గాంధీ జయంతి నాటికి లెగసీ వేస్ట్‌ను తొలగించేస్తాం
x

గాంధీ జయంతి నాటికి లెగసీ వేస్ట్‌ను తొలగించేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు 7,500 టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో చెత్త లేకుండా చేస్తామని, అక్టోబరు 2 గాంధీ జయంతి నాటికి గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన లెగసీ చెత్తను పూర్తి స్థాయిలో తొలగించేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మచిలీపట్నం పర్యటన చేశారు. అందులో భాగంగా మచిలీపట్నంలో లెగసీ డంపింగ్‌ యార్డును పరిశీలించారు. చెత్త బయో మైనింగ్‌ గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పి నారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 72లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 13లక్షల టన్నుల చెత్త మిగిలి పోయిందని, దీనిని తొలగించాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన దానిలో మచిలీపట్నంలోనే 19వేల టన్నుల చెత్తను తొలగించినట్లు పేర్కొన్నారు. అదనంగా మెషీన్ల సాయంతో మిగిలిపోయిన చెత్తను శరవేగంగా తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ద్వారా ప్రజల్లో చెత్త నిర్వహణ మీద అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఘన, ద్రవ వ్యర్థాలను తొలగించేందుకు అవసరమైన ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు 7,500 టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ ఘన వ్యర్థాల నిర్వహణకు వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ద్రవ వ్యర్థాల నిర్వహణకు మరో రెండేళ్లల్లో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Read More
Next Story