శభాష్ సీదిరి..ప్రాణాలు కాపాడావు
x

శభాష్ సీదిరి..ప్రాణాలు కాపాడావు

కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్వయంగా వైద్య సేవలు అందించారు.


"వైద్యో నారాయణో హరి" అనే పురాణ మంత్రానికి నిజమైన ఉదాహరణగా మారిన మాజీ మంత్రి, వైసీపీ నేత, డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో కీలక పాత్ర పోషించారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సీదిరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన భక్తులకు స్వయంగా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి, ఆక్సిజన్ సప్లై అందించే ప్రయత్నం చేశారు. ఈ చర్యల వల్ల ఇద్దరు భక్తుల ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి, స్థానిక వైసీపీ నేతలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఘటన నేపథ్యం


కార్తీక మాస ఏకాదశి సందర్భంగా "చిన్న తిరుపతి"గా పేరుగాంచిన కాశీబుగ్గ ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. అధిక భక్తుల సంఖ్యకు తగిన ఏర్పాట్లు లేకపోవడం, రెయిలింగ్ కూలిపోవడంతో 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రశంసలు..

ఈ ఘటన తర్వాత డాక్టర్ సీదిరి అప్పలరాజుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పార్టీలకు అతీతంగా సీదిరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆన్‌డ్యూటీ.. వైద్యుడిగా, నేతగా నిజమైన సేవ" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ. 17 లక్షలు, గాయపడిన వారికి రూ.3.5లక్షలు సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు.

Read More
Next Story