చేనేతలకు ఇచ్చిన హామీల మాటేమిటి?
x

చేనేతలకు ఇచ్చిన హామీల మాటేమిటి?

చేనేతలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల మాటేమిటి? జాతీయ చేనేత దినోత్సవం రోజున ఆ హామీల అమలుకు శ్రీకారం చుడతారనుకుంటే ఆ ఊసేలేదంటున్నారు చేనేతలు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చేనేత కార్మికులు, ఆ వర్గాల వారికి పలు హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతోంది. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడతారని అందరూ భావించారు. చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో బుధవారం సాయంత్రం జరగాల్సిన ముఖ్యమంత్రి కార్యక్రమం వర్షం కారణంగా వాయిదా పడింది. ముఖ్య మంత్రి నుంచి చేనేతలకు సుభ వార్త వస్తుందని చూసిన చేనేతల ఆశలు నెరవేరలేదు.

ఇచ్చిన హామీలు ఏమిటి?
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేనేత కార్మికులు, ఆయా వర్గాల వారికి పలు హామీలు ఇచ్చారు. ప్రధానంగా నేతకు కావాల్సిన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చేనేతలు నూలు, రంగు, రసాయనాలు ముడి సరుకుగా కొనుగోలు చేయాలి. ఇవి ఉంటేనే నేత నేసి బట్టలకు రంగులు వేయడం సాధ్యమవుతుంది. ఈ ముడి సరుకులు కొనాలంటే కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్‌టీ నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. నూలు, రంగు, రసాయననాల కొనుగోలుపై 29 శాతం జీఎస్‌టీ పడుతోంది. ఈ మొత్తాన్ని చేనేత సహకార సంఘాల ద్వారా తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. చేనేతలు కొనుగోలు చేసిన బిల్లులు సహకార సంఘం ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే జీఎస్‌టీ మొత్తాన్ని ప్రభుత్వం వెనక్కి ఇచ్చేస్తుందని హామీ ఇచ్చారు.
చేనేత కార్మికులు చేతి మగ్గాల ద్వారా వినియోగించే విద్యుత్‌ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని, అలాగే మర మగ్గాలకు అయితే 500 యూనిట్లలోపు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. చీరాలలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టెక్సైల్‌ పార్క్‌ కాకపోయినా చేనేత పార్క్‌ ఏర్పాటు చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందని చీరాల చేనేతలు చెబుతున్నారు.
చేనేత సహకార సంఘాలకు ఇప్పటి వరకు ఉన్న రుణ బకాయిలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. బకాయిలు రద్దయితే తిరిగి రుణాలు సంఘాల ద్వారా తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఆ దిశగా ఇంకా ఎటువంటి అడుగులు పడలేదు.
ఈ హామీలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తప్పకుండా అమలులోకి వస్తాయని భావించామని అయినా ఆ ఊసే లేకుండా పోవడం చేనేతలకు కొంత బాధగా ఉందని చేనేత కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు జ్వాలా నరసింహారావు పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...
జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా నేతన్నలకు నా సుభా కాంక్షలు. అద్భుతమైన నేత కళను ప్రపంచానికి అందించిన చేనేత కార్మికులు మన దేశ ప్రతిష్టను పెంచారు. అలాంటి చేనేత కార్మికులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ప్రభుత్వ పరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తాం. సమగ్ర చేనేత విధానం తీసుకొచ్చి, సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతాం. వెలకట్టలేని నైపుణ్యం సృజనాత్మకతకు నెలవైన చేనేతకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడు చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. గతంలో 24,300 చేనేత కుటుంబాల్లోని 674 స్వయం సహాయక బృందాలకు, 584 మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూర్చేలా రూ. 116 కోట్లకు పైగా రుణాలు మాఫీ చేశాము. నేత కార్మికులకు పట్టు, నూలు కొనుగోలుపై ఏడాదికి రూ. 24,000లు రాయితీ ఇచ్చాము. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చాము. మర మగ్గాలకు 50 శాతం రాయితీ ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Read More
Next Story