షర్మిలకు రక్షణ బాధ్యత తీసుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌
x

షర్మిలకు రక్షణ బాధ్యత తీసుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

ఏలూరు జిల్లాలో ఉచిత గ్యాస్‌ సిలీండర్ల పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించారు.


ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణ గా ఉంటుందని, అందులో భాగంగా షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. బాధ్యత గల నాయకురాలిగా షర్మిల ఎన్ని విమర్శలైనా చేయొచ్చని అన్నారు. ప్రభుత్వానికి అప్పీలు చేసుకోండి, రక్షణ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటామని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. నా ప్రాణాలకు రక్షణ కావాలి. అదనంగా సెక్యురిటీ కల్పించాలని షర్మిల అడిగారని, దీనిపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ అమ్మా.. మీ అన్న జగన్‌ సెక్యురిటీ కల్పించలేక పోయాడేమో కానీ. తమ ప్రభుత్వం తప్పకుండా రక్షణ కల్పిస్తుందని షర్మిలకు హామీ ఇచ్చారు.

తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదనే విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఆడబిడ్డలను ఇబ్బందులు పెట్టేవిధంగా పోస్టులు పెడుతున్నారని, ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనిస్తోందని అన్నారు. ఆడబిడ్డల విషయంలో ఏమాత్రం తేడా వచ్చిన తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటామని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా.. వైఎస్‌ఆర్‌సీపీ నేతల నోళ్లు ఆగడం లేదన్నారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో దీపం 2.0 కింద ఉచిత సిలీండర్ల పథకాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్‌ మాట్లాడారు. దీపం పథకం వంటింట్లో వెలుగు కోసం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జగన్నాథపురం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడ అంజనేయ సుబ్రమణ్య అనంత హోమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, పిఆర్‌ అండ్‌ ఆర్టీ కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్‌తో పాటు ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆయన సమావేశం అయ్యారు.

Read More
Next Story