శభాష్ నాదెండ్ల మనోహర్!
గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకున్న సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సకాలంలో వ్యాపారుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ మద్దతు ధర రాకపోతే రైతులు నానా ఇబ్బందులు పడాల్సిందే. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం చేసిదని చెప్పొచ్చు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసింది. గ్రేడ్ వారీగా రైతులకు మద్దతు ధర ఇచ్చింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన 24 గంటల్లో వారి అకౌంట్స్ లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ముందున్నారు. ఏ గ్రేడ్ ధాన్యం ధర క్వింటా రూ. 1750 లకు కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మంచి ధరే వచ్చిందని రైతులు చెబుతున్నారు.
ధాన్యం కోసి ఆరబెట్టుకున్న సమయంలో వర్షాలు వచ్చి కొందరి ధాన్యం తడిసి కల్లంలోనే మొలకెత్తాయి. అటువంటి ధాన్యాన్ని కూడా వదలకుండా కొనుగోలు చేశారు. అయితే ఆ ధాన్యానికి ఎంత ధర ఇవ్వాలో నిర్ణయించి ఆ మేరకు రైతులకు ఇచ్చారు. ఇక తేమ శాతాన్ని బట్టి తూకంలో తగ్గింపులు చేపట్టారు. లేదంటే 17 శాతం వరకు తేమ ఉన్నా పరవలేదని, అంతకంటే ఎక్కవ తేమ శాతం ఉంటే ఒకటీ రెండు రోజులు ఆరబెట్టి తీసుకు రావాలని రైతులను కోరారు. రైతులు ఆ విధంగానే చేశారు. నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు పొలాల్లోకి వెళ్లి కొనుగోలు చేయడం విశేషం. వరదల్లో తడిసి బాగా నష్టపోయిన జిల్లాల్లో ధాన్యాన్ని 20 నుంచి 25 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి మనోహర్ ఆదేశించారు.
ఎప్పుడూ లేని విధంగా..
ధాన్యం అమ్మ దలిచిన రైతులు 73373-59375 నెంబర్ కు హాయ్.. అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుంది. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత, రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం ధాన్యం అమ్మ దలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాత ధాన్యం అమ్మదలిచిన తేదీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యాన్ని ఎలాంటి బాదరబందీ లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడటం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
24 గంటల్లోనే..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకావడంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ విషయంలో రైతుల నుంచి ఎక్కడా వ్యతిరేక వాయిస్ రాలేదు. కాకపోతే తేమ శాతం పేరుతో ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. కృష్టా జిల్లా కంకిపాడు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సదస్సుల సందర్భంగా అక్కడికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లారు. తూకం ఎలా వేస్తున్నారనే విషయం తెలుసుకున్నారు. మిల్లర్లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మధ్య తూకంలో తేడాలు ఉండటంతో మందలించి సమస్యను పరిష్కరించారు. మిల్లర్లు తేమశాతం ఎక్కువగా ఉందని ముందు కొనుగోలుకు నిరాకరించినా ఆ తరువాత ప్రభుత్వం కలుగ జేసుకోవడంతో వెనక్కి తగ్గారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లు కొనుగోలు చేశారు. రైతులకు గోనె సంచులు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. అదే విధంగా కల్లం నుంచి ధాన్యాన్ని సేకరణ కేంద్రం వద్దకు తీసుకు వెళ్లిన రవాణా చార్జీలు కూడా ప్రభుత్వమే భరించింది.
ఈ సీజన్ లో 29,39,432 మెట్రిక్ టన్నులు సేకరణ
కరీఫ్ సీజన్ కు సంబంధించిన పంట కొందరు ముందుగా వేస్తే మరికొందరు కాస్త ఆలస్యంగా వేశారు. ప్రభుత్వం వద్ద అమ్మేందుకు ముందుకు వచ్చిన రైతులను వెనక్కి పంపకుండా ధాన్యం కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 5,99,952 మంది రైతుల నుంచి 29,39,432 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రైతులకు చెల్లించాల్సిన రూ. 5,878.49 కోట్లు 24 గంటల్లో ధాన్యం రైతుల అకౌంట్స్ లోకి నగదు జమయ్యేలా చూసింది.
ఆమేరకు సివిల్ సప్లైస్ శాఖ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అలాగే గత ప్రభుత్వం రైతులకు ఉంచిన బకాయి మొత్తం రూ. 1,674లు కూడా రైతుల ఖాతాల్లో జమచేసింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు నిత్యం శ్రమ చేసి పండించుకున్న ధాన్యానికి గిట్టుబాటు ధర రాకపోతే పడే బాధలు తనకు తెలుసునని, అందుకే రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇంత భారీ స్థాయిలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి చెప్పిన ప్రకారం వెంటనే డబ్బులు ఇవ్వడం కూడా కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమైందన్నారు. తాను ఇన్చార్జ్ గా ఉన్న ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. కలెక్టర్, కె వెట్రిసెల్వి,, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి లతో పాటు ఇతర అధికారులను అభినందించారు.
రైతు సంఘాల నుంచి అభినందనలు
రైతుల సంఘాల నాయకులు కూడా పలువురు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి విమర్శలు చేయలేక పోయారు. చెప్పిన ప్రకారం రైతులకు డబ్బులు సకాంలో ఇచ్చారని, దానికి సంతోష పడాల్సిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. మిగిలిన కొన్ని అంశాలు ఉన్నాయని, వాటికి జోలికి పోకుండా ధాన్యం వరకు తీసుకుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనన్నారు.