ఈ రెండు మండలాలతో మార్కాపురానికి ఒరిగేదేమిటి?
x
మార్కాపురం పట్టణం

ఈ రెండు మండలాలతో మార్కాపురానికి ఒరిగేదేమిటి?

దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, దొనకొండ మండలాలు మార్కాపురం జిల్లాలోకి...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కురిచేడు, దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో చేర్చి, పొదిలి మండలాన్ని ప్రకాశం (ఒంగోలు) జిల్లాలో కలిపే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మార్పులు మార్కాపురం జిల్లా అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయనే విషయాన్ని ఏ విధమైన పరిశీలనతో ప్రభుత్వం ఆలోచిందనే చర్చ మార్కాపురం ప్రాంతంలో మొదలైంది. పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక వృద్ధి, స్థానిక అవసరాలు వంటి అంశాలు తీసుకోవాలి. కానీ ఈ రెండు మండలాలు మార్కాపురంలో కలిపి, పొదిలిని ఒంగోలులో కలపడం వల్ల నియోజకవర్గాల సమతుల్యతలు దెబ్బతినే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల ప్రకారం, మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లను కలిపి ఈ జిల్లా ఏర్పడుతుంది. దీంతో జనాభా సుమారు 11.42 లక్షలకు చేరుతుంది. ఇక్కడే కురిచేడు, దొనకొండ మండలాల చేరిక కీలకం.

మార్కాపురం జిల్లాలో ఈ రెండు మండలాలు కలపడం వల్ల పెద్దగా ఒనగూరే గొప్పంటూ ఏమీలేదనేది పలువురు పరిశీలకుల అభిప్రాయం. దొనకొండలో రైల్వే స్టేషన్, పాత ఎయిర్‌పోర్ట్ సదుపాయాలు ఉన్నాయి. ఇవి కొత్త జిల్లాలో చేర్చడం వల్ల పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని చెబుతున్నారు. మార్కాపురం నుంచి దొనకొండ రావాలంటే పొదిలి మీదుగా కురిచేడు చేరి అక్కడి నుంచి దొనకొండ చేరుకోవాలి. ఇది 80 కిలో మీటర్ల వరకు ఉంటుంది. లేదంటే మరో రూటు లో కర్నూలు, గుంటూరు రోడ్డు నుంచి త్రిపురాంతకం గ్రామానికి సమీపంలోని వెల్లంపల్లి వద్ద నుంచి గుండ్లకమ్మ బ్రిడ్జి మీదుగా దొనకొండ చేరుకోవాలి. ఇది కూడా సుమారు 70 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి కురిచేడు మరో 25 కిలో మీటర్లు ఉంటుంది. ఎటు చూసినా మార్కాపురం పట్టణానికి దగ్గరగా, ఒంగోలుకు దూరంగా ఈ రెండు మండలాలు లేవు. సమాన దూరంలోనే ఉంటాయి. ఈ రెండు మండలాలు కలిపినంత మాత్రాన నాగార్జున సాగర్ నీరు యర్రగొండపాలెం నియోజకవర్గంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే యర్రగొండపాలెం పశ్చిమాన ఉంటుంది. పైగా గుళ్లకమ్మ ఈ రెండు మండలాలకు అడ్డంగా ఉంటుంది. అక్కడి నుంచి పై ప్రాంతానికి నీళ్లు రావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రజలు ఏమి కోరుకుంటున్నారు...

దర్శి నియోజకవర్గంలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు ఉన్నాయి. తాళ్లూరు, ముండ్లమూరు మండలాలు అద్దంకి నియోజకవర్గ కేంద్రానికి దగ్గరలో ఉన్నాయి. అందువల్ల దర్శి, కురిచేడు, దొనకొండ మండలాలు కలిపితే బాగుంటుందనే ఆలోచన ప్రజలు చేశారు. పాలకులు మాత్రం కురిచేడు, దొనకొండ చాలు అనటం వెనుక ఏదో మతలబు ఉందని, దొనకొండ పారిశ్రామిక కారిడార్ గా మారితే రాజకీయ నాయకులకు కల్పతరువుగా మారుతుందే తప్ప మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల వారికి పెద్దగా ఉపయోగం లేదనే వాదన కూడా ఉంది.

వెలిగొండే శాశ్వత మార్గం

మార్కాపురం జిల్లా సస్యశ్యామలంగా వెలుగొందాలంటే ఈ మండలాల మార్పు వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదనే వాదన చాలా మందిలో ఉంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కాలువలకు నీరు వదిలితే మంచి పంటలు పండి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందే తప్ప దొనకొండ వచ్చినంత మాత్రాన మార్కాపురం మణిహారంగా మారే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే దొనకొండ, కురిచేడును మార్కాపురంలో కలపాలని కోరడం వెనుక వచ్చే ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాన రహదారిలో ఉన్న పొదిలి పట్టణం ఒంగోలులోకి పోవడం వల్ల మార్కాపురం నియోజకవర్గానికి నష్టం కలుగుతుంది. రవాణా పరంగా మార్కాపురం, ఒంగోలుకు మధ్య ఎటు చూసినా 50 కిలో మీటర్ల దూరంలో పొదిలి ఉంటుంది. పొదిలిని ఆనుకుని కొనకనమిట్ల మండలం ఉంది. ఈ రెండు మండలాలతో పాటు తర్లుపాడు, మార్కాపురం మునిసిపాలిటీ కలిపి మార్కాపుం నియోజకవర్గంలో ఉన్నాయి.

అందువల్ల కలపాలనుకుంటే దర్శిని కూడా మార్కాపురంలోనే కలపాలని ప్రజలు కోరుతున్నారు. దర్శి, కురిచేడు, దొనకొండ మండలాలు పక్కపక్కనే ఉంటున్నాయి. అలాగే పొదిలి పట్టణాన్ని మార్కాపురంలోనే ఉంచడం మంచిదని మార్కాపురం వాసులు కోరుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి ఏవేవో ఆలోచనలు ఎందుకు చేస్తున్నారనేది పలువురి వాదన. దొనకొండ మండలం చుక్క నీరు లేని పూర్తి మెట్ల ప్రాంతం. పారిశ్రామిక వాడగా దొనకొండ మారాలంటే కనీసం మరో 30 సంవత్సరాల సమయం కావాలి. ఒక వేళ ఒకటో రెండో పరిశ్రమలు పెడితే స్కిల్ ఉన్నవారిని ఉద్యోగల్లోకి తీసుకుంటారు తప్ప అన్ స్కిల్డ్ వర్కర్లకు ఇక్కడ అవకాశం లేదు. యుద్ద విమానాల తయారీ పరిశ్రమ పెడితే స్థానికికులకు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయో ఆలోచించుకోవాలని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Read More
Next Story