‘రాజముద్రతో పాసుపుస్తకమిస్తా’.. కుప్పంపై చంద్రబాబు వరాల జల్లు..
x

‘రాజముద్రతో పాసుపుస్తకమిస్తా’.. కుప్పంపై చంద్రబాబు వరాల జల్లు..

కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. నియోజకవర్గ ప్రజలపై హామీల జల్లు కురిపించారు. కుప్పంకు విమానాశ్రయం తీసుకురావడం తన కల అని, దానిని ఈసారి నెరవేరుస్తానని చెప్పారు.


సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఈరోజు కుప్పం ప్రజలను ఉద్దేశించి ఆయన ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కుప్పం ప్రజల అభిమానం తానెన్నటికీ మరువనని, మళ్ళీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగా పుడతానంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. కుప్పం నుంచి తాను పోటీ చేసిన ప్రతిసారీ భారీ మెజార్టీతో గెలిపించిన మీకు పాదాభివందనం అని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో రౌడీ రాజ్యం సాగిందని, ఇకపై అది కుదరని వెల్లడించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా అతిగా విర్రవీగితే వారికి వైసీపీకి పట్టిన గతే పడుతుంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది వైసీపీ’’ అని వైసీపీ దుస్థితిని గుర్తు చేశారు. టీడీపీకి ఉన్న 23 కుర్చీలను కూడా మడత పెడతామంటూ గీర్వానాలు పలికిన వైసీపీకి ప్రజలు 140 కుర్చీలు మడతపెట్టేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘కుప్పం ఓ ప్రయోగశాల’

‘‘నా రాజకీయ జీవితంలో కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను. ఏ అభివృద్ధి పని అయిన ఇక్కడి నుంచే ప్రారంభిస్తాను. ఈ ఎన్నికల్లో మా కూటమి ఎమ్మెల్యేలందరూ ఉన్నత విద్యలు చదివిన వారే. మంత్రులుగా కూడా యువతకే అవకాశం కల్పించాం. ఈ ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా. గత ఐదేళ్లు రైడీయిజం, దౌర్జన్యం, అరాచకాలను చూశారు. కుప్పంలో జరిగిన గ్రానైట్ దోపిడీ కేజీఎఫ్‌ను మరిపిస్తుంది. నేను కుప్పానికి వస్తాను అంటే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి వేధించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘అదే చివరి రోజు’

‘‘ఈరోజున ఎన్‌టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా. ఇకమీదట కుప్పంలో రౌడియిజం చేసినా, చేయాలని చూసినా వారికి అదే చివరి రోజు అవుతుంది’’ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ‘‘నియోజకవర్గంలోని అన్ని రోడ్లు బాగుచేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం. కుప్పం మున్సిపాలిటీని వందకు పైగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధి పనులను ఈరోజు నుంచే ప్రారంభిస్తాం. ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తాం. కుప్పాన్ని పచ్చదనానికి కేరాఫ్‌గా మారుస్తాం. వీటన్నింటితో పాటు కుప్పానికి విమానాశ్రయం తీసుకురావాలి అన్నది నా కల. దానిని వీలైనంత త్వరగా నెరవేరుస్తా. దాంతో పాటుగా ఎయిర్ కార్గ్ ద్వారా మన పంటల్ని విదేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తాం’’ అని చెప్పారు.

‘రాజముద్ర వేసి పాస్‌సుస్తకాలు ఇస్తా’

730 కిలోమీటర్ల నుంచి శ్రీశైలం నుంచి వీకోట వరకు హంద్రనీవా కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చామని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. గత ప్రభుత్వం కేవలం ఐదు కిలోమీటర్ల పనే చేసిందని దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల ముందు మాత్రం సినిమా సిట్టింగ్‌లు వేసి డ్రామాలు ఆడారు. కానీ ఈరోజున చెప్తున్నా హాంద్రనీవా నీళ్లను కుప్పానికి తీసుకువస్తా. ఇప్పటికీ రైతన్న పాసుపుస్తకంపై ఆ దిక్కుమాలిన బొమ్మే ఉంది. అతి త్వరలోనే పాసు పుస్తకంపై రాజముద్ర వేసి మీకు అందిస్తా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చిహ్నంపై కసరత్తులు చేస్తున్నాం’’ అని చెప్పారు చంద్రబాబు.

Read More
Next Story