రక్షించలేదు.. మేమే చెక్కల సాయంతో బయటపడ్డాం
x

రక్షించలేదు.. మేమే చెక్కల సాయంతో బయటపడ్డాం

ఫ్లడ్‌ చుట్టుముట్టింది. కాపాడాలని ఎన్‌ఆర్‌ఎఫ్‌ను కోరాం. రాలేదు. ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ బృందం చేపట్టిన గ్రౌండ్‌ రిపోర్టులో వెలుగులోకి హృదయ విదారక సంఘటనలు.


బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల క్షేత్ర స్థాయి పరిశీలనకు ఇటీవల దిఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ బృందం పర్యటన చేపట్టింది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం నుంచి బయలు దేరి రెడ్‌ సర్కిల్, సూర్యారావుపేట సిగ్నల్‌కు చేరుకున్నాం. ఏలూరు రోడ్డు క్రాసింగ్‌ సిగ్నల్‌ ఇది. విజయవాడ నగరంలో పెద్ద సిగ్నల్‌ పాయింట్‌లలో ఇదొకటి. ఇక్కడ ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువుగా ఉంటుంది. అటు ఏలూరు రోడ్డులో వెళ్లే వాహనాలు, ఇటు సూర్యారావుపేట నుంచి వచ్చే వాహనాలు ఎక్కువ ఉండటం వల్ల సిగ్నల్‌ దాటడానికి సమయం ఎక్కువ పట్టింది. దాని నుంచి బయటపడి కొత్తవంతెన దాటి సాంబమూర్తి రోడ్డులోకి చేరుకున్నాం.

కాస్తా ముందుకు వెళ్లిన తర్వాత మలుపు తీసుకొని ఎడమ వైపునకు తిరిగి బిఆర్‌టీఎస్‌ ఫుడ్‌ జంక్షన్‌ మీదుగా సత్యనారాయణపురంలో ఎంటర్‌ అయ్యాం. అక్కడ నుంచి రాఘవేంద్ర థియేటర్‌ రోడ్డు, దేవీనగర్‌ రోడ్డులను దాటుకొని భగత్‌సింగ్‌ రోడ్డు మీదుగా సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ దిగి అజిత్‌సింగ్‌నగర్‌ చేరుకున్నాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. బుడమేరు వరదల సమయంలో సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ ఫేమస్‌ అయ్యింది. ఈ ఫ్లైఓవర్‌కు అటువైపు అంతా ఫ్లడ్‌ వాటర్‌తో ముంచెత్తింది. ఈ మార్గం ద్వారానే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఇటు నుంచి వెళ్లే వారిని ఈ ఫ్లైఓవర్‌ మీద నుంచే ఆపేసేవారు. అటు నుంచి వచ్చే వారిని ఫ్లైఓవర్‌ మార్గం గుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే వారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్‌ ఫేమస్‌ అయింది.

ఫ్లైఓవర్‌ దిగిన తర్వాత పైపుల రోడ్డు, పాయకాపురం చేరుకున్నాం. దాదాపు ఏడు అడుగులకుపైగా వరద నీరు పారిన ఈ ప్రాంతాల్లో షాపులన్నీ ఓపెన్‌ చేసి ఉన్నారు. షాపుల్లో తడిసి పోయిన వస్తువులను ఎండకు ఆరబెట్టుకుంటున్నారు. ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. జనసంచారం కూడా పెరిగింది. రోడ్డు మీద ఉన్న చెత్తను, మురుగు నీటిని వాహనాల ద్వారా విఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. అక్కడ నుంచి ఎడమ వైపుకు తిరిగి కండ్రిక చేరుకున్నాం. బోస్‌ సెంటర్‌ వద్ద శానిటేషన్‌ కార్యాలయం ఉంది. బ్లీచింగ్‌ పౌవడర్, సున్నప్పు బస్తాలు నిల్వగా అక్కడ పేర్చి ఉన్నాయి. పని చేసే సిబ్బంది కోసం మినీ ట్రక్‌లో నుంచి వాటర్‌ బాటిల్స్‌ను దింపి కార్యాలయంలో వేస్తున్నారు. అక్కడ నుంచి శివారు ప్రాంతమైన జర్నలిస్టు కాలనీకి చేరుకున్నాం.
మార్గ మధ్యలో ఆ కాలనీల వాసులు గుంపులుగా పరుగెతుతున్నారు. ఒక కూడలిలో ఒక ట్రక్‌ ఆగి ఉంది. అప్పటికే దాని చుట్టూ జనాలు మూగి ఉన్నారు. కొందరు అసంతృప్తిగా వెనక్కు వస్తున్నారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ట్రక్‌ అది. వరద బాదితులకు దుప్పట్లు, బియ్యంతో పాటు కొన్ని సరుకులు పంపిణీ చేస్తూ కనిపించారు. జర్నలిస్టు కాలనీలో కూడా ఇదేరకంగా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వాటిని తీసుకొని ఇంటికి వస్తున్న వారు మాకు ఎదురుపడ్డారు. ఆ వస్తువులు తీసుకున్న ఆనందం కంటే సర్వం పోగొట్టుకున్నామన బాధే బాధితుల్లో కనిపించింది. వారిని దాటుకొని ముందుకెళ్లాం. ఆ వీధి చివరలో వరదలకు మగ్గి పోయిన వస్తువులను బయటేసి ఉన్నాయి. అందులో రూ. 1.50లక్షలు విలువ చేసే టీవీ, రూ. 30వేలు విలువ చేసే డబుల్‌ కాట్‌ మంచంతో పాటు వరద నీటికి ముదై్దపోయిన వస్తువులన్నీ ఉన్నాయి. రెండు వారాల పాటు నీటిలోని ఉండి పోవడంతో చీకి పోయాయి. వాసన వస్తున్నాయి. పనికొస్తాయేనని ఎండకు ఆరబెట్టుకుంటున్నారు.
ఈ లోగా రెండు వాటర్‌ బాటిల్స్‌ తీసుకొస్తున్న వ్యక్తి అక్కడకు వచ్చారు. ఆ వాటర్‌ బాటిళ్లు స్వచ్ఛంద సంస్థ వాళ్లు ఇచ్చినవి. తాగడానికి కూడా నీళ్లు లేవు సార్‌.. సర్వం కోల్పోయాం. అన్నీ తడిసి పోయాయి. ఏమీ మిగల్లేదని చెప్పి వాపోయారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఇంట్లో ఉన్న మురుగు నీటిని బయటకు చిమ్ముతున్నారు. లైజాల్, డెటాల్, ఫీనాల్‌ బాటిళ్లతో మరో వ్యక్తి వచ్చారు. వాటిని శుభ్రం చేస్తున్న వారికి ఇస్తూ ఇవి సరిపోతాయా క్లీన్‌ చేయడానికి అని వారిని అడిగి, మా జీవితం మళ్లీ మొదటికి వచ్చిందని మా వైపు చూస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
అతనే ఆ ఇంటి యజమాని. ఆయన ఒక ప్రైవేటు ఉద్యోగి. చాలా కష్ట పడి ఇల్లు కట్టుకున్నారు. వచ్చిన దాంట్లో కూటబెట్టుకొని మంచాలు, టీవీలు, ఫ్రెజ్, ఇతర ఫర్నిచర్‌ సమకూర్చుకున్నారు. వరద వస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముందుగా అలెర్ట్‌ చేయలేదు. వరద ప్రవాహం ముంచుకొచ్చేసింది. ఇళ్లల్లోనే చిక్కుకొని పోయాం. కనీసం సమాచారమైనా ఇచ్చి ఉంటే ఏదోక విధంగా తిప్పలు çపడి బయట పడేవాళం. వరద పెరగడంతో దీనిని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఇంట్లో నుంచి వెళ్లేందుకు భయమేసింది. తమను కాపాడాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వాళ్లను కూడా రిక్వెస్ట్‌ చేశాం. కానీ స్పందన లేదు. వచ్చేందుకు వారు కూడా సాహసం చేయలేక పోయారు. కరెంట్‌ లేదు. ఇంట్లోకి నీళు వచ్చేసాయి. ఇక ఏమి చేయాలో దిక్కతోచ లేదు. ఏదైతే అదవుతుందని ప్రాణాలకు తెగించాం. చెక్కలను కట్టుకొని ఇంట్లో వాళ్లను దాటించుకొని బయట పడ్డాం. వరద నీళ్లు తగ్గేంత వరకు బయట హోటల్లో ఉన్నాం. ఇప్పుడే వచ్చి క్లీన్‌ చేసుకుంటున్నామని బాలాజీ కన్నీటి పర్యంత మయ్యారు. ప్రభుత్వం సాయం అందిస్తారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నట్లు ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. బుడమేరు వరదలు లక్షలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసింది.
Read More
Next Story