ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి..
x

ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాకముందే సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ స్పందన ఏంటంటే..


ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాకముందే సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఈ హామీలపై కసరత్తులు చేస్తామన్న చంద్రబాబు.. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అందరూ లేవనెత్తుతున్న హామీ ఉచిత బస్సు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? అసలు దీని గురించి చర్చలైనా జరుగుతున్నాయా? జరుగుతుంటే ఈ హామీ అమలులో ఎంత వరకు పురోగతి వచ్చింది? వంటి అనేక ప్రశ్నలు కూటమి ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఈసారైనా చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? లేకుంటే అధికారం వచ్చేసింది కదా ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారా అని కూడా విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ హామీ అమలుపై రోజురోజుకు పెరుగుతున్న సందిగ్దతపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు కావొచ్చు అన్న అంశంపై క్లారిటీ ఇచ్చారు.

బాధ్యతలు స్వీకరించిన మంత్రి

ఆంధ్రప్రదేవ్ రవాణ, క్రీడల శాఖ మంత్రిగా రామ్‌ప్రసాద్ రెడ్డి.. ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ఉత్తర్వులపై తన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ హామీ అమలుపై చర్చలు చేస్తున్నామని, తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ హామీపై సమీక్ష నిర్వహిస్తున్నామని, అధికారుల సలహాలు సూచనలు స్వీకరించిన అనంతరం ఈ హామీ అమలుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు.

ఇప్పటికే అధికారులతో చర్చలు

ఉచిత బస్సు ప్రయాణం హామీని ఏ విధంగా అమలు చేయాలని, ఏయే బస్సుల్లో ప్రయాణం ఉచితం చేయాలి అన్న అంశాలపై ఆర్‌టీసీ అధికారులతో చర్చిస్తున్నామని రామ్‌ప్రసాద్ వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న బస్సుల సంఖ్య, వాటికి చేయించాల్సిన మరమ్మతులు, వాటికి అయ్యే ఖర్చు, ఎన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయాలి వంటి అనేక అంశాలపై చర్చించామని, వాటికి కావాల్సిన నిధుల గురించి కూడా ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఆంధ్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని నెల రోజుల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దాంతో పాటుగా ఆర్‌టీసీ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని వివరించారు.

వారిని ప్రోత్సహిస్తాం

అనంతరం ఆయన క్రీడా రంగం గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ప్రతి క్రీడాకరుడికి మెరుగైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా ఏ క్రీడ నేర్చుకోవాలన్నా అది వీలయ్యేలా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Read More
Next Story