పింఛన్ ప్రయాణం.. ఆ ఘనత చంద్రబాబుదే: మంత్రి వీరాంజనేయ
x

పింఛన్ ప్రయాణం.. ఆ ఘనత చంద్రబాబుదే: మంత్రి వీరాంజనేయ

పింఛన్ పంపిణీపై మంత్రి వీరాంజనేయ స్వామి స్పందించారు. రూ.30 దగ్గర మొదలైన పింఛన్‌ను రూ.4వేలకు చేర్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.


జూలై 1వ తేదీ నుంచి చెప్పినట్లుగానే పింఛన్ పంపిణీని విజయవంతంగా చేపట్టింది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి మరి కొందరికి పింఛన్‌ను అందించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే, మంత్రులు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇందులో భాగంగానే తాడెపట్టిలో నిర్వహించిన పింఛన్ పంపిణీలో చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్, స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు.

రాష్ట్రమంతా పండగ వాతావరణం

పెంచిన పింఛన్ తమ చేతికి వస్తుందన్న ఆనందంతో పింఛన్ కోసం లబ్ధిదారులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారు భావించిన విధంగానే ఒకటోతేది తెల్లవారుజాము నుంచే ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం ప్రారంభించారు. లబ్ధిదారులతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దీనిపై పలువురు ఇదేమైనా ఇప్పుడు చేపట్టిన పథకమా.. ఇంత హడావుడీ హంగామా చేస్తున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఈ ప్రభుత్వం పింఛన్‌ను వెయ్య రూపాయలు పెంచడమే కాకుండా దానిని ఏప్రిల్ నెల నుంచే అమలు చేసి ఆ నెల నుంచి రావాల్సిన బకాయిలను కలిపి ఒకేసారి ఈ నెల అందించడంతో లబ్దిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని, అందుకే పండుగ వాతావరణం నెలకొందే తప్ప తామేమి హడావుడీ చేయడం లేదని టీడీపీ శ్రేణులు విమర్శలను తిప్పికొడుతున్నాయి.

అంతేకాకుండా వాలంటీర్లు లేనిదే ఇంటికి పింఛన్ ఇవ్వలేమంటూ చేతులెత్తేసి 33 మంది వృద్ధుల మరణాలకు కారణమైన వైసీపీ.. ఇప్పుడు తాము వాలంటీర్ల సహాయం లేకుండా పింఛన్లను ఇంటి దగ్గరకే పంపిణీ చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వృద్ధులకు రూ.4వేల పింఛన్ ఇవ్వడంపై మంత్రి వీరాంజనేయ స్వామి స్పందించారు.

రూ.30 నుంచి రూ.4 వేలకు

పింఛన్ అందించడం అనే సంప్రదాయం స్వర్గీయ ఎన్‌టీఆర్ హయాంలో మొదలైంది. ‘‘రూ.30తో పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్‌టీఆర్. దానిని 1995లో రూ.75 అయింది. అది కాస్తా ఇప్పుడు రూ.4వేల చేరింది. రూ.30 దగ్గర మొదలైన పింఛన్ ప్రయాణాన్ని ఈరోజు రూ.4వేల మైలురాయికి చేర్చిన ఘనత సీఎం చంద్రబాబుదే. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పథకం.. పండగ వాతావరణంలో మొదలైంది. ప్రకాశం జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే లబ్ధిదారులకు రూ.7 వేలు అందిస్తున్నాం. టీడీపీకి ఉన్న నిబద్దత ఇది’’ అని చెప్పుకొచ్చారు డోలా వీరాంజనేయ స్వామి.

అందరికీ ఈరోజే

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈరోజే పింఛన్ అందించనున్నామని మంత్రి వివరించారు. ప్రతి లబ్ధి దారు పింఛన్‌ను ఇంటి దగ్గర నుంచే పొందుతున్నారని, అందరికీ పింఛన్ అందిందా అనే అంశాలను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తామని చెప్పారు. దీంతో పాటుగా రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే పింఛన్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటుగానే ఎన్నికల ప్రచారంలో చెప్పిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

Read More
Next Story