
జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమి దొరికింది?
రాజకీయాల్లో రెండేళ్ల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా తీపిస్తాడా? చూపిస్తాడా? అనే చర్చ రాష్ట్రంలోని బాలినేని అభిమానులు, రాజకీయ నాయకుల్లో జోరందుకుంది. ఇటీవల పార్టీ కార్యాలయంలో పదవులు పొందిన వారిని అభినందించే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో కరచాలనం చేసి సరిపుచ్చారు. ఆయనే కాదు వేరే పార్టీల్లో ఒక వెలుగు వెలిగి ఇప్పు జనసేనలో ఉన్న వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. నాకు ఉచితంగా ఒక సినిమాలో నటిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పుడు చెప్పటం విశేషం.
రాజకీయాల్లో కొందరి జీవితాలు పర్వతారోహణ కంటే కష్టంగా ఉంటాయి. మరికొందరు జీవితాలు నల్లేరుపై నడకలా ఉంటాయి. ఈ రెండింటికి మధ్య మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జీవితం సాగుతోంది. ఈయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దూరపు బంధువు. వైఎస్సార్ తో ఎంతో ఆప్యాయంగా ‘వాసూ’ అని పిలిపించుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వాసు అని పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ అధికారం చేపట్టక ముందు నుంచీ వైఎస్సార్ కుటుంబంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? రాజకీయ రంగంలో ఓడారా? రాణించారా? రెంటికీ చెడ్డ రేవడి అయ్యారా? ఒక సారి పరిశీలిద్దాం...
జనసేనలో బాలినేని స్థానం ఏమిటి?
బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన హోదా సాధారణ కార్యకర్త. సోమవారం జరిగిన ‘జనసేన -పదవీ బాధ్యత’ కార్యక్రమంలో అలా పవన్ కల్యాణ్ కు కనిపించి చిరునవ్వు తరువాత కూర్చొన్నారు. తనకు పార్టీలో ఏదైనా పదవి రాకపోతుందా అనే చిరు ఆశతో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లుగా ఉన్న వారిని కాదని బాలినేనికి ప్రకాశం జిల్లాలో ఏమి పదవి దక్కుతుందోననేది పలువురిలో చర్చకు దారి తీసింది. ఎంతటి నాయకుడు ఎలా ఉన్నాడో చూడండి అంటూ ఆయన మిత్రులు, సహచరులు, బంధువులు నిట్టూరుస్తున్నారు. అయితే బాలినేనికి పవన్ కల్యాణ్ బలమైన హామీ ఇస్తేనే పార్టీలో చేరి ఉంటాడనే చర్చ కూడా ఉంది.
వైఎస్సార్ కుటుంబంతో బంధుత్వం ఎలా...
ఏపీలోని ప్రకాశం జిల్లాతో వైఎస్సార్ కు అనుబంధం ఎక్కువ. వైఎస్సార్ సతీమణి విజయమ్మ చెల్లెలు స్వర్ణ ను ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి వివాహం చేసుకున్నారు. దీంతో వైఎస్సార్, వైవీ సుబ్బారెడ్డిలు తోడల్లుళ్లు అయ్యారు. అప్పటి నుంచి కుటుంబ బంధుత్వాలు కలిసాయి. ఎప్పుడు వైఎస్సార్ ఒంగోలు వచ్చినా వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి బస చేస్తారు.
వైవీ సుబ్బారెడ్డి చెల్లెలు శచీదేవి ని ఒంగోలుకు చెందిన బాలినేని వెంకటేశ్వరరెడ్డి కుమారుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైవీ సుబ్బారెడ్డి కి బావ అయ్యారు. వైవీ, వైఎస్సార్, వాసు కుటుంబాలు ఈ సంబంధాలతో మమేకం అయ్యాయి. వైఎస్సార్ రెండో సారి సీఎం అయిన తరువాత వాసుకు మంచి ప్రయారిటీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మరణం తరువాత కె రోశయ్య మంత్రివర్గంలో కొంత కాలం ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగన్ కు ఎలా చేరువయ్యారు...
జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి కుటుంబం ద్వారా బంధుత్వం కలవడం వల్ల వైఎస్ఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిగా వాసు మమేకం కావడంతో అడుగులు ముందుకు పడ్డాయి. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా వారి మధ్య బంధం మరింత బలపడింది. దీనంతటికీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం కారణంగా చెప్పొచ్చు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగానే పాల్గొన్నారు.
జగన్ తో వైరుధ్యం ఎందుకు?
వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ని మంత్రివర్గ పునర్నిర్మాణంలో తొలగించాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేశ్ ను మంత్రిగా కొనసాగించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడం, సురేశ్ ను కొనసాగించడం బాలినేనికి మింగుడు పడలేదు. పైగా పార్టీ నిర్మాణం, 2024 ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయాల్లోనూ వైఎస్ జగన్ బాలినేని మాటకు విలువ ఇవ్వలేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు విషయం చర్చకు వచ్చినప్పుడు జగన్ దాటవేత మాటలు మాట్లాడటం బాలినేనికి నచ్చలేదు. దీంతో ఆయన జగన్ తో విభేదించి పార్టీ మారారు.
వైవీ సుబ్బారెడ్డితోనూ విభేదాలు
తన బావమరిది అయిన వైవీ సుబ్బారెడ్డితోనూ రాజకీయంగా బాలినేని వైరం పెంచుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇష్టం లేదు. ఈ విషయం వైవీ సుబ్బారెడ్డి వద్ద స్పష్టం చేశారు. అయితే తాను కేంద్ర రాజకీయాలకే పరిమితం అవుతానని, రాష్ట్ర రాజకీయాల్లో కానీ, ప్రధానంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కానీ జోక్యం చేసుకోనని, నీవు చెబితేనే ప్రకాశం జిల్లాలో ఏపనైనా చేస్తానని చెప్పినా బాలినేని వినిపించుకోలేదు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ స్పర్థలు పెరిగి ఒకరికి ఒకరు దూరం అయ్యారు.
బాలినేని రాజకీయ ప్రస్థానం
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి చెందిన ఈ నాయకుడు 1987లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, అధ్యక్షుడిగా పనిచేసి, 1999లో ఒంగోలు ఎమ్మెల్యేగా మొదటి విజయం సాధించారు. 2004, 2009లలో కూడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో 2004-2009 మధ్య గనులు, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్‌టైల్స్ మంత్రిగా సేవలందించారు. 2009-2010లో కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కొద్దికాలం పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2011లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)లో చేరడం ఆయన రాజకీయ జీవితంలో మొదటి ప్రధాన మలుపు. ఈ మార్పు ఫలితంగా 2012లో ఒంగోలు ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2014లో ఓటమి ఎదురైనప్పటికీ 2019లో మళ్లీ విజయం సాధించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019-2022 మధ్య ఎనర్జీ, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, 2022 ఏప్రిల్‌లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి నుంచి తొలగించబడటం మరో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓటమి ఎదురుకావడం, పార్టీలో అసమ్మతి పెరగడం వంటి కారణాలతో సెప్టెంబర్ 18, 2024న వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో మరో కీలక మలుపును సూచిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 26, 2024న పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరారు. ఈ మార్పుకు పార్టీ అంతర్గత విభేదాలు, నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తి, స్థానిక సమస్యలు కారణాలుగా చెప్పారు. తాను వైఎస్సార్సీపీలో ఆర్థికంగా నష్టపోయినట్లు ఆయన చెప్పారు.
2025లో జనసేనలో ఆయన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పార్టీలో అంతర్గత వ్యతిరేకత, మార్జినలైజేషన్ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. జూలై 2025లో వైఎస్ఆర్‌సీపీలోకి తిరిగి చేరాలనే పుకార్లు వచ్చినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. బాలినేని రాజకీయ జీవితం పార్టీ మార్పులు, పదవులు, ఓటములు వంటి మలుపులతో సాగుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ప్రభావాన్ని చూపుతోంది.

