులు పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే వ్యాఖ్యలు కూడా చేశారు. అందులో భాగంగానే ఆయన రాష్ట్ర హొం మంత్రి అనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే హోం శాఖ మంత్రిగా ఉండి ఉంటే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా వారిని, బాలబాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని వదిలి పెట్టే వాడ్ని కాదంటూ సహచర మంత్రినే తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో మంటలు పుట్టించాయి. ఆ వెంటనే మంత్రి వర్గ సమావేశం జరగడం, ఆ సమావేశంలో తన ఆవేదనను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వెళ్లగక్కడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.

సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని వైఎస్‌ఆర్‌సీపీ దురాగతాలకు పాల్పడుతోందని, ఎట్టి పరిస్థితుల్లోను ఈ దురాగతాలను అంగీకరించేది లేదని, వరుస కేసులను ప్రభుత్వం నమోదు చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఎవరైతే అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారో.. వారిని వదలకుండా కేసులు పెట్టించేలా టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాన్ని రూపొందించాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోను వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, నియోజక వర్గ ఇన్‌చార్జిలను టార్గెట్‌ చేసి ప్రభుత్వం పోలీసుల ద్వారా కేసులను నమోదు చేయిస్తోంది. ఇందుకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా, ముఖ్య నాయకులుగా ఎవరైతే అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారో అలాంటి వారిపై ప్రస్తుతం టీడీపీ, జనసేన అధినేతలు తమ కార్యకర్తలు, నాయకుల ద్వారా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయిస్తున్నారు. వరదలా ఈ ఉద్యమం కొనసాగుతుండటం విశేషం. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు ముఖ్యమైన నాయకులు, ఆ మాట అనే కంటే కాస్త మనిషి అన్న వ్యక్తితత్వం మరిచి మాట్లాడిన వారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
ప్రధానంగా సినిమా రంగానికి సంబంధించిన డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆర్జీవీ వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ను అవమానించారనే ఆరోపణలతో ప్రకాశం జిల్లా మదిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడులో టీడీపీ నాయకుడు రామలింగం ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. ఈయనపై తుళ్లూరు పీఎస్‌లోను మరో కేసు నమోదైంది. టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు కేసు పెట్టాడు. ఈ కేసుల నేపథ్యంలో ఆర్జీవీకి నోటీసులు అందించారు. ఈ నెల 19వ తేదీ పోలీసు విచారణకు హాజరు కావలసి ఉంటుంది. ఈ కేసులో ఆయన అక్కడిక్కడే అరెస్టు చేయాలా అనేదాన్ని పోలీసులు నిర్ణయిస్తారు. తుళ్లూరులో నమోదైన మరో కేసులోనూ ఇదే రకమైన విచారణ జరిగే అవకాశం ఉంది. వైఎస్‌సీపీ అధికారంలో ఉండగా పోసాని కృష్ణమురళి ఏపీ ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. పార్టీ ఆదేశానుసారంగా కానీ, సొంతంగా కానీ చాలా సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆ సందర్భాల్లో టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లపైన విమర్శలు గుప్పించారు.
విమర్శలు ఎలాంటివనేవి పక్కన పెడితే పవన్‌ కళ్యాణ్‌ను విమర్శలు చేశారనే నేరారోపణలపై పోసానిపై భవానిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 354, 355, 100 వంటి మరి కొన్ని సెక్షన్లు కూడా కలిపి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై గతంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు దారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఇక శ్రీరెడ్డి పై ప్రత్తిపాడు, మాచర్ల, కావలి, రాజంపేట, మునగపాక, టెక్కలి, పాతపట్నం, ఆలూరు, ప్రతికొండ, కోడుమూరు, డోన్, చీరాల, బాపట్ల, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, ఆదోని, విజయవాడ, చిలకలూరిపేట, వంటి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ సతీమణి బ్రాహ్మణిల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందు పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు.
వీరేకాకుండా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ముఖ్య నాయకులను టార్గెట్‌ చేస్తూ కేసులు నమోదవుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్‌పైన ప్రత్యేకంగా కేసులు నమోదు చేశారు. రాజీవ్‌ను అరెస్టు చేయగా జోగి రమేషన్‌ను పోలీసులు విచారణ కోసం స్టేషన్‌కు పిలిపించారు. ముఖ్య నాయకులైన సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, గౌతంరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, విశాఖకు చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పినెపే విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్, కావటి మనోహర్‌ నాయుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి వారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
వీరిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు కొందరైతే, అవినీతికి పాల్పడినట్లు మరి కొందరిపైన కేసులు నమోదు చేశారు. ఇవే కాకుండా గత ఎన్నికల సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వంటి నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదైనా అవి కూడా కూటమి ప్రభుత్వానికి వ్యవహరించిన వారు కావడం వల్ల కేసులను తిరిగి తోడటమే కాకుండా చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభించారు. మాచర్ల విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మానందారెడ్డిపైనా కేసులు తక్కువేమీ కాదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వెంటాడి వేటకొడవళ్లతో నరికి చంపారనే ఆరోపణలపై కేసులు కూడా కోర్టుల్లో ఉన్నాయి. మాచర్ల నియోజక వర్గం ఫ్యాక్షన్‌ రాజకీయాలకు వేదికగా మారింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసుల్లో ఇరుక్కోవడంతో ఆయనపై కూడా ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది.
ఇందులో ఒకరిని పెట్టారని, మరొకరిని వదల్లేదని కాదు. నాపై కేసు పెట్టిన వారితో సహా ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరంటూ జగన్‌ను లక్ష్యంగా చేసుకొని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేటికీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలకు ఒకప్పుడు తమిళనాడు వేదికగా ఉండేది. నేడు ఆ విధమైన రాజకీయాలకు ఏపీ వేదికా మారిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పెట్టే కేసుల పరంపరకు తట్టుకొని వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వం నిలబడుతుందా?.. పరార్‌ అవుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
Read More
Next Story