
పశ్చిమ గోదావరికి వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ అవార్డు
లేసుల అల్లికలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఓడీఓపీ రావడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడు నాగరాణి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో ఏర్పాటుచేసిన ఓడిఓపి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని "నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్" కు కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 9 ఉత్పత్తుల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ కు ఓడిఓపి అవార్డు లభించింది.
ఇప్పటికే "నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్" కు గత సంవత్సరం జిఐ గుర్తింపుకు ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జౌళి చేతి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లేసు కు భౌగోళిక సూచిక (GI) గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25, 2024న న్యూఢిల్లీలోని హోటల్ ఒబెరాయ్‌లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని "నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్" కు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతులు మీదుగా (జిఐ) సర్టిఫికేట్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నర్సాపూర్ లెస్ అల్లికలకు గత సంవత్సరం జిఐ గుర్తింపు రావడం, నేడు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపులతో వేలాదిమంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామన్నారు. ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజి, బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా ఇప్పటికే పని చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ టెక్స్‌టైల్ పరిశ్రమలో చేతితో నేసిన, చేతితో తయారు చేసిన వస్త్రాలు దేశంలో భౌగోళిక సూచిక నమోదిత ఉత్పత్తుల పట్టికలో అగ్రగామిగా ఉన్నాయని తెలిపారు. దేశంలో జిఐ ట్యాగ్ చేయబడిన హ్యాండ్లూమ్స్, హస్తకళా ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటాయన్నారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు, రాష్ట్రంలో జిఐ గుర్తింపు పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా మన లేసు ఉత్పత్తులు నిలవడానికి కారణమైన తయారీదారుల కృషి ఫలితంగా నేడు మరో అవార్డును ఓడిఓపి క్రింద పొందగలిగామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లేసు తయారీదారులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖామంత్రి ఎస్.సవిత, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, ఐఏఎస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ఓ డి ఓ పి అవార్డుకు ఎంపికైన జిల్లాల కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.