ఉత్తరాంధ్రకు నీటి వాటాను తేల్చాలి
x

ఉత్తరాంధ్రకు నీటి వాటాను తేల్చాలి

నదీ జలాల నీటి వాటా మీద ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.


ఉత్తరాంధ్రకు చట్టబద్దంగా, రాజ్యాంగ పరంగా రావలసిన నీటి వాటాను నిర్ణయించి తేల్చాలని, ఉత్తరాంధ్ర నుంచి గోదావరిలో కలుస్తున్న శబరి, సీలేరు మిగులు జలాల నీటి వనరులను వినియోగించుకునేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు, రైతుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర అధ్యాయన వేదిక గౌరవ అధ్యక్షులు, ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం సీఎం చంద్రబాబును కోరారు. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు.

ఫ్రొఫెసర్‌ చలం ఏమన్నారంటే..
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో మీరు గోదావరి మిగులు జలాల అంశాన్ని లేవనెత్తినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ విషయంలో, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంతో సహా ఉత్తరాంధ్ర ప్రాంతం నీటిపారుదల అవసరాలపై మీరు దృష్టి సారించి ఈ ప్రాంతపు ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాము. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలు చెరువులు, బావుల మీద ఆధారపడి 4.64 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయని, పశ్చిమ గోదావరి, ఏలూరు కలిపి మరో 4.27 లక్షల హెక్టార్లు ఎక్కువగా కాలువల ద్వారా అందే నీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విషయాలు సీఎంవో కార్యాలయంలో పని చేసే అధికారులకు కూడా తెలుసు. ఒకప్పుడు వెనుకబడిన ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల నీటిపారుదల సామర్థ్యం కూడా 3 లక్షల హెక్టార్ల భూమిని కలిగి ఉన్నాయి. 8 జిల్లాలు కలిగిన రాయలసీమ ప్రాంతంలో మొత్తం 10.02 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. తీరప్రాంత జిల్లాలకు నదుల వంటి నమ్మదగిన నీటి వనరులు లేనప్పటికీ, ఉత్తర ఆంధ్ర ప్రాంతాలలో గోదావరితో పాటు సీలేరు, శబరి నదులతో సహా 16 నదులు ఉండటం గమనించదగ్గ విషయం. ఇతరులకు ఇచ్చే ముందు అంటే ఈ నీటిని రాయలసీమ ప్రాంతపు ప్రజలకు ఇచ్చే ముందు మాకు చెందిన నీటిలో వాటా అడగడం ఉత్తర ఆంధ్ర ప్రజల నిజమైన హక్కు. చట్టబద్ధమైన డిమాండ్‌ కూడా.
ఉత్తర ఆంధ్రలోని వెనుకబడిన గిరిజన ప్రాంతాల నుండి శబరి, సీలేరు ద్వారా గోదావరిలోకి ప్రవహించే మిగులు జలాలు అని పిలవబడే ఉత్తర ఆంధ్ర నీటి వనరులను తాము వినియోగించుకోవడానికి ఒక కమిటీని నియమించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజల తరపున, నదులు ప్రవహించే భూముల ద్వారా ప్రజల అభివృద్ధి కోసం రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఉత్తర ఆంధ్ర చట్టబద్ధమైన వాటాను ముందుగా నిర్ణయించాలని మేము మిమ్మల్ని కోరుతున్నామంటూ ఆ లేఖలో ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం పేర్కొన్నారు.
Read More
Next Story