కౌలు రైతుల కోసం పాత చట్టం.. ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు
x

కౌలు రైతుల కోసం పాత చట్టం.. ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు

రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందన్న తరహాలోనే కూటమి సర్కార్ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందన్న తరహాలోనే కూటమి సర్కార్ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కేవలం సొంత భూములు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గాడి తప్పిన సహకార వ్యవస్థను మళ్ళీ దారికి తీసుకొస్తామని, దాని ద్వారానే రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కౌలు రైతుల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని అన్నారు. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఏ ప్రభుత్వానికైనా, ప్రజలకైనా వ్యవసాయం, సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవని వ్యాఖ్యానించారు. ఈ రంగాలు లేని సమాజాన్ని ఊహించలేమని వివరించారు.

పాత చట్టమే తెస్తాం

రైతుల మేలు కోసం 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 2016లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చేసిన చట్టాన్నే మళ్ళీ అమలు చేస్తామని భరోసా కల్పించారు. ‘‘2019లో తెచ్చిన కొత్త చట్టంలో భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలంటూ వైసీపీ సర్కార్ మెలిక పెట్టడంతో ఎందరో కౌలురైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ చట్టం వల్ల కౌలు రైతులకు అన్యాయమే జరుగుతోంది. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేస్తాం. తద్వారా పారదర్శకంగా సేవలు అందించడం సులభమవుతుంది. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలి. చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ఎన్‌డీఏ ప్రభుత్వం ధ్యేయం’’ అని వ్యాఖ్యానించారు.

కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా

రైతులకు అండగా నిలిచే సహకార సంఘాలను గొప్పగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు అచ్చెన్నాయుడు. సహకార సంఘాలను కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా తీర్చి దిద్దాలని, వీటిలో తీసుకొచ్చే నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని అన్నారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని, అలాగే రైతులను బాగా చూసుకునే సహకార సంఘాలను మనం బాగా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో సొంత రౌతుల కన్నా కౌలు రైతుల సంఖ్యే ఎక్కువ అని, అందుకే వారికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరించారు.

90శాతం రైతులు వారే

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం చేస్తున్న రైతుల్లో 90శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. సొంత రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్న క్రమంలో కౌలు రైతులే సాగు బాధ్యత తీసుకుంటున్నారని చెప్పారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం కౌలు రైతులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక రైతులు నానా కష్టాలు పడ్డారని, అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాకతో రైతాంగం ఊపిరి పీల్చుకుంటుందని, వ్యవసాయానికి ఊతమిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేయాలని దిశానిర్దేశం చేశారాయన.

Read More
Next Story