బీసీ బాలురకు ఫుడ్ పాయిజన్‌..గిరిజన బిడ్డలకు పచ్చ కామెర్లు
x

బీసీ బాలురకు ఫుడ్ పాయిజన్‌..గిరిజన బిడ్డలకు పచ్చ కామెర్లు

అన్నపర్రు బీసీ హాస్టల్‌తో పాటు కురుపాం గురుకుల పాఠశాలల దుర్ఘటనలు వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షేమ విద్యా సంస్థల్లో ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్న పేద పిల్లల ఆరోగ్యం సంక్షోభంలో పడింది. విద్యార్థులకు ఆరోగ్యపరమైన భద్రత లేకుండా పోయింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు దీనికి నిదర్శనమని చెప్పొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనలు కలకలం రేపాయి. బీసీ సంక్షేమ వసతి గృహంలోని బీసీ బిడ్డలు ఫుడ్‌ పాయిజన్‌కు గురై వాంతులు, విరేచనాల బారిన పడగా, గిరిజన విద్యా కుసుమాలను కామెర్ల వ్యాధి కుదిపేస్తోంది. గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ బాలుర సంక్షేమ హాస్టల్‌లో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ సంఘటనలో 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల (జాండిస్‌) వ్యాప్తితో 170 మంది బాలికలు బారిన పడ్డారు, ఇద్దరు మరణించారు. ఈ ఘటనలు హాస్టల్‌లు, గురుకులాల్లో ఆహారం, నీటి సురక్షితతపై ప్రభుత్వ విధానాల్లో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర సంక్షేమ హాస్టల్‌లో అక్టోబర్‌ 10న రాత్రి కలకలం రేగింది. ఆహారం తిన్న తర్వాత 56 మంది విద్యార్థులకు ఒక్క సారిగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పులతో తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. ఇందులో 24 మందిని ఆసుపత్రులకు తరలించారు. ఒకరు ఐసీయూలో చికిత్స పొందారు. తొలుత 47 మంది అస్వస్థతకు గురవగా తర్వాత తాజా అప్‌డేట్‌ల ప్రకారం 56 మంది ఫుడ్‌ పాయిజన్‌ బారిన పడ్డారు. హాస్టల్‌లో మొత్తం 100 మందకు పైగా విద్యార్థులు చదువుతున్నారని అధికారులు తెలిపారు.
ఫుడ్‌ పాయిజన్‌కు కారణాలు
ప్రాథమిక దర్యాప్తుల ప్రకారం, హాస్టల్‌లో సర్వీస్‌ చేసిన ఆహారం, తాగునీటిలో కలుషితం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆహార నమూనాలు, నీటి సాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు, కానీ ఫలితాలు ఇంకా రాలేదు. వైద్యులు, అధికారులు కారణాలను ఇంకా వెల్లడించకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
చికిత్సలు
ఫుడ్‌పాయిజన్‌కు గురైన బాధిత బిడ్డలను మొదట పెదనందిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా ఉన్న 24 మందిని గుంటూరు ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌కు మార్చారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారు, ఐసీయూలో ఉన్నవారి ఆరోగ్యం కూడా మెరుగుపడింది.
ఈ ఘటన హాస్టల్‌ల్లో ఆహార నిర్వహణలో లోపాలను ఎత్తి చూపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ బాద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఇంత వరకు విచారణ కొలిక్కి రాలేదు, అందులోని విషయాలను ప్రభుత్వం వెల్లడించలేదు. దీంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతపై అనేక అనుమానాలకు తావిచ్చినట్టు అయ్యింది.
కురుపాం గురుకులంలో పచ్చకామెర్ల విషాదం
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 611 మంది బాలికలు చదువుతున్నారు. ఈ గురుకులంలో సెప్టెంబర్‌ 25 నుంచి పచ్చకామెర్లు, వైరల్‌ జ్వరాలు వ్యాప్తి చెందాయి. కానీ అధికారులు సక్రమంగా చర్యలు తీసుకోకపోవడంతో 170 మంది బాలికలు వీటి బారిన పడ్డారు. వీరిలో 38 మంది బాలికల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. దీంతో సెప్టెంబర్‌ 25న పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి, తొమ్మిదో తరగతి చదువుతున్న తోయిక కల్పన సెప్టెంబర్‌ 29న మరణించారు.
పచ్చకామెర్లు సోకడానికి కారణాలు
పచ్చ కామెర్లకు కారమైన హెపటైటిస్‌ వైరస్‌ కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ఆర్‌ఓ ప్లాంట్‌ పాడవడం, శానిటేషన్‌ సరిగ్గా లేక పోవడం లోపాలతో కలుషిత నీరు (మలాలు కలిసిన) తాగడం మూల కారణం. ఇదే విషయాన్ని వైద్యాధికారులు వెల్లడించారు.
చికిత్సలు
బాదితుల్లో 120 మంది బాలికలను పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో, 44 మంది విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. 20 మంది కోలుకున్నారు. 28 మంది ఇంకా క్రిటికల్‌గా ఉన్నారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తోంది. బాధితులను పలువురు మంత్రులు పరామర్శించారు. కేజీహెచ్‌కెళ్లి బాధిత బాలికలను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్, మరణించిన ఇద్దరి బాధిత కుటుంబాలకు ౖరూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. రూ. 25లక్షల చొప్పున అందజేసి బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సహాయం గురించి స్పష్టత లేదు.
మొత్తమ్మీద ఈ ఘటనలు సంక్షేమ వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతే చదువుకుంటున్న గిరిజన, బీసీ విద్యార్థులకు అందించే సౌకర్యాల్లో నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయి. తాగే నిటికి సంబంధించి, తినే ఆహారానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ సంఘటనలు విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాల అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుంటే, మరిన్ని దుర్ఘటనలను నివారించవచ్చు.
Read More
Next Story