మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
x

మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి

అభివృద్ధి సంక్షేమ ఫధకాలు అర్హులైన లబ్దిదారులందరికీ అందేలా కృషి చేయాలి అని సిఎస్‌ విజయానంద్‌ పేర్కొన్నారు.


దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చేందుకు అనేకమంది తమ ప్రాణ త్యాగాలు చేశారని, ఆ మహనీయులందరి త్యాగాలను మనందరం ఒకసారి స్మరించు కోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ పేర్కొన్నారు. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన వేడుకలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ముఖ్య అతిధిగా పాల్గొని జాతిపిత మహాత్మాగాంధి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిఎస్‌ మాట్లాడుతూ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభా కాంక్షలు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధి, రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్‌ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామ రాజు వంటి మహనీయులతో పాటు ఆనాడు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిద్దామని చెప్పారు.

సమాజంలోని పేదల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పెద్దఎత్తున అమలు చేయడం జరుగుతోందని.. ఆయా పథకాల లబ్దిని గ్రామ స్థాయి వరకూ అర్హులైన ప్రతి లబ్దిదారుకి సక్రమంగా చేరేలా మనం అందరం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్‌ విజయానంద్‌ పిలుపునిచ్చారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సమాజంలోని ఆర్ధిక అసమానతలను తొలగించే ఉద్యేశ్యంతో ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర పి–4 ఫౌండేషన్‌ ను ప్రారంభించడం జరిగిందని, ఆకార్యక్రమాన్ని విజయంవంతంగా అమలు చేసేందుకు అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని సిఎస్‌ సూచించారు.
పర్యావరణానికి మరీ ముఖ్యంగా మానవాళి మనుగడకు ముప్పుగా తయారౌతున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని దశలవారీగా తగ్గించేందుకు 2026 జూన్‌ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఎపిని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. దానిలో భాగం గానే నేటి నుండి రాష్ట్ర సచివాలయంలో సింగిల్‌ యూజ్‌(ఒకసారి వాడి పడేసే)ప్లాస్టిక్‌ ను పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. దశల వారీగా అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఇతర పట్టణాలు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని సిఎస్‌ విజయానంద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా, సిఎస్‌ఓ మల్లిఖార్జున, పలువురు పోలీస్‌ ధికారులు, సిబ్బంది, సచివాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం సిఎస్‌ విజయానంద్‌ చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
Read More
Next Story