రెడ్ల మౌనం దేనికి సంకేతం?
x

రెడ్ల మౌనం దేనికి సంకేతం?

2014, 2019 ఎన్నికల్లో ఉన్నంత ఉత్సాహంగా 2024 ఎన్నికల్లో రెడ్లు లేరు. జగన్‌ ప్రభుత్వం వచ్చినా తమకేమీ వరిగిందేమీ లేదనే భావనలో ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కులాల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రధానమైంది. అగ్ర కులమనే తప్ప అనుకున్నంత ఓట్ల బలం వారికి ఈ రాష్ట్రంలో లేదు. అయినా రాజ్యాధికార్ని చేజిక్కునేది ఒక వైపు రెడ్లు, మరో వైపు కమ్మ సామాజిక వర్గాలు. ఈ రాష్ట్రంలో ఈ రెండు కులాలకు మించిన ఓట్లు బలిజ, కాపు, తెలగలకు ఉన్నాయి. వీరు దాదాపు 13 శాతం వరకు ఉన్నారు. అయినా వారిలో చాలా మంది ఈ రెండు సామాజిక వర్గాలకు వందిమాగదులుగా మెదలడం వల్లనే రాజ్యాధికారంలోకి రాలేక పోతున్నారు.

రెడ్లకు చేసిందేమీ లేదు
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఏడు శాతం వరకు రెడ్లు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత బలం చేకూరింది. మా చేతిలో అధికారం ఉందని, మేము చెప్పినట్లు పని చేయాలని అనేక మంది అధికారులు, నాయకులకు రెడ్డీ సామాజిక వర్గంలోని పెద్దలు కొద్ది రోజులు హుకుం జారీ చేశారు. నియోజక వర్గాల్లో పార్టీ బలాన్ని పెంచినా, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో ఎవ్వరినీ ఏమీ పట్టించుకోలేదు. చివరి ఏడాదిలో ఆరు నెలల కాలంగా నియోజక వర్గాల్లో రెడ్లు చెప్పిన మాటకు కొంత వరకు తలూపుతూ వచ్చారు. అది ఏవిషయంలో అంటే అభ్యర్థులు మర్పుల విషయంలోనే అలా జరిగింది. ఉదాహరణకు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గాన్ని పరిశీలిస్తే నాలుగు మండలాల్లో నలుగురు రెడ్లు ఎంపీపీలుగా ఉన్నారు. మరో రెండు మండలాల్లో ఇద్దరు బీసీలు ఎంపీపీలుగా ఉన్నారు. ఈ రెడ్ల ఆధిపత్యం తట్టుకోలేక బీసీ ఎంపీపీలు కూడా వీరికి లొంగిపోయారు. అందరూ కలిసి ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుకు అల్టిమేటం ఇచ్చారు. మేము చెప్పినట్లు చేయాలని ఆదేశించారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాంబాబు అందుకు అంగీకరించ లేదు. మీరు ఎంత పట్టుదలతో ఉంటారో అంతకంటే రెట్టింపు పట్టుదలతో నేను ఉంటానని, నేను చెప్పినట్లు మీరు వినాల్సిందేనని ఆరు మండలాల్లోని ఎంపీపీలకు ఆయన తిరిగి అల్టిమేటం ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని నియోజకంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా ఏకమై ఏకంగా సీఎం జగన్‌ను కలిసారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే రాంబాబుకు టికెట్‌ ఇస్తే మేమంతా పార్టీని వీడి టీడీపీలో చేరుతామని హెచ్చరించారు. దీంతో చేసేదిమీ లేక సీఎం వైఎస్‌ జగన్‌ మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కే నాగార్జునరెడ్డిని గిద్దలూరు అభ్యర్థిగా నియమించి, గిద్దలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం ప్రకటించారు. ఇలాంటి మార్పులు వైఎస్‌ఆర్‌సీపీ వెనకంజ వేయడానికి కారణాలుగా చెప్పొచ్చు. తాత్కాలికంగా గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గం ఆనందంగా ఉండొచ్చేమో కానీ వైఎస్‌ఆర్‌సీపీ ఓటమికి వారి గొయ్యని వారే తీసుకున్నట్లు అయ్యిందనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. ఇలా ప్రతి నియోజక వర్గంలోను ఆధిపత్య సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మెల్యేలకు రాజకీయ బదిలీలు జరిగాయి. అయినా రెడ్డి సామాజిక వర్గం గ్రామీణ నాయకుల్లో అంత ఆనందం లేదు. ముభావంగానే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నా పార్టీ, జగన్‌ గెలవాలనే పట్టుదల నేటి ఎన్నికల్లో కనిపించడం లేదు.
ఆశలపై నీళ్లు చల్లిన జగన్‌
ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన వారంతా ఏదో ఒక రూపంలో ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవలని ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే ద్వారా లేదా మంత్రి ద్వారా నామినేషన్‌ వర్కులు, చిన్నా, పెద్ద కాంట్రాక్టులు తీసుకుంటారు. దాంతో వచ్చే మొత్తంతో వారు ఆనందంగా ఉండటంతో పాటు తిరిగి ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేసేందుకు కొంత మంది ముఖ్య కార్యకర్తలను కూడా తయారు చేస్తారు. ఈ ఐదేళ్ల కాలంలో అలాంటివేమీ జరగ లేదు. పైగా ఎవరైతే చొక్కాలు చించుకుని గత ఎన్నికల్లో మా వాడని జగన్‌ కోసం పని చేశారో అలాంటి వారిని పార్టీ పక్కన పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన కులం వాడని చొక్కాలు చించుకొని రోడ్డున పడటం కంటే ప్రశాంతంగా ప్రచారానికి దూరంగా ఉందామని రెడ్డి సామాజిక వర్గంలోని ప్రధాన నేతలంతా భావించనట్లు చర్చ సాగుతోంది. అందుకే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మా కులపోడికి గతంలో ఉన్న ఆదరణ కంటే ఇప్పుడు రెట్టింపు ఆదరణ వచ్చిందని జగన్‌ గురించి మాట్లాడటానికి కానీ చెప్పడానికి కానీ ఎవ్వరు ముందుకు రావడం లేదు. పైగా ఏ దందాలో చూసినా ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండే నాయకులు తప్ప మరెవ్వరూ కనిపించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మా వాడని జగన్‌ను నెత్తిన పెట్టుకొని జగన్‌ను మోస్తే అబాసుపాలు కావడం తద్యమని, అందుకే ఎటూ మాట్లాడకుండా మన ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసి రావడం మంచిదనే ఆలోచనల్లో ఉన్నారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా
ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలం. వైఎస్‌ఆర్‌పై అభిమానం పెంచుకున్న వారంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. జగన్‌ మనందరినీ ఉద్దరిస్తారనుకున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు ఈ ఐదేళ్లల్లో కుంగిపోయారు. తలెత్తి చూసేందుకు కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. అలాగని తెలుగుదేశం పార్టీకి ఓటేసేందుకు వారి మనసు అంగీకరించడం లేదు. అందుకే ఎంతో కొంత కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు రెడ్లను కాంగ్రెస్‌ వైపు మళ్లించేవిగా ఉన్నాయనే చర్చ కూడా ఆ పార్టీలో సాగుతోంది. వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌పార్టీకి నాయకత్వం వహిస్తున్నందు వల్ల రెడ్లల్లో ఎక్కువ శాతం మంది మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సారి రెడ్ల మనస్సుల్లో ఏముందో, అది ఎవరిపై ప్రభావం చూపుతుందో, అనేది మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
Read More
Next Story