
కాగ్నిజెంట్ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు
త్వరలో ఏఐ డాక్టర్లను అందుబాటులోకి తెస్తాం..
ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వైద్యులను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖలో కీలక ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘త్వరలోనే అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఏఐ డాక్టర్లను కూడా అందుబాటులోకి తెస్తాం.. ఏం కావాలన్నా ఏఐ డాక్టర్లను అడిగి ముందుకు వెళ్లే పరిస్థితిని తీసుకొస్తాం. వాళ్లే పరీక్షలు ఆటోమేటిక్‌గా చేసుకునే పరిస్థితి వస్తుంది’ అని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే?
మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
ఆరోజు హైదరాబాద్.. ఈరోజు వైజాగ్..
దాదాపు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అభివృద్ధి చేశాను. ఈరోజు అంతకు మించిన అభివృద్ధి వైజాగ్‌లో జరగడానికి కృషి చేస్తున్నాను. ఈ సిటీ (విశాఖ)ని చూస్తే ఇక్కడ మంచి ప్రజానీకం ఉన్నారు. ప్రకృతి రమణీయం, సాగరతీరంతో అలరారుతున్న, సుందర పర్యాటక నగరం, అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులూ దీనికి సొంతం. విశాఖకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఐటీతో పాటు ఏఐ డేటా సెంటర్లతో ముందుకు దూసుకెళ్తుంది. దీనికుండే ఫీచర్స్ దేశంలో మరే నగరానికీ లేవు. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రమ్మని కాగ్నిజెంట్‌ను రమ్మన్నాం. మా ఆహ్వానంతో వచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఇండియాకు, విశాఖకు రావడానికి ఆసక్తిగా ఉన్నాయి. కాగ్నిజెంట్ హెడ్‌క్వార్టర్‌ను విశాఖకు మార్చి.. ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగించాలని కోరాను. ఏడాదిలో ఈ సెంటర్ 25 వేల మంది ఉద్యోగులు పనిచేసే సెంటర్‌గా తయారవుతుంది కాగ్నిజెంట్. ఆగస్టుకి భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుంది, త్వరలో మెట్రో కూడా వస్తుంది. విశాఖ నాలెడ్జి, డేటా సెంటర్ల హబ్‌గా మారుతుంది.
కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి
ఏడాదిన్నరలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు..
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. వీటి ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి. గూగుల్ రూ.లక్షా 30 వేల కోట్లు, మైక్రోసాఫ్ట్ రూ.లక్షా 50 వేల కోట్లు. అమెజాన్ రూ.3.50 లక్షల కోట్లు, మెటా రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇంకా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, శ్రీహరికోట వద్ద శాటిలైట్ సిటీ వస్తోంది. ఏరో స్పేస్‌సిటీ అనంతపురంలో ఏరోస్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో మెడ్‌టెక్ పార్క్ పెట్టాం. గ్రీన్ హైడ్రోజన్‌కు ఏపీ నాంది పలుకుతోంది. ఏ రాష్ట్రానికి వెళ్లినా నీటి కొరత ఉంది. కానీ ఏపీలో నీటి కొరత, భూమి కొరత, ఎనర్జీ కొరత లేదు. మాలా సహకరించే వారుండరు. ఏపీలో గంటలోపు ఏ ఎయిర్‌పోర్టుకైనా వెళ్లేలా చేస్తున్నాం. ఇండియాకు, ప్రపంచానికి కావలసిన ఫుడ్‌ను అందించేలా ఏపీలో టెక్నాలజీని తీర్చి దిద్దుతున్నాం. ఏపీలో అందరికీ స్మార్ట్ ఫోన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. చాలా సమస్యలకు పరిష్కారం వీటి ద్వారా లభిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు.
ఏసీఎన్ సంస్థకు భూమి పూజ చేస్తున్న మంత్రి లోకేష్
ఎనిమిది సంస్థలకు శంకుస్థాపనలు..
శుక్రవారం విశాఖలోని ఎనిమిది ఐటీ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపనలు చేశారు. కాగ్నిజెంట్ క్యాంపస్ పూర్తయ్యే వరకు కాగ్నిజెంట్ కార్యకలాపాల నిర్వహణకు రుషికొండ ఐటీ పార్క్ హిల్ నంబర్ 2లోని మహతి ఫిన్‌టెక్ భవనాన్ని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. దీనిని లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఉద్యోగులనుద్దేశించి లోకేష్ మాట్లాడారు. ‘ఏడాదిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి (విశాఖకు) తీసుకొచ్చాం. భవిష్యత్తులో విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తాం’ అని చెప్పారు. అనంతరం లోకేష్ ఐటీ హిల్స్‌లోని మరో ఎనిమిది సంస్థలకు కేటాయించిన స్థలాల్లో వాటి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో టెక్ తమ్మి, సత్వా డెవలపర్స్, ఇమాజిన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నో సాఫ్ట్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, నాన్ అరెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థలున్నాయి. కాగ్నిజెంట్ సహా ఈ సంస్థలన్నీ రూ.3,740 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 41,700 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి.
హాజరైన ఐటీ ప్రతినిధులు
ఏ సంస్థ ద్వారా ఎంత పెట్టుబడులు? ఎన్ని ఉద్యోగాలు?
ఐటీ సంస్థ పేరు పెట్టుబడి ఉద్యోగాలు
కాగ్నిజెంట్ టెక్నాలజీస్ రూ.1,583 8,000
టెక్ తమ్మిన రూ.62 కోట్లు 500
సత్వా డెవలపర్స్ రూ.1,500 కోట్లు 25,000
నాన్ రెల్ టెక్నాలజీస్ రూ.50.60 కోట్లు 567
ఏసీఎన్ ఇన్ఫోటెక్ రూ.30 కోట్లు 600
ఇమేజిన్నోవేటివ్ రూ.140 కోట్లు 2,600
ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ రూ.150 కోట్లు 2,000
మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ రూ.109.73 కోట్లు 1,775
క్వార్క్స్ టెక్నో సాఫ్ట్ రూ.115 కోట్లు 2,000
కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌కు సంబంధించి..
విశాఖలో ఏర్పాటు కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ ద్వారా రూ.1,583 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఎనిమిది వేల మందికి ఉద్యోగావకాశాలు లభించినున్నాయి. 2029 నాటికి తొలి దశను పూర్తి చేసుకుని మూడు వేల మందికి ఉద్యోగాలిస్తుంది. తర్వాత రెండ దశల్లో ఉద్యోగావకాశాలను ఎనిమిది వేలకు పెంచుతుంది. (కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ ఉద్యోగుల సంఖ్య 25 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు) మొదటి దశ పూర్తయ్యే వరకు కాగ్నిజెంట్ కార్యకలాపాల నిర్వహణకు రుషికొండ ఐటీ పార్క్ హిల్ నంబర్ 2లోని మహతి ఫిన్ టెక్ భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ కాగ్నిజెంట్ సెంటర్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునికి సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తుంది.
Next Story

