గోంగూర పచ్చడి చేయడం రాదన్నందుకు పెళ్లిళ్లే చెడిపోయాయి తెలుసా?
x

GONGURA

గోంగూర పచ్చడి చేయడం రాదన్నందుకు పెళ్లిళ్లే చెడిపోయాయి తెలుసా?

'తెలుగువాడిలాగా గోంగూర ఎవరూ సొంతం చేసుకోరు' అనేది ప్రఖ్యాత సామెత. గోంగూరకు తెలుగు వాళ్లకు ఉండే సంబంధం మాటల్లో చెప్పలేనిది.


'తెలుగువాడిలాగా గోంగూర ఎవరూ సొంతం చేసుకోరు' అనేది ప్రఖ్యాత సామెత. గోంగూరకు తెలుగు వాళ్లకు ఉండే సంబంధం మాటల్లో చెప్పలేనిది. అయితే గోంగూరకు ఎంతో ఘనచరిత్ర కూడా ఉందట పురాణాల్లో... అదేంటో చూద్దాం.
దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్న సమయంలో కడలి గర్భం నుంచి ఉద్భవించిన వాటిల్లో “గోంగూర” ఒకటి. దాన్ని దేవేంద్రుడు తన నందనోద్యానవనంలో నాటించటం, తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అమరావతిని దర్శించినపుడు పారిజాతంతో పాటుగా ఈ గోంగూర మొక్కను కూడా పృధ్వి మీదకు తీసుకురావటం, భారత యుద్ధంలో సహాయపడినందుకు ఆంధ్రులకు గోంగూరను ప్రసాదించటం, అప్పటి నుండి “ఆంధ్రమాత”గా పేరుప్రఖ్యాతులు పొందిందని ప్రతీతి.

మహర్షులు బుద్దికుశలతను పెంపొందించే మార్గాన్ని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్దించినపుడు, గోంగూరను తినమని చెప్పటంతో అప్పటి నుండి శాకంబరీ దేవీ ప్రసాదంగా కొలవటం ప్రారంభమైందట. మొదట రుచులను పంచరుచులుగానే పేర్కొన్నారని, గోంగూర పులుపు నెరిగిన తరువాత షడ్రుచులుగా పేర్కొన్నారన్నారు.
గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మన పూర్వీకులు ఏనాడో ఈ సంగతిని నిర్ధారించారు. తులసి మాతతో పాటు స్త్రీలు సరిసమానంగా ఆదరించే మన ఆంధ్రమాత గోంగూర. రోజూ పూజానంతరం తులసి మొక్కతో పాటుగా ఆ చేత్తోనే ఇన్ని నీళ్ళు ఆ గోగు మొక్కకు కూడా పోస్తే ఆ ఇంటి ఇల్లాలికి దిగులేముంటుంది చెప్పండి.
అర్ధరాత్రో, అపరాత్రో చెప్పా పెట్టకుండా ఊడిపడే అతిధులను ఆదుకొనేది గోంగూరే. అసలు ఆ మూల జాడీలో ఇంత గోంగూర వుందంటే ఆ ఇల్లాలికి కొండంత అండ. గోంగూర మహాపచ్చడి. పిల్లాడో, పిల్లో పైచదువులకు ఏదన్నా ఊరు వెళుతున్నారంటే కూడా పంపించేది గోంగూరనే. అక్కడ ఏమి దొరకకపోతే గోంగూరన్నా ఆదుకుంటుందిగదాయని. గోంగూర ఆపద్భాంధవి. మనవాళ్లు విదేశాలు వెళుతున్నారంటే తీసుకెళ్ళాల్సిన జాబితాలో అగ్రతాంబూలం గోంగూరదే.
మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం నవల్లో పార్వతీశం కూడా లండన్ వెళుతూ గుమ్మడి కాయ జాడీ అంత గోంగూర పట్టుకెళ్లాడని పేర్కొన్నారు. గోంగూర ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తోంది. రైతుల విషయం పక్కన పెడితే, ఈనాడు ఊరూరా వెలసిన పచ్చళ్ల పచారీ షాపుల్లో మొదట గోంగూరతోనే అమ్మకాలను ప్రారంభిస్తారట.
గోంగూరకు శుభాశుభాలు లేవు. ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఆదుకొనేది గోంగూరే. ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఏ భోజనశాలకు వెళ్ళినా మొదట కనిపించేది గోంగూరే. గోంగూర వుంటే ఎటువంటి కార్యక్రమమైనా సజావుగా సాగిపోతుంది. గోంగూరకు మిగతా పచ్చళ్లలాగా భేషజాలు లేవు. చద్దెన్నంలో ఇట్టే తన ప్రతిభని ప్రదర్శిస్తుంది . పిల్లలు పొద్దున్నే చదువులకు వెళ్లాలంటే చద్దెన్నానికి ఆధరువు గోంగూరే. ఆ కలయిక అమృతతుల్యం. పిల్లలకే చెల్లు ఆ ఆనందం. ఎవరు చూడకపోతే చద్దెన్నంలో గోంగూరను లాగించే పెద్దలు లేకపోలేదు. ఆ బాల్యసాన్నిహిత్యం అలాంటిది. ఇక అట్లతదియ వచ్చిందంటే ఆటలకు పోవాలంటే సూర్యోదయానికి పూర్వమే పిల్లలు చద్దెన్నం, గడ్డపెరుగు తోపాటు జోడించేది గోంగూరనే.
గోంగూర స్వయంప్రతిపత్తి గలిగిన బ్రహ్మపదార్ధం. కందిపోడి, కమ్మనినెయ్యిలతో ఇట్టేకలిసిపోతుంది గాని తన ఉనికిని మటుకు పోగొట్టుకోదు. ఆ కలయిక వర్ణనాతీతం. దాన్ని స్తోత్రించటం కవులకే చెల్లు. అసలు చద్దెన్నంలో గోంగూర కలుపుకొని ఉల్లిపాయ కొరికితే కలిగేరుచి ఎవరికివారు అనుభవించాలిగాని మాటలుచాలవు.
గోంగూరపచ్చడి పెట్టటంకూడా ఒక కళ. అందరికీ అది అబ్బదు. గోంగూరపచ్చడి చెయ్యటం చేతగాదని ఏకంగా చక్కని పిల్లనే కాదుపొమ్మన్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఒకావిడ కోడలుపిల్ల గోంగూరపచ్చడి చేస్తూ దాంట్లో చింతపండు కలిపిందని నానారాద్ధాంతం చేసింది. అలా కలపటం ప్రకృతి విరుద్ధమని, గోంగూరను అవమానించినట్లేనని తేల్చిపారేసింది.
బామ్మలకు, మామ్మలకు వర ప్రదాయిని గోంగూర. ఇంత పిండిఉడకేసుకొని దాంట్లో గోంగూర కలుపుకుంటే జీవితాలే వెళ్లదీయవచ్చు. గోంగూర నిలవపచ్చడి. మిగతా పచ్చళ్లలాగా అర్భకురాలు గాదు. ఏడాది పాటునా నిల్వ చేసినా తన స్వయం ప్రకాశత్వానిగోల్పోదు. బూజు, చీడపీడలు లాంటివి గోంగూర దరిచేరలేవు. పానుగంటివారి ఝంఘాలశాస్త్రిగారికి అంత ప్రతిభాకౌశల్యం గోంగూర నిత్యము భుజించటంవల్ల కలిగినదని వారేపేర్కొన్నారు. గోంగూరకు ఆయుర్వేదంలో అగ్రతాంబూలం ఇచ్చారు. పైత్యం, దగ్గు, జలుబులకు మహత్తరమైనమందని ప్రస్తుతించారు. పిల్లకు భుద్దిపెరగాలంటే నిత్యం రెండోముద్దలో ఉసిరికాయంత గోంగూరను మించింది లేదు. కొన్ని ప్రాంతాల్లో గోంగూరను పుంటి కూర అని కూడా అంటారు.
ఆమధ్య ఆ గుంటూరు వాళ్ళు గోగు పువ్వులతో చేస్తున్న పచ్చడికీ గిరాకీ పెరిగింది. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఉండి ఉంటే గోగు విలాపమంటూ ఓ కవితను విసిరేవారేమో.. గోంగూర తినని తెలుగువాడే లేడంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అంటారు.. శత్రువులను కూడా ప్రేమతో జయించడం గోంగూర ప్రియులకు మాత్రమే సొంతం..
Read More
Next Story