విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు, పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చిందని... ఇది ఆహ్వానించదగిన పరిణామంగా సిఎం అన్నారు. ప్లాంట్‌ని నష్టాల నుంచి బయటపడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. గత ఏడాది కాలంలో తీసుకున్న చర్యలు, సమిష్టి నిర్ణయాలు, సమన్వయం కారణంగా ప్లాంట్ మంచి ఫలితాలు సాధిస్తోందని సిఎం అభిప్రాయ పడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో తీసుకున్న చర్యలను, వచ్చిన ఫలితాలను సమీక్షించారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సమిష్టి కృషి
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సిఎం చంద్రబాబు చొరవ తీసుకుని ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం నుంచి ఆర్థిక సాయం తెచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో నాడు కేంద్రం ప్లాంట్ పరిరక్షణ కోసం రూ.11,440 కోట్ల సాయం అందించింది. ఇందులో మెజారిటీ మొత్తం ఇప్పటికే విడుదల కావడంతో ఆ నిధుల్ని వినియోగించి ప్లాంట్‌ను గాడిన పెట్టే పనులు చేపట్టడం జరిగింది. ఏడాది కాలంలో అటు కేంద్ర సాయం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అందిస్తున్న సహకారంతో ఉత్పత్తి సామర్థ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్లాంట్ సామర్థ్యంలో 25 శాతం మాత్రమే ఉత్పత్తి జరగ్గా, ఈ సెప్టెంబర్‌లో అది 79 శాతానికి చేరింది. ఇది మంచి పరిణామం అని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సిఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అధికారులకు సూచించారు.
మూడవ త్రైమాసికం ముగిసేలోగా 92.5 శాతం ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని సిఎం సూచించారు. దీని కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, తిరిగి పూర్వవైభవం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సిఎం తెలిపారు. ప్లాంట్ పనితీరు, పురోగతిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తామని సిఎం స్టీల్ ప్లాంట్ అధికారులకు తెలిపారు. అలాగే ప్రతినెలా సిఎస్ స్థాయిలో ప్లాంట్ పై రివ్యూ చేయాలని ప్లాంట్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో పాటు ఆర్‌ఐఎన్‌ఎల్ సిఎండి అజిత్ కుమార్ సక్సేనా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ జాయింట్ సెక్రటరీ అబిజిత్ నరేంద్ర, డైరెక్టర్ జివిఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.