
రేషన్ షాపుల ద్వారా గోధుమలు కూడా అందిస్తాం
మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు గోధుమలు కూడా అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సోమవారం ఆయన ప్రారంభించారు. విజయవాడ వలక్ష్మీనగర్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తయారు చేసినట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌ను కూడా పొందిపరచినట్లు పేర్కొన్నారు.
లబ్ధిదారులు స్మార్ట్ కార్డుల ఆధారంగా రేషన్ తీసుకోగానే ఆ సమచారం కేంద్ర, జిల్లా కార్యాలయాలకు చేరిపోతుందన్నారు. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అన్ని చర్యలు చేపట్టామని, అందులో భాగంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను కూడా తయారు చేసినట్లు చెప్పారు. ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో సోమవారం ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్టున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 15 నాటికి రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తామన్నారు. చిరునామాలు మార్చిన వారికి, కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా ఈ కార్డులను పంపిణీ చేస్తామన్నారు.
అంతేకాకుండా రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ–పోస్ యంత్రాలను కూడా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఏపీలో మొత్తం 29,797 రేషన్ షాపులు ఉన్నాయని, అయితే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ దుకాణాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా అవసరమైన చోట సబ్ డిపోలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Next Story