ప్రతి రైతును ఆదుకుంటాం - పవన్ కల్యాణ్
x

ప్రతి రైతును ఆదుకుంటాం - పవన్ కల్యాణ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.


మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో నష్టం జరిగిందని, ఈ జిల్లాలో 56 వేల మంది రైతులు ప్రభావితమయ్యారని ప్రాథమిక అంచనా వెల్లడించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, అధైర్యపడవద్దని భరోసా నింపారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ముందస్తు సన్నద్ధతతో తుపానును సమర్థంగా ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పర్యవేక్షణ జరిపామని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా 1.16 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కౌలు రైతుల నష్టం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తుపాను అనంతర ఉపశమన చర్యలు యుద్ధప్రాతిపదికన ప్రారంభమైనట్టు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 274 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, వీటిని శాశ్వతంగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించామన్నారు. గ్రామాల్లో నీటి నిల్వ తొలగింపు, అంటు వ్యాధుల నివారణకు సూపర్ శానిటేషన్, సూపర్ క్లోరినేషన్ చర్యలు చేపట్టామని తెలిపారు. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవగా, 21,055 మంది సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకు ఉపయోగిస్తున్నామన్నారు. తాగునీటి సమస్యలకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పునరావాస శిబిరాల్లోని వారికి 25 కేజీల బియ్యం, మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇస్తామని, కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటర్, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళాదుంపలు 1 కేజీ, పంచదార 1 కేజీ ఉచితంగా అందిస్తామన్నారు. ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేలు చెల్లిస్తామని పేర్కొన్నారు. నష్టం ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరతామన్నారు. కోడూరు మండలంలో సముద్రం కట్ట దెబ్బతిన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ కొత్తగా నిర్మించడానికి నాబార్డ్ సాయం తీసుకుంటామని, ఎదురుమొండి దీవుల్లో సముద్ర కోతకు గురైన ఎదురుమొండి-గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తయ్యాయని, దీంతో ఐదు గ్రామాల రహదారి సమస్యలు తీరతాయని తెలిపారు.

ఈ పర్యటనలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టూరిజం ఎండీ అమ్రపాలి, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story