రెండేళ్లల్లో ట్రైబల్‌ యూనివర్సిటీని పూర్తిచేస్తాం
x

రెండేళ్లల్లో ట్రైబల్‌ యూనివర్సిటీని పూర్తిచేస్తాం

విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై శాసన సభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలపై అసెంబ్లీలో మంత్రి లోకేష్‌ మాట్లాడారు.


రెండేళ్లలో ట్రైబల్‌ యూనివర్సిటీ పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్‌ యూనివర్సిటీ స్థలం మార్చి, ఐదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని, రాజకీయంగా తమకు మంచిపేరు వస్తుందనే జగన్‌ ప్రభుత్వం ఆ స్థలాన్ని మార్చారని అన్నారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే యూనివర్శిటీని నిర్మిస్తామని, వచ్చే రెండేళ్లలో దానిని పూర్తి చేస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై శాసన సభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేష్‌ సమాధానమిస్తూ వివరాలను వెల్లడించారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్‌ వైజ్‌ ఫోకస్‌ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

అనంతపురం జిల్లాకు కియా తెచ్చారు, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరులో విండ్‌ టర్భయిన్, కర్నూలులో రెన్యువబుల్‌ ఎనర్జీ, సెల్‌ ఫోన్, ఉభయ గోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఐటి, మెడికల్‌ డివైస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారని చెప్పారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖకి, ఎన్‌ఐటి తాడేపల్లిగూడెంకు, ట్రిపుల్‌ ఐటి కర్నూలుకు, సెంట్రల్‌ వర్సిటీ అనంతపురానికి కేటాయించారని అన్నారు. ఐఐటి తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారని, ఎన్‌ఐటి తాడేపల్లిగూడెంకు ఏప్రిల్‌ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్‌ 16, 2016లో 240 ఎకరాలు భూములు, సెంట్రల్‌ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్‌ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్‌ కు 255 ఎకరాలు, ట్రిపుల్‌ ఐటిలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారని చెప్పారు. ఆయా విద్యాసంస్థలకు పెండింగ్‌ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.
Read More
Next Story